Credit profile
-
పెయింట్స్ మార్కెట్ కలర్‌ఫుల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణం, రియల్టీ, వాహన తయారీ పరిశ్రమ నుండి ఆరోగ్యకర డిమాండ్ కొనసాగడంతో పెయింట్స్ రంగం 2023–24లో 10–12 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేస్తుందని క్రిసిల్ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో పెయింట్స్ పరిశ్రమ ఆదాయం 18 శాతం వృద్ధి చెందుతుందన్న అంచనాలు ఉన్నాయి. క్రిసిల్ తాజా నివేదిక ప్రకారం.. పరిమాణం పెంపు, నగదు లభ్యత కారణంగా కంపెనీలు ఆరోగ్యకరమైన బ్యాలెన్స్ షీట్లను నిర్వహించడానికి సహాయపడతాయి. మూలధనం పెరుగుతున్నప్పటికీ క్రెడిట్ ప్రొఫైల్స్‌ను మెరుగుపరుస్తుంది. 2022–24 మధ్య రూ.12,000 కోట్ల మూలధన వ్యయం చేయనున్నట్టు అయిదు టాప్ కంపెనీలు ప్రకటించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం 420 కోట్ల లీటర్లు. ఇందులో టాప్–5 కంపెనీల వాటా 90 శాతం. కొత్తగా ఈ రంగంలోకి ప్రవేశించిన కంపెనీలు 140 కోట్ల లీటర్ల సామర్థ్యాన్ని జోడించనున్నాయి. క్రూడ్‌తో ముడిపడి.. 2022–23లో పెయింట్స్ ధర 6 శాతం పెరిగింది. నిర్వహణ లాభాలు దాదాపు 2022–23 మాదిరిగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15–16 శాతం ఉండనున్నాయి. పెయింట్లలో వాడే కీలక ముడి పదార్థాలు క్రూడ్‌తో ముడిపడి ఉంటాయి. 2022 జూన్–జూలైలో క్రూడ్ బ్యారెల్ ధర 115 డాలర్లు పలికింది. ప్రస్తుతం ఈ ధర 85 డాలర్లకు పడిపోవడం నిర్వహణ లాభాలకు బూస్ట్నివ్వనుంది. అయితే డాలరుతో రూపాయి మారకం విలువ 2022–23లో రూ.80.2 నుంచి ప్రస్తుతం రూ.82 దాటింది. రూపాయి పతనం మార్జిన్లకు ముప్పుగా పరిణమిస్తుంది. పెయింట్స్ తయారీలో వాడే ముడి పదార్థాల అవసరాల్లో మూడింట ఒకవంతు దిగుమతులపైనే పరిశ్రమ ఆధారపడి ఉంది. ఇదీ పెయింట్స్ పరిశ్రమ.. భారత పెయింట్స్ పరిశ్రమ విలువ రూ.65,000 కోట్లు. ఇందులో డెకోరేటివ్ విభాగం వాటా ఏకంగా 80 శాతం ఉంది. జీడీపీతో పోలిస్తే పెయింట్స్ డిమాండ్ 1.6–2 రెట్లు వృద్ధి చెందుతోంది. పునర్నిర్మాణం, నిర్మాణం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డెకోరేటివ్ పెయింట్స్ విభాగం 11–12 శాతం ఆదాయ వృద్ధికి ఆస్కారం ఉంది. బ్రాండెడ్ పెయింట్లకే భవిష్యత్ ఉందని టెక్నో పెయింట్స్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇక మౌలిక వసతులపై ప్రభుత్వ వ్యయం, ఆటోమొబైల్ పరిశ్రమ నుంచి స్థిర డిమాండ్‌తో ఇండస్ట్రియల్ పెయింట్స్ విభాగం ఆదాయం 8–9 శాతం అధికం కానుంది. -
జీడీపీ మైనస్ 11.5 శాతానికి..
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) మైనస్ 11.5 శాతం క్షీణిస్తుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ శుక్రవారం పేర్కొంది. ఈ మేరకు క్రితం అంచనా మైనస్ 4 అంచనాలకు మరింత పెంచుతున్నట్లు ప్రకటించింది. వృద్ధి బలహీనత, అధిక రుణ భారం, బలహీన ఆర్థిక వ్యవస్థ వంటి అంశాల నేపథ్యంలో భారత్ క్రెడిట్ ప్రొఫైల్ (రుణ సమీకరణ సామర్థ్యం) ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉందని మూడీస్ పేర్కొంది. కరోనా ప్రతికూలతలు ఈ పరిస్థితులను మరింత దిగజార్చాయని వివరించింది. దేశ ద్రవ్య పటిష్టతకు దీర్ఘకాలంలో తీవ్ర ఇబ్బందులు తప్పకపోవచ్చని విశ్లేషించింది. కాగా తక్కువ బేస్ ఎఫెక్ట్ (2020–21లో భారీ క్షీణత కారణంగా) ప్రధాన కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22) భారత్ 10.6 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకునే అవకాశం ఉందని తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీలో 90 శాతానికి భారత్ రుణ భారం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం జీడీపీలో భారత్ రుణ భారం 72 శాతం. ► ఇక ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 7.5 శాతానికి చేరే అవకాశం ఉంది. రాష్ట్రాలకు ద్రవ్యలోటు జీడీపీలో 4.5 శాతం ఉంటుందని భావిస్తున్నాం. 2020 (ఏప్రిల్)–2021 (మార్చి) ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.7.96 లక్షల కోట్ల ద్రవ్యలోటు ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. 2020–21 అంచనాలో 3.5% దాటకూడదన్నది ఈ లక్ష్యం ఉద్దేశం. అయితే ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలలూ గడిచే సరికే– అంటే ఏప్రిల్ నుంచి జూలై మధ్య నాటికే ద్రవ్యలోటు రూ.8,21,349 కోట్లకు చేరింది. అంటే వార్షిక లక్ష్యంలో 103.1 శాతానికి చేరిందన్నమాట.గత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 4.6 శాతం. ► జీ–20 దేశాలతో పోల్చిచూస్తే, భారత్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నట్లుగా మరే ఇతర ఆర్థిక వ్యవస్థ నష్టపోలేదు. ► ఆర్థిక వ్యవస్థ పురోగతికి ప్రభుత్వ పరంగా ద్రవ్య పరమైన మద్దతు చర్యలు తీసుకోడానికి పల్లు క్లిష్ట పరిస్థితులు, పరిమితులు ఉన్నాయి. ► బలహీన మౌలిక వ్యవస్థ, కార్మిక, భూ, ప్రొడక్ట్ మార్కెట్లలో క్లిష్ట పరిస్థితులు వృద్ధికి అవరోధాలు కలిగిస్తున్న అంశాలు. ► ఇక బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల మొండిబకాయిల సమస్యలు మరింత తీవ్రం అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ► సమీప భవిష్యత్తులో రేటింగ్‌ను పెంచే అవకాశాలు లేవు. ప్రభుత్వం తీసుకుంటున్న విధాన చర్యలు వృద్ధి బాటలో పురోగతికి సహకరిస్తున్నాయని గణాంకాలు వెల్లడించేవరకూ రేటింగ్ పెంపు ఉండబోదు. భారత్ సావరిన్ రేటింగ్‌ను జూన్‌లో మూడీస్– నెగెటివ్ అవుట్‌లుక్‌తో ‘బీఏఏ3’కి కుదించింది. ఇది చెత్త స్టేటస్‌కు ఒక అంచ ఎక్కువ. ► పర్యవేక్షణలో పటిష్టత, ఫైనాన్షియల్ రంగంలో స్థిరత్వం వంటి లక్ష్యాల సాధనకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తే, వృద్ధి రికవరీ వేగవంతం అయ్యే వీలుంది. కేర్ రేటింగ్స్ అంచనా మైనస్ 8.2 శాతం కాగా దేశీయ రేటింగ్ సంస్థ కేర్ రేటింగ్స్ శుక్రవారం మరో నివేదికను విడుదల చేస్తూ, 2020–21లో భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు మైనస్ 8% నుంచి 8.2% వరకూ ఉంటుందని అంచనావేసింది. ఇంతక్రితం ఈ క్షీణ అంచనా మైనస్ 6.4% కావడం గమనార్హం. ప్రభుత్వం నుంచి తగిన ద్రవ్యపరమైన మద్దతు ఆర్థిక వ్యవస్థకు అందకపోవడమే తమ అంచనాల పెంపునకు కారణమని కేర్ రేటింగ్స్ తెలిపింది. అందరి అంచనాలూ క్షీణతే.. మొదటి త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో భారత్ ఆర్థిక వ్యవస్థ 23.9 శాతం క్షీణ రేటును నమోదు చేసుకున్న నేపథ్యంలో... ఇప్పటికే పలు ఆర్థిక, రేటింగ్ సంస్థలు 2020–21లో భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు 10శాతం నుంచి 15 శాతం వరకూ ఉంటాయని అంచనా వేశాయి. ఆయా అంచనాలను పరిశీలిస్తే (అంచనాలు శాతాల్లో) సంస్థ తాజా క్రితం అంచనా అంచనా గోల్డ్‌మన్ శాక్స్ 14.8 11.8 ఫిచ్ 10.5 5.0 ఇండియా రేటింగ్స్ – రిసెర్చ్ 11.8 5.3 ఎస్బీఐ ఎకోర్యాప్ 10.9 6.8 -
క్రెడిట్ స్కోర్ జాగ్రత్త
బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి ఇప్పటి వరకు మీరెప్పుడైనా రుణం తీసుకున్నారా..? లేక కనీసం రుణం కోసం దరఖాస్తు అయినా చేసుకున్నారా..? అయితే, మీరో అంశం గమనించి ఉంటారు. అదే క్రెడిట్ స్కోర్. మీకు రుణం ఇవ్వాలంటే అన్ని అర్హతలూ ఉండాలి. వాటితోపాటు మంచి సిబిల్ స్కోర్ కూడా ఉండాలి. అసలు రుణానికి మీరు అర్హులా, కాదా అన్నది క్రెడిట్ స్కోరు చెప్పేస్తుంది. కానీ, తెలిసో, తెలియకో జరిగే తప్పులు క్రెడిట్ స్కోరును దెబ్బతీస్తాయి. అలా జరగకుండా చూసుకోవాలంటే అవేంటో తెలుసుకోవాలి. సిబిల్ స్కోరు 900 ఉంటే వారికి బ్యాంకులు రా రమ్మంటూ రుణాలిచ్చేస్తాయి. వ్యక్తుల రుణ చరిత్రకు ఇదే గరిష్ట స్కోరు. సాధారణంగా 700కు పైన ఉంటే మంచి స్కోర్ గా పరిగణిస్తారు. వీరికి రుణాలు తీసుకుని, చెల్లించగల సామర్థ్యం చక్కగా ఉందని అర్థం. ఈ సామర్థ్యా న్ని స్కోర్ రూపంలో పేర్కొంటారు. గరిష్ట స్కోరు గరిష్ట సామర్థ్యానికి నిదర్శనం. వీరు రుణాలు సులభంగా పొందగలరు. ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అప్పుల పరిమాణం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. బకాయిలు సకాలంలో చెల్లిస్తూ ఉండాలి. ఏ రుణానికైనా కొలమానం సిబిల్ స్కోరే ∙ రిపోర్టులో తప్పొప్పులూ సరిచేసుకోవచ్చు క్రెడిట్ రిపోర్టు సరిగ్గానే ఉందా...? ఆర్థిక సంస్థలు తమ నుంచి రుణాలు పొందిన వారి ఖాతాల వివరాలు, బకాయిలు, చెల్లింపులు, ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు... అంటే పేరు, చిరునామా, ఫోన్ నంబర్లు, పాన్ నంబర్, ఆదాయం వంటివి సిబిల్ వంటి క్రెడిట్ బ్యూరోలకు పంపుతుంటాయి. ఈ వివరాల ఆధారంగా సిబిల్ తరహా సంస్థలు సంబంధిత వ్యక్తుల క్రెడిట్ ప్రొఫైల్‌ను రూపొందించడం జరుగుతుంది. ఒకవేళ ఈ వివరాల్లో తప్పులున్నా, పాత వివరాలను అప్డేట్ చేయకపోయినా రిపోర్ట్ కూడా ఆ మేరకే జారీ అవుతుంది. కనుక వ్యక్తిగత సమాచారంలో మార్పుల గురించి ఎప్పటికప్పుడు రుణాలు ఇచ్చిన సంస్థలకు తెలియజేస్తూ ఉండాలి. రుణ బకాయిల చెల్లింపులు, ఖాతా బ్యాలెన్స్ విషయమై ఆర్థిక సంస్థలు సరైన సమాచారాన్ని చేరవేయకపోయినా, రిపోర్టులో తప్పులు దొర్లే అవకాశం ఉంది. లేదా మీ రిపోర్ట్‌లో కనిపించే రుణ విచారణలు, లావాదేవీలు నిజానికి మీవి కాకపోవచ్చు. పొరపాటుగా వేరొకరికి మీకు కలిపి ఉండొచ్చు. ఇవన్నీ క్రెడిట్ స్కోరును తగ్గించేస్తాయి. అందుకే వీటిని నివారించాలంటే క్రెడిట్ బ్యూరోల నుంచి వ్యక్తులు వారి వ్యక్తిగత రుణ రిపోర్ట్‌ను తెప్పించుకుని ఏడాదికోసారి అయినా పరిశీలించుకోవాలి. రుణాలిచ్చిన సంస్థలు ఆయా సమాచారంలో లోపాలను ధ్రువీకరించిన అనంతరం క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ రిపోర్టుల్లో వివరాలను సరిచేస్తాయి. ఇచ్చినంత రుణం వాడుకోవద్దు క్రెడిట్ కార్డుపై రూ.లక్ష వరకు లిమిట్ ఉందనుకోండి. అవసరం ఏర్పడింది కదా అని రూ.లక్ష వరకూ వాడుకోవడం వివేకం అనిపించుకోదు. రుణానికి ఉన్న అర్హతలో గరిష్ట స్థాయిలో వినియోగం ఉంటే అది రిస్క్‌తో కూడిన ఆర్థిక ప్రవర్తనను సూచిస్తుంది. అంతేకాదు మీ ఆర్థిక సామర్థ్యంపై, క్రమశిక్షణపై సందేహాలకు దారితీస్తుంది. అలాగే, మరీ తక్కువ రుణం తీసుకోవడం, తీసుకున్న రుణాన్ని ముందుగానే తీర్చేసి ఖాతా క్లోజ్ చేయడం లేదా క్రెడిట్ కార్డులను రద్దు చేసుకోవడం కూడా స్కోర్‌ను దెబ్బతీసే చర్యలే. అలాగే, మరింత రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం కూడా. రుణమే తీసుకోకుంటే...? అన్ని రకాల రుణాలకు దూరంగా ఉండ డం కూడా మంచిది కాకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా అత్యవసరంగా డబ్బులతో పని పడి వ్యక్తిగత రుణానికి దరఖాస్తు చేసుకున్నారనుకోండి... అర్హతలున్నా రుణాలిచ్చే సంస్థలు కఠిన షరతులు పెట్టొచ్చు. కొంచెం ఎక్కువ వడ్డీ రేటు చెల్లించేందుకు సిద్ధ పడాల్సి రావచ్చు. కారణం రుణాలిచ్చే సంస్థలు దాని కంటే ముందు గతంలో మీ రుణ చెల్లింపు చరిత్ర ఏ విధంగా ఉందన్న ఆధారాలను చూస్తేనే గానీ మీపై భరోసాకు రాలేవు. ఆ సమయంలో మీకంటూ క్రెడిట్ హిస్టరీ లేకపోవడం ప్రతికూలమే అవుతుంది. వెంటనే రిపోర్టు మారదు... రుణ బకాయిలు పూర్తిగా చెల్లించేసిన వెంటనే అవి మీ క్రెడిట్ రిపోర్ట్‌లో కనిపించాలనుకుంటే కష్టమే. ఇందుకు తగినంత సమయం ఇవ్వాలి. రుణ సంస్థలు సాధారణంగా రుణ బకాయిల చెల్లింపుల వివరాలను క్రెడిట్ బ్యూరోలకు తెలియజేయడానికి 30 నుంచి 60 రోజుల సమయాన్ని తీసుకుంటుంటాయి. అందుకే ఇలా ఒక రుణాన్ని పూర్తిగా తీర్చేసి వెంటనే మరో రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తే, పాత బకాయిల చెల్లింపుల వివరాలు క్రెడిట్ రిపోర్ట్‌లోకి చేరే వరకూ ఆగడం మంచిది. మొండిబకాయిలు తీర్చేస్తే... గడువు దాటిన తర్వాత కూడా చెల్లించకుండా ఉన్న బకాయిలను వెంటనే తీర్చేయడం మంచి పనే. కానీ, ఇది మీ క్రెడిట్ రిపోర్టులో ప్రతిఫలించకపోవచ్చు. ఉదాహరణకు రుణానికి సంబంధించిన వివాదం ఉందనుకోండి... దానిపై రుణదాతతో ఓ ఒప్పందం చేసుకుని కొంత మేర చెల్లించారనుకుందాం. అప్పుడు మిగిలి ఉన్న బకాయిలను రుణ సంస్థలు రిటన్ ఆఫ్ చేసేస్తాయి. కానీ, దీన్ని పెయిడ్ ఆఫ్ అకౌంట్‌కు బదులు సెటిల్డ్ అకౌంట్‌గా చూపిస్తే మాత్రం అది ప్రతికూలం అవుతుంది. అంటే మీరు ఇంకా బకాయిలు చెల్లించాల్సి ఉందని అర్థం. దీంతో కొత్తగా మీకు రుణాలిచ్చే సంస్థలు దీన్ని ప్రతికూలంగానే పరిగణిస్తాయి. అందుకే రుణదాతతో సెటిల్మెంట్కు బదులు వారితో చర్చలు జరిపి చెల్లించాల్సినంత చెల్లించడం స్కోరు పరంగా మంచిది. హామీగా ఉన్నా ఇబ్బందులే... రుణాలకు హామీదారులుగా ఉండడం రెండు రకాల చేటుకు దారితీస్తుంది. అసలు రుణం తీసుకున్న వ్యక్తి చెల్లించడంలో విఫలమైతే హామీదారుడిగా దాన్ని చెల్లించవలసిన బాధ్యత మీకు బదిలీ అవుతుంది. రెండోది... ఆ మేరకు రుణానికి అవకాశం మీకు తగ్గిపోతుంది.