న్యూఢిల్లీ: అధిక ద్రవ్యోల్బణాన్ని కారణంగా చూపిస్తూ, మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం 2022 క్యాలెండర్ ఇయర్ భారతదేశ ఆర్థిక వృద్ధి వృద్ధి అంచనాను 9.1 శాతం నుండి 8.8 శాతానికి కుదించింది. ఈ మేరకు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం వెలువరించిన 2022–23 గ్లోబల్ స్థూల ఆర్థిక వ్యవస్థ అవుట్‌లుక్ నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ..
► డిసెంబర్ త్రైమాసికం 2021 (2021 అక్టోబర్–డిసెంబర్) నుండి ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో వృద్ధి ఊపందుకున్నట్లు హై–ఫ్రీక్వెన్సీ డేటా సూచిస్తోంది.
► అయితే ముడి చమురు, ఆహారం, ఎరువుల ధరల పెరుగుదల ప్రభావం రాబోయే నెలల్లో గృహ ఆర్థిక, వ్యయాలపై ఉంటుంది. ఇంధనం, ఆహార ద్రవ్యోల్బణం మరింత పెరక్కుండా సెంట్రల్ బ్యాంక్ అనుసరిస్తున్న రేట్ల పెంపు విధానం డిమాండ్ రికవరీ వేగాన్ని తగ్గిస్తుంది.
► 2022 ఎకానమీ స్పీడ్‌ను 8.8 శాతానికి తగ్గిస్తున్నా, 2023 వృద్ధి అంచనాలను 5.4 శాతంగా యథాతథంగా కొనసాగిస్తున్నాం.
► పటిష్ట రుణ వృద్ధి, కార్పొరేట్ రంగం ప్రకటించిన పెట్టుబడి ప్రణాళికలు, ప్రభుత్వం మూలధన వ్యయానికి అధిక బడ్జెట్ కేటాయింపుల వంటి అంశాలు పెట్టుబడుల పక్రియ బలపడుతున్నట్లు సూచిస్తున్నాయి.
► అంతర్జాతీయంగా ముడి చమురు, ఆహార ధరలు మరింత పెరగకపోతే ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన వృద్ధి వేగాన్ని కొనసాగించేంత బలంగా కనిపిస్తోంది.
► 2022, 2023 క్యాలెండర్ సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం సగటున వరుసగా 6.8 శాతం, 5.2 శాతంగా ఉంటుందని అంచనా.
► అనేక ప్రతికూల కారకాల కారణంగా 2022, 2023 ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించాల్సి వస్తోంది. ద్రవ్యోల్బణం అంచనాలను పెంచాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతోంది.
► సరఫరాల సమస్యలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నాయి. వినియోగదారుల కొనుగోలు శక్తి క్షీణించేట్లు చేస్తున్నాయి. ఆయా అంశాలతో సెంట్రల్ బ్యాంకులు కఠిన ద్రవ్య విధానానికి మొగ్గుచూపే పరిస్థితికి దారితీస్తున్నాయి. దీనితోపాటు ఆర్థిక మార్కెట్ అస్థిరత, ఆస్తుల రీప్రైసింగ్, కఠిన ద్రవ్యపరిస్థితుల వంటి అంశాలు ఎకానమీల మందగమనానికి ప్రధాన కారణం.
► మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసింది. అనంతరం రికవరీకి పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా కనబడుతోంది. జీరో–కోవిడ్ విధానంతో చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతోంది. వచ్చే ఏడాదినాటికి ప్రధాన ద్రవ్యోల్బణం రేట్లు (శాతాల్లో) తగ్గుతాయని మేము భావిస్తున్నప్పటికీ, ధర స్థాయిలు ఎక్కువగానే ఉంటాయి. ఆయా అంశాలు డిమాండ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
► చైనా వృద్ధి రేటు 2022లో 4.5 శాతం, 2023లో 5.3 శాతం ఉంటాయని భావిస్తున్నాం. అమెరికా, బ్రిటన్ ఎకానమీల వృద్ధి రేటు దాదాపు 2.8 శాతంగా ఉంటుందని అంచనా.
కట్టుతప్పిన ద్రవ్యోల్బణం...
ఈ సంవత్సరం ప్రారంభం నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యానికి మించి నమోదవుతోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం శ్రేణిలో నమోదుకావాలని ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. అయితే జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం, మార్చిలో 17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్టం 7.79 శాతానికి చేరడంతో జూన్ మొదటి వారంలో జరిగే పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ ఎంపీసీ మరో దఫా రేట్ల పెంపు ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు.
పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ మొదటి వారం ఆర్‌బీఐ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంచేసింది. దీనితో 2022–23లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి పెరిగాయి. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ కమిటీ అంచనావేసింది.
అయితే ఈ లెక్కలు తప్పే అవకాశాలు స్పష్టమవడంతో నేపథ్యంలో ఈ నెల మొదట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్యపరపతి విధాన మధ్యంతర కమిటీ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా రెపో రేటును అనూహ్య రీతిలో 4 శాతం నుంచి 4.4 శాతానికి పెంచింది. నాలుగేళ్ల తర్వాత రెపో రేటు పెరగడం ఇదే తొలిసారి. 2018 ఆగస్టు తర్వాత ఆర్‌బీఐ పాలసీ రేటు పెంపు ఇది. కరోనా సవాళ్ల తీవ్రత నేపథ్యంలో... 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 శాతానికి) తగ్గించిన నాటి నుంచి 4 శాతం వద్ద రెపో రేటు కొనసాగుతోంది.వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల కాలంలో రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఆర్‌బీఐ కొనసాగిస్తోంది. 4.4 శాతానికి రెపో రేటును పెంచడంతోపాటు వ్యవస్థలో నుంచి తక్షణం రూ.87,000 కోట్లు వెనక్కు మళ్లే విధంగా... రెపో రేటుతో బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన ‘వడ్డీ రహిత’ నిధులకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)ని కూడా పరపతి విధాన కమిటీ 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 4.5 శాతానికి పెరిగింది. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని కట్టడి చేసి తద్వారా ద్రవ్యోల్బణం స్పీడ్‌ను తగ్గించాలన్నది ఈ ఇన్‌స్ట్రమెంట్ల ప్రధాన ఉద్దేశ్యం.
వచ్చే నెల్లో అరశాతం రేటు పెంపు ఖాయం
బ్రిటిష్ బ్రోకరేజ్ సంస్థ బార్‌క్లేస్ విశ్లేషణ
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జూన్‌లో జరిగే ఆర్థిక సంవత్సరం రెండవ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలుచేసే వడ్డీరేటు రెపోను మరో 0.50 శాతం పెంచే అవకాశాలు అధికంగా ఉన్నాయని బ్రిటిష్ బ్రోకరేజ్ సంస్థ బార్‌క్లేస్ విశ్లేషించింది. అలాగే వృద్ధి రేటు అంచనాలనూ 7.2 శాతం నుంచి 7 శాతానికి కుదించే అవకాశం ఉందని పేర్కొంది.
ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల బ్యాండ్‌ను 6.2–6.5 శాతం శ్రేణిగా సవరించే వీలుందని అంచనావేసింది. ద్రవ్యోల్బణం కట్టడి, మధ్య కాలిక ఆర్థిక స్థిరత్వం లక్ష్యాలుగా పాలసీ సమీక్ష ఉంటుందని అభిప్రాయపడింది. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)కట్టడి లక్ష్యంగా క్యాష్ రిజర్ రేషియో (సీఆర్‌ఆర్)ను మరో 0.50 శాతం పెంచే అవకాశం ఉందని తెలిపింది. బార్‌క్లేస్ విశ్లేషణలు నిజమైతే రెపో రేటు 4.90 శాతానికి, సీఆర్‌ఆర్ 5 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం కట్టడి–వృద్ధి సమతౌల్యత ఆర్‌బీఐ ముందున్న ప్రస్తుత కీలకాంశమని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment