అరచేతిలో హాస్టల్ దునియా! | Increasing of hostel accommodation | Sakshi
Sakshi News home page

అరచేతిలో హాస్టల్ దునియా!

Published Sat, Jun 6 2015 12:11 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM

అరచేతిలో హాస్టల్ దునియా!

అరచేతిలో హాస్టల్ దునియా!

12 నగరాల్లో.. 1,800 హాస్టళ్ల వివరాలు నమోదు
రూ. 50 లక్షల నిధులు సమీకరించిన హాస్టల్ దునియా.కామ్
 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్తగా హైదరాబాద్‌కొస్తే ఎక్కడుండాలి! బంధువులో.. స్నేహితులో ఉంటే సరి. లేకపోతే హాస్టలే గతి. మరి ‘ఎక్కడ.. ఏ హాస్టల్ అయితే బాగుంటుంది? ఈ విషయం ఎవరైతే కరెక్ట్‌గా చెబుతారు!!’ ఇప్పుడివన్నీ సిల్లీ క్వశ్చన్స్. ఎందుకంటే హాస్టల్‌దునియా.కామ్‌లోకి వెళితే చాలంటున్నాడు దీని వ్యవస్థాపకుడు రాజు అంబరగొండ. హైదరాబాద్‌లోనే కాదు దేశవ్యాప్తంగా 12 నగరాల్లోని హాస్టల్ వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచాడు కూడా. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..

కళాశాలలో చదువుకునేందుకు నగరానికొచ్చిన కొత్తలో సరైన హాస్టల్ సదుపాయం లేక చాలా ఇబ్బంది పడ్డాను. జస్ట్ డయల్ ద్వారా వెదికితే.. అడ్రస్ ఉంటుందే తప్ప ఆ హాస్టల్లోని సదుపాయాల గురించి ఉండదు. అప్పుడే అనిపించింది ఓ యూజర్‌ఫ్రెండ్లీ వెబ్‌సైట్‌లో నగరంలోని హాస్టల్ వివరాలను పెడితే బాగుంటుందని. అయితే వెబ్‌సైట్ డిజైనింగ్‌కు కొంత మొత్తం కావాలి. అందుకే చదువు పూర్తయ్యాక ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాను. నెలవారీ జీతంలో కొంత మొత్తం పోగు చేసి 2013 మార్చిలో హాస్టల్‌దునియా.కామ్ వెబ్‌సైట్‌ను డిజైన్ చేశాను.

రోజుకు 300 మంది యూజర్లు..
హాస్టల్‌దునియా.కామ్‌ను రోజుకు 300 మంది యూజర్లు వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు 12 లక్షల మంది యూజర్లు చూశారు. ఇందులో సగానికి పైగా వినియోగదారులు మహిళలే. హైదరాబాద్‌లో మొత్తం 900 హాస్టల్స్ వివరాలున్నాయి. ఎక్కువగా అమీర్‌పేట, మాదాపూర్ ప్రాంతాల హాస్టల్స్ వివరాల కోసమే వెతుకున్నారు. హాస్టల్‌దునియాను వినియోగించుకోవటమూ సులువే. వెబ్‌సైట్‌కి వెళ్లి మనకు కావాల్సిన సదుపాయాలను ఆప్షన్స్‌లో టైప్ చేస్తే చాలు. మన రిక్వెస్ట్‌కు తగిన హాస్టల్ అడ్రస్, ఫోన్ నంబర్‌తో సహా మన ముందుంటాయి.

ఏడాదికి రూ.6,000
ప్రస్తుతానికైతే హాస్టల్ దునియాలో నమోదు చేసిన హాస్టల్స్ నిర్వాహకుల నుంచి ఎలాంటి రుసుము తీసుకోవట్లేదు. ఉచితంగానే సేవలనందిస్తున్నాం. సంస్థ విస్తరణ, ఉద్యోగుల నియామకాల నేపథ్యంలో రెండు నెలల తర్వాత నుంచి ఏడాదికి రూ.6,000 ఫీజు వసూలు చేస్తాం. రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టేందుకు ఓ సంస్థ ముందుకొచ్చింది.
 
12 నగరాలు.. 1,800 హాస్టళ్లు..
సంస్థ పెట్టిన కొత్తలో హాస్టల్స్ వివరాలు కావాలని నిర్వాహకుల వద్దకు వెళితే చాలామంది తిరస్కరించారు. ఏ ఐటీ అధికారో పంపించి ఉంటారని భయపడ్డారు కూడా. చాలా ఓపికతో విషయం చెప్పి, వారి నుంచి వివరాలు తీసుకున్నాను. వెబ్‌సైట్‌ను ప్రారంభించాక కొన్ని రోజులకే కస్టమర్ల సంఖ్య పెరిగింది. దీంతో మా హాస్టల్ వివరాలూ వెబ్‌సైట్‌లో పెట్టండని నిర్వాహకులే ఫోన్ చే సే స్థాయికి ఎదిగాం. హాస్టల్‌దునియాలో అడ్రస్, ఫోన్ నంబర్ మాత్రమే పెట్టి ఊరుకోలేదు. హాస్టల్‌లో ఉన్న సదుపాయాలు, సింగిల్ రూమ్‌కు ఫీజెంత? డబుల్ షేరింగ్ ఎంత? ఏసీ ఉంటే ఎంత.. లేకపోతే ఎంత? ఇలా అన్ని వివరాలూ ఉంటాయి. ఆ హాస్టల్‌కు ఎంత దూరంలో ఏమేం సదుపాయాలుంటాయో కూడా ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోటా, నాగ్‌పూర్, కోయంబత్తూరు, భోపాల్, ఇండోర్, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, కాకినాడ నగరాల్లో మొత్తం 1,800 హాస్టల్స్ వివరాలు హాస్టల్‌దునియాలో ఉన్నాయి.
 
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement