మహామాంద్యం(1921) తదుపరి అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది రెండో క్వార్టర్‌లో దాదాపు 33 శాతం క్షీణించింది. ఏప్రిల్-జూన్‌లో కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డవులతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడం ప్రభావం చూపింది. దీంతో గురువారం డోజోన్స్ 226 పాయింట్లు(0.9 శాతం) క్షీణించి 26,314కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 12 పాయింట్ల(0.4 శాతం) నష్టంతో 3,246 వద్ద ముగిసింది. నాస్‌డాక్ మాత్రం 45 పాయింట్లు(0.45 శాతం) బలపడి 10,588 వద్ద నిలిచింది.
ఫాంగ్ స్టాక్స్ జూమ్
క్యూ2లో పటిష్ట ఫలితాలు సాధించడంతో యునైటెడ్ పార్సిల్స్ 14.5 శాతం జంప్‌చేసింది. 2020 పూర్తి ఏడాదికి ఆశావహ అంచనాలు ప్రకటించడంతో తాజాగా చిప్ తయారీ కంపెనీ క్వాల్‌కామ్ కౌంటర్‌కు డిమాండ్ నెలకొంది. దీంతో ఈ షేరు 15 శాతం దూసుకెళ్లింది. క్యూ2(ఏప్రిల్-జూన్) ఫలితాలు ప్రకటించనున్న యాపిల్, అల్ఫాబెట్, ఫేస్‌బుక్, అమెజాన్ 0.5-1.2 శాతం మధ్య బలపడ్డాయి. దీంతో నాస్‌డాక్ లాభాలతో ముగిసింది. కాగా.. మార్కెట్లు ముగిశాక ఫలితాలు ప్రకటించడంతో ఫ్యూచర్స్‌లో ఫేస్‌బుక్ 8 శాతం, అమెజాన్ 6 శాతం చొప్పున జంప్‌చేశాయి. అల్ఫాబెట్ సైతం 2 శాతం ఎగసింది. దీంతో నేడు ఈ కౌంటర్లు నాస్‌డాక్‌కు మరోసారి బలాన్ని చేకూర్చే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
ఆసియా అటూఇటూ
జులైలో తయారీ రంగం బలపడటంతో ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో చైనా 1.2 శాతం ఎగసింది. జపాన్ దాదాపు 2 శాతం పతనంకాగా.. హాంకాంగ్ నామమాత్ర లాభంతో కదులుతోంది. ఇతర మార్కెట్లలో తైవాన్, కొరియా 0.25 శాతం స్థాయిలో నీరసించాయి. సింగపూర్, థాయ్‌లాండ్, ఇండొనేసియా ప్రారంభంకాలేదు. గురువారం యూరోపియన్ మార్కెట్లలో యూకే, ఫ్రాన్స్, జర్మనీ 2.3-3.5 శాతం మధ్య పతనమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment