క్రెడిట్ స్కోర్ జాగ్రత్త
బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి ఇప్పటి వరకు మీరెప్పుడైనా రుణం తీసుకున్నారా..? లేక కనీసం రుణం కోసం దరఖాస్తు అయినా చేసుకున్నారా..? అయితే, మీరో అంశం గమనించి ఉంటారు. అదే క్రెడిట్ స్కోర్. మీకు రుణం ఇవ్వాలంటే అన్ని అర్హతలూ ఉండాలి. వాటితోపాటు మంచి సిబిల్ స్కోర్ కూడా ఉండాలి. అసలు రుణానికి మీరు అర్హులా, కాదా అన్నది క్రెడిట్ స్కోరు చెప్పేస్తుంది. కానీ, తెలిసో, తెలియకో జరిగే తప్పులు క్రెడిట్ స్కోరును దెబ్బతీస్తాయి. అలా జరగకుండా చూసుకోవాలంటే అవేంటో తెలుసుకోవాలి.
సిబిల్ స్కోరు 900 ఉంటే వారికి బ్యాంకులు రా రమ్మంటూ రుణాలిచ్చేస్తాయి. వ్యక్తుల రుణ చరిత్రకు ఇదే గరిష్ట స్కోరు. సాధారణంగా 700కు పైన ఉంటే మంచి స్కోర్ గా పరిగణిస్తారు. వీరికి రుణాలు తీసుకుని, చెల్లించగల సామర్థ్యం చక్కగా ఉందని అర్థం. ఈ సామర్థ్యా న్ని స్కోర్ రూపంలో పేర్కొంటారు. గరిష్ట స్కోరు గరిష్ట సామర్థ్యానికి నిదర్శనం. వీరు రుణాలు సులభంగా పొందగలరు. ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అప్పుల పరిమాణం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. బకాయిలు సకాలంలో చెల్లిస్తూ ఉండాలి.
ఏ రుణానికైనా కొలమానం సిబిల్ స్కోరే ∙
రిపోర్టులో తప్పొప్పులూ సరిచేసుకోవచ్చు
క్రెడిట్ రిపోర్టు సరిగ్గానే ఉందా...?
ఆర్థిక సంస్థలు తమ నుంచి రుణాలు పొందిన వారి ఖాతాల వివరాలు, బకాయిలు, చెల్లింపులు, ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు... అంటే పేరు, చిరునామా, ఫోన్ నంబర్లు, పాన్ నంబర్, ఆదాయం వంటివి సిబిల్ వంటి క్రెడిట్ బ్యూరోలకు పంపుతుంటాయి. ఈ వివరాల ఆధారంగా సిబిల్ తరహా సంస్థలు సంబంధిత వ్యక్తుల క్రెడిట్ ప్రొఫైల్‌ను రూపొందించడం జరుగుతుంది. ఒకవేళ ఈ వివరాల్లో తప్పులున్నా, పాత వివరాలను అప్‌డేట్ చేయకపోయినా రిపోర్ట్ కూడా ఆ మేరకే జారీ అవుతుంది. కనుక వ్యక్తిగత సమాచారంలో మార్పుల గురించి ఎప్పటికప్పుడు రుణాలు ఇచ్చిన సంస్థలకు తెలియజేస్తూ ఉండాలి. రుణ బకాయిల చెల్లింపులు, ఖాతా బ్యాలెన్స్ విషయమై ఆర్థిక సంస్థలు సరైన సమాచారాన్ని చేరవేయకపోయినా, రిపోర్టులో తప్పులు దొర్లే అవకాశం ఉంది. లేదా మీ రిపోర్ట్‌లో కనిపించే రుణ విచారణలు, లావాదేవీలు నిజానికి మీవి కాకపోవచ్చు. పొరపాటుగా వేరొకరికి మీకు కలిపి ఉండొచ్చు. ఇవన్నీ క్రెడిట్ స్కోరును తగ్గించేస్తాయి. అందుకే వీటిని నివారించాలంటే క్రెడిట్ బ్యూరోల నుంచి వ్యక్తులు వారి వ్యక్తిగత రుణ రిపోర్ట్‌ను తెప్పించుకుని ఏడాదికోసారి అయినా పరిశీలించుకోవాలి. రుణాలిచ్చిన సంస్థలు ఆయా సమాచారంలో లోపాలను ధ్రువీకరించిన అనంతరం క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ రిపోర్టుల్లో వివరాలను సరిచేస్తాయి.
ఇచ్చినంత రుణం వాడుకోవద్దు
క్రెడిట్ కార్డుపై రూ.లక్ష వరకు లిమిట్ ఉందనుకోండి. అవసరం ఏర్పడింది కదా అని రూ.లక్ష వరకూ వాడుకోవడం వివేకం అనిపించుకోదు. రుణానికి ఉన్న అర్హతలో గరిష్ట స్థాయిలో వినియోగం ఉంటే అది రిస్క్‌తో కూడిన ఆర్థిక ప్రవర్తనను సూచిస్తుంది. అంతేకాదు మీ ఆర్థిక సామర్థ్యంపై, క్రమశిక్షణపై సందేహాలకు దారితీస్తుంది. అలాగే, మరీ తక్కువ రుణం తీసుకోవడం, తీసుకున్న రుణాన్ని ముందుగానే తీర్చేసి ఖాతా క్లోజ్ చేయడం లేదా క్రెడిట్ కార్డులను రద్దు చేసుకోవడం కూడా స్కోర్‌ను దెబ్బతీసే చర్యలే. అలాగే, మరింత రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం కూడా.
రుణమే తీసుకోకుంటే...?
అన్ని రకాల రుణాలకు దూరంగా ఉండ డం కూడా మంచిది కాకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా అత్యవసరంగా డబ్బులతో పని పడి వ్యక్తిగత రుణానికి దరఖాస్తు చేసుకున్నారనుకోండి... అర్హతలున్నా రుణాలిచ్చే సంస్థలు కఠిన షరతులు పెట్టొచ్చు. కొంచెం ఎక్కువ వడ్డీ రేటు చెల్లించేందుకు సిద్ధ పడాల్సి రావచ్చు. కారణం రుణాలిచ్చే సంస్థలు దాని కంటే ముందు గతంలో మీ రుణ చెల్లింపు చరిత్ర ఏ విధంగా ఉందన్న ఆధారాలను చూస్తేనే గానీ మీపై భరోసాకు రాలేవు. ఆ సమయంలో మీకంటూ క్రెడిట్ హిస్టరీ లేకపోవడం ప్రతికూలమే అవుతుంది.
వెంటనే రిపోర్టు మారదు...
రుణ బకాయిలు పూర్తిగా చెల్లించేసిన వెంటనే అవి మీ క్రెడిట్ రిపోర్ట్‌లో కనిపించాలనుకుంటే కష్టమే. ఇందుకు తగినంత సమయం ఇవ్వాలి. రుణ సంస్థలు సాధారణంగా రుణ బకాయిల చెల్లింపుల వివరాలను క్రెడిట్ బ్యూరోలకు తెలియజేయడానికి 30 నుంచి 60 రోజుల సమయాన్ని తీసుకుంటుంటాయి. అందుకే ఇలా ఒక రుణాన్ని పూర్తిగా తీర్చేసి వెంటనే మరో రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తే, పాత బకాయిల చెల్లింపుల వివరాలు క్రెడిట్ రిపోర్ట్‌లోకి చేరే వరకూ ఆగడం మంచిది.
మొండిబకాయిలు తీర్చేస్తే...
గడువు దాటిన తర్వాత కూడా చెల్లించకుండా ఉన్న బకాయిలను వెంటనే తీర్చేయడం మంచి పనే. కానీ, ఇది మీ క్రెడిట్ రిపోర్టులో ప్రతిఫలించకపోవచ్చు. ఉదాహరణకు రుణానికి సంబంధించిన వివాదం ఉందనుకోండి... దానిపై రుణదాతతో ఓ ఒప్పందం చేసుకుని కొంత మేర చెల్లించారనుకుందాం. అప్పుడు మిగిలి ఉన్న బకాయిలను రుణ సంస్థలు రిటన్ ఆఫ్ చేసేస్తాయి. కానీ, దీన్ని పెయిడ్ ఆఫ్ అకౌంట్‌కు బదులు సెటిల్డ్ అకౌంట్‌గా చూపిస్తే మాత్రం అది ప్రతికూలం అవుతుంది. అంటే మీరు ఇంకా బకాయిలు చెల్లించాల్సి ఉందని అర్థం. దీంతో కొత్తగా మీకు రుణాలిచ్చే సంస్థలు దీన్ని ప్రతికూలంగానే పరిగణిస్తాయి. అందుకే రుణదాతతో సెటిల్‌మెంట్‌కు బదులు వారితో చర్చలు జరిపి చెల్లించాల్సినంత చెల్లించడం స్కోరు పరంగా మంచిది.
హామీగా ఉన్నా ఇబ్బందులే...
రుణాలకు హామీదారులుగా ఉండడం రెండు రకాల చేటుకు దారితీస్తుంది. అసలు రుణం తీసుకున్న వ్యక్తి చెల్లించడంలో విఫలమైతే హామీదారుడిగా దాన్ని చెల్లించవలసిన బాధ్యత మీకు బదిలీ అవుతుంది. రెండోది... ఆ మేరకు రుణానికి అవకాశం మీకు తగ్గిపోతుంది.