భారత పునాదులు పటిష్టం
న్యూయార్క్: భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్టంగా ఉన్నాయని, వృద్ధిరేటు కూడా మెరుగుపడుతుందని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో జీడీపీ వృద్ధి మెరుగుపడుతుందంటూ... 8-9 శాతం ఆర్థిక వృద్ధి సాధించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. శనివారమిక్కడ అమెరికా కంపెనీల సీఈఓల ఫోరమ్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ద్రవ్యలోటును 4.8 శాతానికే కట్టడి చేస్తామని, కరంట్ అకౌంట్ లోటు(క్యాడ్)ను జీడీపీలో 2.5 శాతానికి తగ్గించగలమని ధీమా వ్యక్తం చేశారు.
ఆందోళన అనవసరం
దేశ మౌలిక, రక్షణ రంగాల్లో దీర్ఘకాలిక అవకాశాలు అపారంగా ఉన్నాయంటూ... పెట్టుబడులకు ఇది మంచి తరుణమని ప్రధాని చెప్పారు. భారత వృద్ధి అవకాశాలు, ఆర్థిక సంస్కరణలపై అపోహలు అవసరం లేదంటూ... పెట్టుబడులతో రావాలని అమెరికా కంపెనీలను ఆహ్వానించారు. ‘‘ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో వృద్ధి పుంజుకుంటుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఇటీవల కొన్ని చర్యలు తీసుకుంది. దీనికితోడు వర్షాలు బాగా పడుతున్నాయి.
అందుకే ఆర్థిక వృద్ధిపై ఆందోళన చెందాల్సిన పనిలేదు’’ అని అభయమిచ్చారాయన. వృద్ధి కొనసాగించడానికి పలు సంస్కరణలు తెచ్చాం. రిటైల్, టెలికాం రంగాలతో పాటు వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితిని పెంచాం. పెట్టుబడులకు అనుకూలంగా ఉండేలా, పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం’’ అని తెలియజేశారు. తమ చర్యల ఫలితాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో ప్రతిఫలిస్తాయని చెప్పారాయన. గతేడాది కన్నా ఈ ఆర్థిక సంవత్సరంలోనే అధిక వృద్ధి సాధిస్తామని చెప్పారు.