నిజామాబాద్ అర్బన్ : మెడికల్ కళాశాలకు నిధుల కొరత వేధిస్తోంది. గత రెండు సంవత్సరాలుగా కళాశాల కోసం అనుమ తి కోసం తంటాలు పడిన అధికారులు ప్రస్తుతం నిధుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నిర్వహణ కోసం కావల్సిన నిధులు అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కళాశాల అవసరాల మేరకు తక్షణమే రూ. 91 కోట్లు మంజూరు చేయాలని ప్రిన్సిపాల్ జిజియాబాయి గత జూన్‌లో ఉన్నతాధికారులకు విన్నవించారు. అయినా, నేటికీ స్పందన లేదు.
అందుబాటులో లేని భవనాలు
కళాశాలలో రెండవ సంతవ్సరం మొదలు కావడంతో నిధుల అవసరం ఏర్పడింది. ముఖ్యంగా రెండవ సంవత్సరం విద్యార్థులకు వసతి గృహాలు, ప్రొఫెసర్ల నివాసాల నిర్మాణానికి నిధుల లేమి అడ్డంకిగా మారింది. మ్యూజియం ఏర్పాటు కోసం సుమారు రూ. 20 లక్షలు కావాలి. అంతేకాకుండా, ఫార్మ కాలేజీ ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటికి పెద్ద మొత్తంలో నిధులు అవసరమవుతాయి. వచ్చే ఏడాది మూడవ సంవత్సరం విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, ప్రస్తుతం భవన నిర్మాణాలు తక్షణమే పూర్తి చేయాలి. అలాగే ఆసుపత్రి, కళాశాలకు పరికరాలను కొనుగోలు చేయాలి. ప్రయోగశాలల సౌకర్యం కల్పించాలి.
వీటి కోసం ఉన్నతాధికారులకు విన్నవించి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. అప్పుడు కళాశాల నిర్వహణ కోసం రూ. 100 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతోనే కళశాల ఏర్పాటు జరిగింది. అనంతరం మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి హయాంలో మరో రూ. 60 కోట్లు మంజూరయ్యాయి. వీటితోనే నేటికీ కళాశాల కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, ఇటీవలే అటవీశాఖ, ఆర్‌అండ్‌బీ స్థలాన్ని మెడికల్ కళాశాలకు స్వాధీనం చేశారు. ఇందులో రెండవ సంవత్సరం విద్యార్థులకు భవనాలు, గెస్ట్‌హౌస్‌లు నిర్మించే అవకాశం ఉంది. గత ఆగస్టు నెలలో సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనకు వచ్చినపుడు. రూ. 60 కోట్ల రూపాయలను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నిధుల విడుదల మాత్రం జరుగడం లేదు.
మెడికల్ కళాశాలకు నిధుల కొరత
Published Fri, Sep 12 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 PM
Advertisement