హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణం, రియల్టీ, వాహన తయారీ పరిశ్రమ నుండి ఆరోగ్యకర డిమాండ్ కొనసాగడంతో పెయింట్స్ రంగం 2023–24లో 10–12 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేస్తుందని క్రిసిల్ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో పెయింట్స్ పరిశ్రమ ఆదాయం 18 శాతం వృద్ధి చెందుతుందన్న అంచనాలు ఉన్నాయి. క్రిసిల్ తాజా నివేదిక ప్రకారం.. పరిమాణం పెంపు, నగదు లభ్యత కారణంగా కంపెనీలు ఆరోగ్యకరమైన బ్యాలెన్స్ షీట్లను నిర్వహించడానికి సహాయపడతాయి.
మూలధనం పెరుగుతున్నప్పటికీ క్రెడిట్ ప్రొఫైల్స్‌ను మెరుగుపరుస్తుంది. 2022–24 మధ్య రూ.12,000 కోట్ల మూలధన వ్యయం చేయనున్నట్టు అయిదు టాప్ కంపెనీలు ప్రకటించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం 420 కోట్ల లీటర్లు. ఇందులో టాప్–5 కంపెనీల వాటా 90 శాతం. కొత్తగా ఈ రంగంలోకి ప్రవేశించిన కంపెనీలు 140 కోట్ల లీటర్ల సామర్థ్యాన్ని జోడించనున్నాయి.
క్రూడ్‌తో ముడిపడి..
2022–23లో పెయింట్స్ ధర 6 శాతం పెరిగింది. నిర్వహణ లాభాలు దాదాపు 2022–23 మాదిరిగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15–16 శాతం ఉండనున్నాయి. పెయింట్లలో వాడే కీలక ముడి పదార్థాలు క్రూడ్‌తో ముడిపడి ఉంటాయి. 2022 జూన్–జూలైలో క్రూడ్ బ్యారెల్ ధర 115 డాలర్లు పలికింది. ప్రస్తుతం ఈ ధర 85 డాలర్లకు పడిపోవడం నిర్వహణ లాభాలకు బూస్ట్‌నివ్వనుంది. అయితే డాలరుతో రూపాయి మారకం విలువ 2022–23లో రూ.80.2 నుంచి ప్రస్తుతం రూ.82 దాటింది. రూపాయి పతనం మార్జిన్లకు ముప్పుగా పరిణమిస్తుంది. పెయింట్స్ తయారీలో వాడే ముడి పదార్థాల అవసరాల్లో మూడింట ఒకవంతు దిగుమతులపైనే పరిశ్రమ ఆధారపడి ఉంది.
ఇదీ పెయింట్స్ పరిశ్రమ..
భారత పెయింట్స్ పరిశ్రమ విలువ రూ.65,000 కోట్లు. ఇందులో డెకోరేటివ్ విభాగం వాటా ఏకంగా 80 శాతం ఉంది. జీడీపీతో పోలిస్తే పెయింట్స్ డిమాండ్ 1.6–2 రెట్లు వృద్ధి చెందుతోంది. పునర్నిర్మాణం, నిర్మాణం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డెకోరేటివ్ పెయింట్స్ విభాగం 11–12 శాతం ఆదాయ వృద్ధికి ఆస్కారం ఉంది. బ్రాండెడ్ పెయింట్లకే భవిష్యత్ ఉందని టెక్నో పెయింట్స్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇక మౌలిక వసతులపై ప్రభుత్వ వ్యయం, ఆటోమొబైల్ పరిశ్రమ నుంచి స్థిర డిమాండ్‌తో ఇండస్ట్రియల్ పెయింట్స్ విభాగం ఆదాయం 8–9 శాతం అధికం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment