న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2023 క్యాలెండర్ ఇయర్ వృద్ది రేటు 5.5 శాతం అంచనాలను రేటింగ్ దిగ్గజ సంస్థ– మూడీస్ భారీగా 6.7 శాతానికి పెంచింది. ఆర్థిక క్రియాశీలత గణనీయంగా మెరుగుపడ్డం దీనికి కారణమని తన తాజా అంతర్జాతీయ స్థూల ఆర్థిక అవుట్‌లుక్ (ఆగస్టు అప్‌డేట్)లో తెలిపింది. కాగా 2023 హై బేస్ నేపథ్యంలో 2024లో వృద్ధి రేటును 6.5 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది.
పటిష్ట సేవల రంగం, మూలధన వ్యయాలు ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు 7.8 శాతం పెరుగుదలకు కారణంగా పేర్కొంది. 2023 ద్వితీయార్థంలో, 2024 ప్రారంభంలో ఎల్‌నినో పరిస్థితులు బలంగా ఉంటే వ్యవసాయ వస్తువుల ధరలు పెరగవచ్చని మూడీస్ అభిప్రాయపడింది. దేశీయ డిమాండ్ పటిష్టంగా ఉంటుందని, ద్రవ్యోల్బణం దేశంలో తట్టుకునే రీతిలోనే ఉండే అవకాశం ఉందని అంచనావేసిన మూడీస్, ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాత) రేట్ల పెంపు ఉండకపోవచ్చని అంచనా వేసింది.
జీ20 వృద్ధి తీరు ఇది...
జీ–20 దేశాల వృద్ధి 2023లో 2.5 శాతంగా ఉండవచ్చని, 2024లో 2.1 శాతానికి తగ్గవచ్చని అభిప్రాయపడింది. 2022లో ఈ రేటు 2.7 శాతం. 2024 చైనా వృద్ధి రేటును 4.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించడం గమనార్హం. భారత్‌కు మూడీస్ అతి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ ‘బీఏఏ3’ సావరిన్ రేటింగ్‌ను అందిస్తోంది. 2023–24లో వృద్ధి రేటును 6.1 శాతంగా అంచనావేస్తోంది. 2022–23 7.2 శాతం కన్నా ఇది భారీ తగ్గుదల కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment