జీడీపీ మైనస్‌ 11.5 శాతానికి.. | India projected growth rate to minus 11.5percent for 2020-21 | Sakshi
Sakshi News home page

జీడీపీ మైనస్‌ 11.5 శాతానికి..

Published Sat, Sep 12 2020 5:29 AM | Last Updated on Sat, Sep 12 2020 5:29 AM

India projected growth rate to minus 11.5percent for 2020-21 - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) మైనస్‌ 11.5 శాతం క్షీణిస్తుందని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ శుక్రవారం పేర్కొంది. ఈ మేరకు క్రితం అంచనా మైనస్‌ 4 అంచనాలకు మరింత పెంచుతున్నట్లు ప్రకటించింది. వృద్ధి బలహీనత, అధిక రుణ భారం, బలహీన ఆర్థిక వ్యవస్థ వంటి అంశాల నేపథ్యంలో భారత్‌ క్రెడిట్‌ ప్రొఫైల్‌ (రుణ సమీకరణ సామర్థ్యం) ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉందని మూడీస్‌ పేర్కొంది. కరోనా ప్రతికూలతలు ఈ పరిస్థితులను మరింత దిగజార్చాయని వివరించింది. దేశ ద్రవ్య పటిష్టతకు దీర్ఘకాలంలో తీవ్ర ఇబ్బందులు తప్పకపోవచ్చని విశ్లేషించింది. కాగా తక్కువ బేస్‌ ఎఫెక్ట్‌  (2020–21లో భారీ క్షీణత కారణంగా) ప్రధాన కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22) భారత్‌ 10.6 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకునే అవకాశం ఉందని తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీలో 90 శాతానికి భారత్‌ రుణ భారం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం జీడీపీలో భారత్‌ రుణ భారం 72 శాతం.  

► ఇక ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాలకు మధ్య  నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 7.5 శాతానికి చేరే అవకాశం ఉంది. రాష్ట్రాలకు ద్రవ్యలోటు జీడీపీలో 4.5 శాతం ఉంటుందని భావిస్తున్నాం. 2020 (ఏప్రిల్‌)–2021 (మార్చి) ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.7.96 లక్షల కోట్ల ద్రవ్యలోటు ఉండాలన్నది బడ్జెట్‌ లక్ష్యం. 2020–21 అంచనాలో 3.5% దాటకూడదన్నది ఈ లక్ష్యం ఉద్దేశం.  అయితే ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలలూ గడిచే సరికే– అంటే ఏప్రిల్‌ నుంచి జూలై మధ్య నాటికే ద్రవ్యలోటు రూ.8,21,349 కోట్లకు చేరింది. అంటే వార్షిక లక్ష్యంలో 103.1 శాతానికి చేరిందన్నమాట.గత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 4.6 శాతం.  

► జీ–20 దేశాలతో పోల్చిచూస్తే, భారత్‌ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నట్లుగా మరే ఇతర ఆర్థిక వ్యవస్థ నష్టపోలేదు.  

► ఆర్థిక వ్యవస్థ పురోగతికి ప్రభుత్వ పరంగా ద్రవ్య పరమైన మద్దతు చర్యలు తీసుకోడానికి పల్లు క్లిష్ట పరిస్థితులు, పరిమితులు ఉన్నాయి.  

► బలహీన మౌలిక వ్యవస్థ, కార్మిక, భూ, ప్రొడక్ట్‌ మార్కెట్లలో క్లిష్ట పరిస్థితులు వృద్ధికి అవరోధాలు కలిగిస్తున్న అంశాలు.  

► ఇక బ్యాంకింగ్, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థల మొండిబకాయిల సమస్యలు మరింత తీవ్రం అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి.  

► సమీప భవిష్యత్తులో రేటింగ్‌ను పెంచే అవకాశాలు లేవు. ప్రభుత్వం తీసుకుంటున్న విధాన చర్యలు వృద్ధి బాటలో పురోగతికి సహకరిస్తున్నాయని గణాంకాలు వెల్లడించేవరకూ రేటింగ్‌ పెంపు ఉండబోదు. భారత్‌ సావరిన్‌ రేటింగ్‌ను జూన్‌లో మూడీస్‌– నెగెటివ్‌ అవుట్‌లుక్‌తో ‘బీఏఏ3’కి కుదించింది. ఇది చెత్త స్టేటస్‌కు ఒక అంచ ఎక్కువ.   

► పర్యవేక్షణలో పటిష్టత, ఫైనాన్షియల్‌ రంగంలో స్థిరత్వం వంటి లక్ష్యాల సాధనకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తే, వృద్ధి రికవరీ వేగవంతం అయ్యే వీలుంది.


కేర్‌ రేటింగ్స్‌ అంచనా
మైనస్‌ 8.2 శాతం
కాగా దేశీయ రేటింగ్‌ సంస్థ కేర్‌ రేటింగ్స్‌ శుక్రవారం మరో నివేదికను విడుదల చేస్తూ, 2020–21లో భారత్‌ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు మైనస్‌ 8% నుంచి 8.2% వరకూ ఉంటుందని అంచనావేసింది. ఇంతక్రితం ఈ క్షీణ అంచనా మైనస్‌ 6.4% కావడం గమనార్హం. ప్రభుత్వం నుంచి తగిన ద్రవ్యపరమైన మద్దతు ఆర్థిక వ్యవస్థకు అందకపోవడమే తమ అంచనాల పెంపునకు కారణమని కేర్‌ రేటింగ్స్‌ తెలిపింది.   

అందరి అంచనాలూ క్షీణతే..
మొదటి త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో భారత్‌ ఆర్థిక వ్యవస్థ 23.9 శాతం క్షీణ రేటును నమోదు చేసుకున్న నేపథ్యంలో... ఇప్పటికే పలు ఆర్థిక, రేటింగ్‌ సంస్థలు 2020–21లో భారత్‌ ఆర్థిక వ్యవస్థ  క్షీణ రేటు 10శాతం నుంచి 15 శాతం వరకూ ఉంటాయని అంచనా వేశాయి.

ఆయా అంచనాలను పరిశీలిస్తే (అంచనాలు శాతాల్లో)

సంస్థ                    తాజా           క్రితం
                         అంచనా    అంచనా   
 
గోల్డ్‌మన్‌ శాక్స్‌    14.8     11.8        
ఫిచ్‌                 10.5     5.0        
ఇండియా రేటింగ్స్‌ – రిసెర్చ్‌    11.8     5.3        
ఎస్‌బీఐ  ఎకోర్యాప్‌    10.9     6.8    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement