Qualcomm Inc. chips
-
రష్యాకు మరో దిగ్గజ కంపెనీ భారీ షాక్..!
ఉక్రెయిన్ - రష్యా మధ్య ఇంకా దాడులు కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా దేశాలు రష్యా మీద అనేక ఆంక్షలు విధిస్తుంటే, ఫేస్బుక్, యూట్యూబ్, ఆపిల్ వంటి దిగ్గజ కంపెనీలు ఆ దేశంలో తమ వ్యాపార కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. అయితే, తాజాగా మరో దిగ్గజ చిప్ మేకర్ కంపెనీ క్వాల్కామ్ అమెరికా విధించిన ఆంక్షలకు అనుగుణంగా రష్యన్ కంపెనీలకు తన ఉత్పత్తులను విక్రయించడం నిలిపివేసినట్లు తెలిపింది. క్వాల్కామ్ కంపెనీ సీనియర్ ప్రభుత్వ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ నేట్ టిబ్బిట్స్ ఈ నిర్ణయాన్ని ట్వీటర్ వేదికగా వెల్లడించారు. "ఇది తప్పు. @Qualcomm ఉక్రెయిన్'లో దురాక్రమణ చేయకుండా శాంతియుతంగా పరిష్కారం కోసం ప్రయత్నించాలి. మేము ఉక్రేనియన్ ప్రజలకు మద్దతుగా అందించే విరాళం, తమ ఉద్యోగులు అందిస్తున్న విరాళాలకు సమానంగా ఉంటుంది. మేము అమెరికా చట్టాలు & ఆంక్షలను పాటిస్తున్నాము. రష్యన్ కంపెనీలకు మా కంపెనీ ఉత్పత్తులను విక్రయించడం లేదు" అని నేట్ టిబ్బిట్స్ అన్నారు. ఈ ట్వీట్'ని రిట్వీట్ చేస్తూ "మీ కంపెనీ @Qualcomm ఉత్పత్తులను రష్యాకు విక్రయించనందుకు ధన్యవాదాలు. @NateTibbits మాకు సహాయం అందించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. క్వాల్కామ్ సహాయం చేయాలనుకుంటే ఉక్రేనియన్ రక్షకుల కోసం శాటిలైట్ ఫోన్లను పంపవచ్చు. దీని వల్ల సైనికులు సమాచార బదిలీ వేగంగా చేసుకునే అవకాశం ఉంటుంది." అని ఫెడోరోవ్ అన్నారు. (చదవండి: రూ.2కే లీటర్ పెట్రోల్.. ఏ దేశంలో తెలుసా?) -
భారత్ భారీ ప్లాన్.. చైనాకు గట్టి ఎదురుదెబ్బ!
న్యూఢిల్లీ: భారతదేశాన్ని ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మార్చే ప్రయత్నంలో భాగంగా రాబోయే ఆరేళ్లలో 20 సెమీకండక్టర్ డిజైన్, కాంపోనెంట్ల తయారీ & డిస్ ప్లే ఫ్యాబ్రికేషన్(ఫ్యాబ్) యూనిట్లను ఏర్పాటు చేయడానికి రూ.76,000 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను అందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. "వివిధ పీఎల్ఐ(ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక) పథకాల ద్వారా భారతదేశాన్ని ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు" ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలపినట్లు ఎకనామిక్ టైమ్స్ తెలపింది. క్యాబినెట్ సమావేశం: డిస్ ప్లే ఫ్యాబ్రికేషన్(ఫ్యాబ్) తయారీ కోసం 2 యూనిట్లు, సెమీకండక్టర్ డిజైన్, కాంపోనెంట్ల తయారీ కోసం 20 యూనిట్లు ఏర్పాటు చేయలని చూస్తున్నట్లు ప్రభుత్వ అధికారి తెలిపారు. ఈ పథకం ఆమోదం కోసం వచ్చే వారం క్యాబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ కేంద్ర క్యాబినెట్ సమావేశం తర్వాత ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ వీధి విధానాలను రూపొందించి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది అని అన్నారు. "దాదాపు అన్ని పరిశ్రమల్లో ఉత్పత్తి లక్ష్యాలను ప్రభావితం చేసే సెమీకండక్టర్ చిప్స్ కొరతతో ప్రపంచం కొట్టుమిట్టాడుతోంది. కార్లు నుంచి టీవీలు, ల్యాప్ టాప్స్, ఈయర్ బడ్స్, వాషింగ్ మెషిన్లు ఇలా ఒకటి అంటే ఇప్పుడు ప్రతి దానిలో సెమీకండక్టర్లను వినియోగిస్తున్నారు. కాబట్టి, ఈ ఎలక్ట్రానిక్ పాలసీ సరైన సమయంలో వస్తోంది" అని ప్రధాన పరిశోధన విశ్లేషకుడు కనిష్కా చౌహాన్ చెప్పారు. (చదవండి: విదేశాలకు చెక్కేస్తున్న దేశ మిలియనీర్లు..!) శామ్ సంగ్, ఎన్ఎక్స్ పి, క్వాల్ కామ్ వంటి చిప్ తయారీదారులతో పాటు తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ(టిఎంఎస్ సి) వంటి కంపెనీలను ఆకర్షించేలా ఈ పాలసీ రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం 40% మూలధన సబ్సిడీని ఇచ్చినప్పటికి కంపెనీలను ఆకర్షించడంలో విఫలం అయ్యింది. ముఖ్యంగా, చిప్స్ కొరత సమస్య వల్ల ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బ తింటున్న తరుణంలో కేంద్రం ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. చైనాకు గట్టి ఎదురుదెబ్బ! చిప్స్ కొరత సమస్య భారతదేశంలోని ఆటో, స్మార్ట్ ఫోన్, వైట్ గూడ్స్ పరిశ్రమలను కూడా పెద్ద ఎత్తున ప్రభావితం చేసింది. సెమీకండక్టర్ తయారీదారులను ఆకర్షించడానికి అమెరికా వంటి దేశాలు భారీ సబ్సిడీలను నిలిపివేయడంతో భారతదేశం వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చీప్ తయారీలో అగ్రస్థానంలో ఉన్న చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగలనున్నట్లు నిపుణులు అంటున్నారు. కొరియన్ దిగ్గజం శామ్ సంగ్ ఇటీవల అమెరికాలోని టెక్సాస్ లో 17 బిలియన్ డాలర్ల చిప్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. (చదవండి: అభ్యంతరకర భాష..అడ్డుకోవడమే లక్ష్యం: కూ యాప్) -
ప్రమాదంలో లక్షల క్వాల్కామ్ స్మార్ట్ఫోన్లు
ప్రముఖ క్వాల్కామ్ సంస్థ కొత్తగా ఉత్పత్తి చేసిన ఫోన్ చిప్‌లలో ఒక బగ్ కనుగొనబడింది. దీని ద్వారా హ్యాకర్లు సులభంగా స్మార్ట్ఫోన్లు హ్యాక్ చేసే అవకాశం ఉన్నట్లు చెక్ పాయింట్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. ఫోన్ వినియోగదారు సంభాషణలు వినడానికి, డేటాను దొంగిలించడానికి, మాల్వేర్లను దాచడానికి క్వాల్కామ్ మోడెమ్‌లను ఉపయోగించుకోవచ్చని ఆ నివేదికలో తెలిపింది. క్వాల్కామ్ మొబైల్ స్టేషన్ మోడెమ్(ఎంఎస్ఎమ్) 1990ల నుంచి సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది. ఎస్ఎంఎస్ ద్వారా ఎంఎస్‌ఎంను రిమోట్‌గా హ్యాక్ చేయవచ్చని భద్రతా సంస్థ చెక్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యాక్టివ్ గా ఉన్న 30 శాతం స్మార్ట్ఫోన్లపై ఈ బగ్ దోపిడీకి గురిచేస్తుందని పేర్కొంది. హ్యాకర్లు ఒక్కసారి చేస్తే వారు మీరు ఏమి మాట్లాడేది వినడం, సందేశాలను చదవడం స్వంత ప్రయోజనాల కోసం మీ డేటాను, సిమ్‌ను అన్‌లాక్ చేయవచ్చు. చెక్ పాయింట్ రీసెర్చ్.. ఈ బగ్ ప్రస్తుతం శామ్సంగ్, గూగుల్, షియోమీ, ఎల్జి తో సహా మరిన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ తయారీదారుల మొబైల్స్ మీద ప్రభావితం చూపనుంది. ప్రపంచ మొత్తం జనాభాలో ప్రస్తుతం 40 శాతం మంది ఈ హాని కలిగించే చిప్స్ గల మొబైల్స్ వాడుతున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. అయితే 30 శాతం ప్రజలు వాడుతున్న ఫోన్లపై దాడులను నిర్వహించడానికి అవసరమైన యాజమాన్య ఇంటర్ఫేస్, క్వాల్కమ్ ఎంఎస్ఎం ఇంటర్ఫేస్(QMI) ద్వారా హ్యాక్ చేసే అవకాశం ఉంది. గతంలో దీనికి సంబందించి భద్రతా సమస్యను క్వాల్కామ్ పరిష్కరించినట్లు అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది. ప్రతి ఒక్కరూ కచ్చితంగా 2020 డిసెంబర్ నుంచి వచ్చిన సెక్యూరిటీ పాచ్ ద్వారా ఫోన్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఆండ్రాయిడ్‌కు సంబంధించిన లోపాలపై గూగుల్ నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు. చదవండి: ఈ కంపెనీ కార్లపై రూ.1.5 లక్షల వరకు ధర తగ్గింపు! -
ఫ్రిజ్, టీవీ కొనే ఆలోచన ఉందా? వెంటేనే కొనండి, లేదంటే!
ఫ్రిజ్‌లు, మైక్రోవేవ్‌లు, టీవీలు గృహోపకరణాలను కొనాలనుకుంటున్నారా? అయితే వెంటనే కొనండి. లేకపోతే రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్ వస్తువుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. దాంతో ఆయా వస్తువుల రేట్లు భారీగా పెరిగనున్నాయి. అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్ చిప్స్ కొరత ఏర్పడటంతో ఫ్రిజ్‌లు, మైక్రోవేవ్ ఇతర గృహోపకరణాల ఉత్పత్తిపై ప్రభావం చూపనుందని వాల్‌పుల్ కార్పోరేషన్ ప్రెసిడెంట్ జాసన్ ఐ తెలిపారు. ఇప్పటికే ఎలక్ట్రానిక్ చిప్స్ కొరత కార్ల ఉత్పత్తి కంపెనీలపై , గ్యాడ్జెట్స్ కంపెనీలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. ప్రపంచంలోని అతిపెద్ద గృహోపకరణాల సంస్థలలో ఒకటైన యూఎస్ ఆధారిత సంస్థ వాల్‌పుల్ ఎగుమతుల్లో వెనుకబడి ఉంది. చైనాలో ఉత్పత్తయ్యే ఈ సంస్థ ఉత్పత్తులు యూరప్, యునైటెడ్ స్టేట్స్కు ఎక్కువగా ఎగమతి అవుతుంటాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల కొరత ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిందని.. గత కొన్ని నెలలుగా ఎగుమతులు 25 శాతానికి తగ్గాయని షాంఘైలో జరిగిన వరల్డ్ ఎలక్ట్రానిక్స్ ఎక్స్‌పోలో జాసన్ ఐ పేర్కొన్నారు. ఇది రానున్న రోజుల్లో పొంచి ఉన్న ఉపద్రవమని అభిప్రాయపడ్డారు. చైనా దేశ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సరిపోయినా, ఎగుమతులను పూర్తిచేయడంలో విఫలం అయ్యే అవకాశలున్నాయని తెలిపారు. ఎలక్ట్రానిక్ చిప్స్ కొరత ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో చైనా అవసరాలు తీరడం కూడా కష్టం కావొచ్చని పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్‌ల కొనుగోలు గణనీయంగా పెరగడంతో... మైక్రోవేవ్‌లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు అవసరమైన మైక్రో కంట్రోలర్లను, ప్రాసెసర్లను సర్దుబాటు చేయడంలో కంపెనీలు ఇబ్బందిపడ్డాయి. క్వాల్కమ్ కంపెనీ లాంటి దిగ్గజ కంపెనీలు కూడా ఎలక్ట్రానిక్ చిప్స్ కొరతను ఎదుర్కొన్నాయి. డిసెంబర్ చివరలో ఏర్ఫడిన ఎలక్ట్రానిక్ చిప్స్ కొరత ఆటోమోబైల్ రంగాల కంపెనీలను కుదిపివేసింది. ప్రపంచాన్ని కరోన మహామ్మారి పీడిస్తున్న సమయంలో స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్‌ల కొనుగోలు గణనీయంగా పెరగడంతో ఎలక్ట్రానిక్ చిప్స్ కొరత ఏర్పడిందని నిపుణులు భావిస్తున్నారు. పెరిగిన మూలధన ఖర్చులు.. వినియోగదారులపై ప్రభావం 26,000 మంది ఉద్యోగులు ఉన్న చైనాకు చెందిన వైట్ గూడ్స్ (గృహోపకరణాల) తయారీ సంస్థ హాంగ్జౌ రోబామ్ అప్లయన్సెస్ కో లిమిటెడ్ మార్కెటింగ్ డైరెక్టర్ డాన్ యే మాట్లాడుతూ.. తగినంత మైక్రో కంట్రోలర్లను సమాకుర్చుకోవడంలో తమ కంపెనీ విఫలమవడంతో మార్కెట్లోకి కొత్త హై-ఎండ్ మోడల్ స్టవ్ వెంట్ విడుదలకు నాలుగు నెలల జాప్యం ఏర్పడిందని తెలిపారు. ఎలక్ట్రానిక్ చిప్స్ కొరత కారణంగా, కంపెనీల మూలధన ఖర్చులు పెరిగాయని.. దీంతో సర్వసాధారణంగా వినియోగదారులపై ఈ భారం పడనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
జీడీపీ 33% డౌన్- యూఎస్ మార్కెట్లు వీక్
మహామాంద్యం(1921) తదుపరి అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది రెండో క్వార్టర్లో దాదాపు 33 శాతం క్షీణించింది. ఏప్రిల్-జూన్‌లో కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డవులతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడం ప్రభావం చూపింది. దీంతో గురువారం డోజోన్స్ 226 పాయింట్లు(0.9 శాతం) క్షీణించి 26,314కు చేరగా.. ఎస్అండ్పీ 12 పాయింట్ల(0.4 శాతం) నష్టంతో 3,246 వద్ద ముగిసింది. నాస్డాక్ మాత్రం 45 పాయింట్లు(0.45 శాతం) బలపడి 10,588 వద్ద నిలిచింది. ఫాంగ్ స్టాక్స్ జూమ్ క్యూ2లో పటిష్ట ఫలితాలు సాధించడంతో యునైటెడ్ పార్సిల్స్ 14.5 శాతం జంప్‌చేసింది. 2020 పూర్తి ఏడాదికి ఆశావహ అంచనాలు ప్రకటించడంతో తాజాగా చిప్ తయారీ కంపెనీ క్వాల్కామ్ కౌంటర్‌కు డిమాండ్ నెలకొంది. దీంతో ఈ షేరు 15 శాతం దూసుకెళ్లింది. క్యూ2(ఏప్రిల్-జూన్) ఫలితాలు ప్రకటించనున్న యాపిల్, అల్ఫాబెట్, ఫేస్బుక్, అమెజాన్ 0.5-1.2 శాతం మధ్య బలపడ్డాయి. దీంతో నాస్డాక్ లాభాలతో ముగిసింది. కాగా.. మార్కెట్లు ముగిశాక ఫలితాలు ప్రకటించడంతో ఫ్యూచర్స్‌లో ఫేస్బుక్ 8 శాతం, అమెజాన్ 6 శాతం చొప్పున జంప్‌చేశాయి. అల్ఫాబెట్ సైతం 2 శాతం ఎగసింది. దీంతో నేడు ఈ కౌంటర్లు నాస్‌డాక్‌కు మరోసారి బలాన్ని చేకూర్చే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆసియా అటూఇటూ జులైలో తయారీ రంగం బలపడటంతో ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో చైనా 1.2 శాతం ఎగసింది. జపాన్ దాదాపు 2 శాతం పతనంకాగా.. హాంకాంగ్ నామమాత్ర లాభంతో కదులుతోంది. ఇతర మార్కెట్లలో తైవాన్, కొరియా 0.25 శాతం స్థాయిలో నీరసించాయి. సింగపూర్, థాయ్‌లాండ్, ఇండొనేసియా ప్రారంభంకాలేదు. గురువారం యూరోపియన్ మార్కెట్లలో యూకే, ఫ్రాన్స్, జర్మనీ 2.3-3.5 శాతం మధ్య పతనమయ్యాయి. -
టెక్ జెయింట్ల పోరుకు ఫుల్స్టాప్
అమెరికా టెక్ జెయింట్లు యాపిల్, క్వాల్కామ్ తమ మధ్య ఉన్న వైరానికి ముగింపు పలికాయి. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన రాయల్టీ చెల్లింపుల యుధ్దానికి ఫుల్స్టాప్ పెట్టాయి. ఈ మేరకు ఒక ఒప్పందం కుదిరిందని యాపిల్, అమెరికన్ మైక్రోచిప్ తయారీదారు క్వాల్కామ్ సంయుక్తంగా మంగళవారం ప్రకటించాయి. పరస్పర దాఖలు చేసుకున్న అన్ని వ్యాజ్యాలను ఉపసంహరించుకున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఇందుకు ఇరు కంపెనీల మధ్య ఆరు సంవత్సరాల లైసెన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ లెసెన్స్‌ను అవసరమైతే మరో రెండేళ్లపాటు విస్తరించుకునే ఆప్షన్‌కు కూడా ఇందులో జోడించాయి. ఈ ఒప్పందం వైర్లెస్ పరిశ్రమకు లబ్ది చేకూరుస్తుందని విశ్లేషకుడు ప్రాటిక్ మూర్హెడ్ వ్యాఖ్యానించారు. కాలిఫోర్నియాలో కోర్టులో వాదనల చివరి నిమిషంలో యాపిల్, క్వాల్కామ్ ఈ పరిష్కారానికి రావడం విశేషం. గత రెండు సంవత్సరాలుగా, కంపెనీ మధ్య న్యాయ పోరాటం జరుగుతోంది. దీంతో కోట్లాది రూపాయలకు చెల్లింపులనుంచి క్వాల్కామ్ బయటపడింది. దీంతో వాల్‌స్ట్రీట్‌లో క్వాల్కం 23 శాతానికి పైగా పెరిగింది. దాదాపు 20 ఏళ్లలో ఇది ఉత్తమమైన లాభంగా మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. టెక్ దిగ్గజం యాపిల్, చిప్ తయారీ సంస్థ క్వాల్కామ్ మధ్య పేటెంట్, లైసెన్సింగ్ విధానంపై పోరు న్యాయ స్థానానికి చేరింది. 2017 ఆరంభంలో, అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమీషన్ వద్ద క్వాలాకామ్ తమతో సహా స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు లైసెన్సుల విక్రయంలో యాంటీట్రస్ట్ చట్టాన్ని ఉల్లంఘించిందంటూ దావా వేసింది. క్వాల్ కామ్ కంపెనీ మోనోపలి చెలాయిస్తోందన్నది యాపిల్ ఆరోపణ. -
ఇంటెల్ ను వరించిన యాపిల్ కాంట్రాక్ట్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్రాండ్ గా పేరొందిన యాపిల్ తన చిప్ సప్లైయర్ ను మార్చుకోబోతోంది. తన స్మార్ట్ ఫోన్లలో అమర్చే చిప్ ల కాంట్రాక్టును ఇంటెల్ కు అప్పజెప్పింది. దీంతో ఇప్పటివరకూ క్వాల్కం ఇంక్ చిప్స్ తో వచ్చిన యాపిల్ ఐఫోన్ లు, ఇకనుంచి ఇంటెల్ కార్పొరేషన్ చిప్ లతో యూజర్ల ముందుకు రానున్నాయి. ఇంటెల్ మోడెమ్ చిప్స్ ను యాపిల్ తన తర్వాతి ఐఫోన్లలో వాడనుందని బ్లూమ్ బర్గ్ నివేదించింది. యాపిల్ ఫ్లాగ్ షిప్ ప్రొడక్ట్ లకు ప్రస్తుత వెర్షన్ కాంపొనెంట్ గా, ముఖ్య కమ్యూనికేషన్ సారిధిగా క్వాల్కమ్ చిప్ పనిచేస్తోంది. అయితే ఈ రిపోర్టుపై స్సందించడానికి ఇతర కంపెనీల ప్రతినిధులు తిరస్కరించారు. నిర్వహణ నష్టాలతో సతమతమవుతున్న ఇంటెల్ చిప్ ప్రోగ్రామ్ కు యాపిల్ నుంచి ఈ ఆర్డర్లు దక్కడం అతిపెద్ద విజయమని బ్లూమ్ బర్గ్ రిపోర్టు పేర్కొంది. దీంతో యాపిల్ వ్యాపారాల నుంచి క్వాల్ కామ్ కొన్ని ఆర్డర్లును కోల్పోయింది. ఈ ఆర్డర్ తో గతకొంతకాలంగా పడిపోతున్నఇంటెల్ షేర్లు, కొంత పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంటెల్ షేర్ 0.7 శాతం పెరిగింది. అయితే క్వాల్ కామ్ షేర్లు మాత్రం పడిపోయాయి. 2.9 శాతం పతనమయ్యాయి. యాపిల్ నుంచి మార్కెట్లోకి వచ్చిన మొట్టమొదటి ఐఫోన్ కు 2017 లో ఇన్ ఫినియాన్ టెక్నాలజీస్ ఏజీ మోడమ్ లను సమకూర్చింది. అనంతరం ఇన్ ఫినియాన్ ను ఇంటెల్ కొనుగోలు చేసింది. తర్వాత కొంత కాలానికి యాపిల్ తన చిప్ ప్రొవైడర్ గా క్వాల్ కామ్ ను ఎన్నుకోవడంతో, ఇంటెల్ తన చిప్ కాంట్రాక్టులను కోల్పోయింది. అప్పటినుంచి స్మార్ట్ ఫోన్ చిప్ ల వ్యాపారాల్లో ఇంటెల్ తిరోగమనంలో పడింది. ప్రస్తుతం యాపిల్ మళ్లీ తన చిప్ ప్రొవైడర్ గా ఇంటెల్ ను ఎంచుకోవడంతో, తన స్థానాన్ని మెరుగుపరుచుకునేందుకు ఇంటెల్ కు ఇది ఓ చక్కని అవకాశంగా ఉపయోగపడనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.