మన్మోహన్‌ హయాంలో వృద్ధి రేటుకు కోత | Ahead of 2019 Lok Sabha Elections, government cuts GDP growth rate during UPA | Sakshi
Sakshi News home page

మన్మోహన్‌ హయాంలో వృద్ధి రేటుకు కోత

Published Thu, Nov 29 2018 12:56 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Ahead of 2019 Lok Sabha Elections, government cuts GDP growth rate during UPA  - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) ప్రభుత్వ హయాంలో జరిగినట్లు వెలువడిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి గణాంకాలకు కేంద్ర ప్రభుత్వం బుధవారం కోతపెట్టింది. ఈ తాజా గణాంకాలను చూస్తే, సంస్కరణలు ప్రారంభించిన అనంతరం దేశం ఎప్పుడూ రెండంకెల వృద్ధి సాధించలేకపోవడం గమనార్హం. పైగా వృద్ధి గణాంకాలు 9 శాతం దిగువకు పడిపోయాయి.   2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వెలువడిన ఈ తాజా గణాంకాలు రాజకీయ రంగు పులుముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.    కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసిన ఈ ‘సవరిత’ తాజా లెక్కలను చూస్తే... 
∙2005–06, 2006–07లో 9.3 శాతం వృద్ధి రేటు నమోదయ్యిందని గత గణాంకాలను పేర్కొన్నాయి. ఈ రేటును తాజాగా వరుసగా 7.9 శాతం, 8.1 శాతాలుగా మార్చడం జరిగింది.  
∙ఇక 2007–08 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 9.8 శాతం నుంచి 7.7 శాతానికి సవరించడం జరిగింది.  

∙ఈ లెక్కన ‘వరుసగా మూడేళ్లు 9 శాతం ఎగువన వృద్ధి రేటు’ హోదాను భారత్‌ కోల్పోయినట్లయ్యింది.  
∙ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న 2008–09లో వృద్ధి రేటు 3.9 శాతం నుంచి 3.1 శాతానికి తగ్గింది.  
∙2009–10 వృద్ధి రేటు 8.5 శాతం నుంచి 7.9 శాతానికి తగ్గింది. 
∙2010–11 (ఏప్రిల్‌ 2010 నుంచి 2011 మార్చి వరకూ) ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటును 8.5 శాతంగా సవరించడం జరిగింది. అంతక్రితం ఈ రేటు 10.3 శాతంగా ఉండేది.  
∙2011–12 వృద్ధి రేటును 6.6 శాతం నుంచి 5.2 శాతానికి కేంద్రం తగ్గించింది.   

కొన్ని రంగాల వల్లే ఈ మార్పు: కేంద్రం 
మైనింగ్, క్వారీయింగ్, టెలికంసహా ఆర్థిక వ్యవస్థలో కొన్ని రంగాల్లో గణాంకాల తాజా మదింపు వల్లే ఈ మార్పులు చోటుచేసుకున్నట్లు ఇక్కడ జరిగిన ఒక సంయుక్త విలేకరుల సమావేశంలో చీఫ్‌ స్టాటిస్టీషియన్‌ ప్రవీణ్‌ శ్రీవాస్తవ, నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. నేషనల్‌ అకౌంట్స్‌ సిరీస్‌ను అప్‌డేట్‌ చేయడానికి గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ఒక క్లిష్టమైన ప్రక్రియలను అనుసరించాల్సి వచ్చినట్లు రాజీవ్‌ కుమార పేర్కొన్నారు. అంతర్జాతీయంగా పోల్చుతూ, ఐక్యరాజ్యసమితి ప్రమాణాలకు అనుగుణంగా తాజా మార్పులు చేసినట్లూ వివరించారు. యూపీఏ హయాంలోని వృద్ధిరేట్లను మాత్రమే దిగువకు సవరించడం జరిగిందికదా? ఇది కాకతాళీయమా? అన్న ప్రశ్నకు కుమార్‌ స్పందిస్తూ, ‘అసలు దీనిని ఆ కోణంలోనే చూడ్డం తగదు. కేంద్ర గణాంకాల సంస్థ అధికారులు కష్ట ఫలమిది. అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా ఇవి ఉన్నాయి’ అని వివరించారు. ఉద్దేశ్యపూర్వకంగా ఇక్కడ ప్రభుత్వం చేసిందేమీ లేదని సూచించారు. 

బేస్‌ ఇయర్‌ మార్చి లెక్కలు.. 
తొలి గణాంకాలు 2004–05 బేస్‌ ఇయర్‌గా వెలువడితే, ప్రభుత్వం ఈ గణాంకాల బేస్‌ ఇయర్‌ను 2011–12కు మార్చింది. ఒక నిర్దిష్ట సంవత్సరం ప్రాతిపదికగా లెక్కలను శాతాల్లో చూపుతారు. సంబంధిత సంవత్సరాన్నే బేస్‌ ఇయర్‌గా పరిగణిస్తారు. 2004–05 బేస్‌ ఇయర్‌ నుంచి ప్రభుత్వం 2015 జనవరిలో 2011–12 బేస్‌ ఇయర్‌లోకి మారింది. అంతకు ఐదేళ్ల క్రితం బేస్‌ ఇయర్‌ మార్పు 2010లో జరిగింది.  

2018 ఆగస్టు నివేదికను ఆమోదించం 
2018 ఆగస్టులో వచ్చిన ఒక ముసాయిదా నివేదికకు పూర్తిగా ఈ ‘బ్యాక్‌ సిరీస్‌ డేటా’ గణాంకాలు ఉండడం గమనార్హం. అసలు ఆ కమిటీ నివేదికను ఆమోదించబోవడం లేదని రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఆ కమిటీ అనుసరించిన విధానం తప్పుల తడకని పేర్కొన్నారు.  స్వతంత్ర సంస్థ నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) నియమించిన కమిటీ (ఆన్‌ రియన్‌ సెక్టార్‌ స్టాటిస్టిక్స్‌) 2018 ఆగస్టులో ఒక ముసాయిదా నివేదికను విడుదల చేస్తూ,  ప్రస్తుత ప్రభుత్వ మొదటి నాలుగేళ్లతో పోల్చిచూస్తే, 2004–05 నుంచి 2013–14 మధ్య యూపీఏ ప్రభుత్వ హయాంలో వృద్ధి రేటు వేగంగా ఉందని పేర్కొంది. అయితే ఈ నివేదికపై సంబంధిత వర్గాల నుంచి స్పందనలను కేంద్రం కోరింది. మన్మోహన్‌ హయాంకు సంబంధించి 2006–2007 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 10.08 శాతమని ముసాయిదా నివేదిక పేర్కొంది. 1991 సంస్కరణల తరువాత ఈ స్థాయి వృద్ధి నమోదుకాలేదని వివరించింది. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయం 1988–89లో వృద్ధి రేటు 10.2 శాతంగా పేర్కొంది. డేటా ఆధారంలో మార్పుల వల్ల 2004–05 సిరీస్‌కన్నా ఎక్కువగా మొత్తం స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో ప్రైమరీ సెక్టార్‌ వాటా పెరిగిందని, గణాంకాల తాజా మార్పునకు ఇదే కారణమని శ్రీవాస్తవ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement