
ఈఎంఐ లు చెల్లించలేక వినియోగదారుల అవస్థలు
భవిష్యత్తులో నగదు సహిత రుణాలకూ ఇబ్బందులు
ఆర్థిక నియంత్రణ లేకపోతే భవిష్యత్ కష్టమంటున్న నిపుణులు
హిందూపురానికి చెందిన కరీముల్లా ఆర్నెళ్ల క్రితం రూ.లక్ష విలువ చేసే ఫర్నిచర్‌ను ఓ ప్రైవేటు సంస్థ ద్వారా ప్రతి నెలా రూ.5 వేలు చెల్లించేలా ఒప్పందంపై కొనుగోలు చేశాడు. తొలి నాలుగు నెలలు సజావుగానే ఈఎంఐ చెల్లించాడు. ఆ తర్వాత అతడు చేస్తున్న చిరుద్యోగం కాస్త ఊడిపోయింది. దీంతో కంతులు చెల్లించడంలో జాప్యం నెలకొంది. ఫలితంగా ఆర్నెల్ల తర్వాత చూసుకుంటే ఆయన సిబిల్ స్కోరు ఒక్కసారిగా 300కు పడిపోయింది.
పుట్టపర్తికి చెందిన చిరు వ్యాపారి కృష్ణసాయి తన అవసరాల నిమిత్తం ఓ బ్యాంకులో వ్యక్తిగత రుణం తీసుకున్నాడు. అనివార్య కారణాలతో వ్యాపారం తీసేయాల్సి వచ్చింది. దీంతో నెలవారీ కంతులు చెల్లించడంలో ఇబ్బందులు నెలకొని సిబిల్ స్కోరు 200కు పడిపోయింది. ఆ తర్వాత ఎన్ని బ్యాంకుల్లో ప్రయత్నించినా.. కొత్త రుణం ఆయనకు పుట్టలేదు.
.... ఇప్పట్లో సిబిల్ స్కోరుకు పెరిగిన ప్రాధాన్యతకు ఈ ఘటనలు ఓ ఉదాహరణ మాత్రమే. ఆర్థిక నియంత్రణ కోల్పోతే భవిష్యత్తు కష్టమని ఆర్థిక నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.
సాక్షి, పుట్టపర్తి: ఎవరైనా వ్యక్తి ఆర్థిక చరిత్రకు అద్దం పట్టేది క్రెడిట్ స్కోరు. ఇక్కడ తీసుకున్న లోన్లు.. చెల్లింపుల తీరు.. క్రెడిట్ కార్డుల వినియోగం.. అప్పుల కోసం ఎన్ని సార్లు ప్రయత్నించారు. గతంలో ఏమైనా లోన్లు ఎగ్గొట్టారా.. ఇప్పటికీ ఈఎంఐ కడుతున్నారా.. ఇలా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఈ క్రెడిట్ రిపోర్టుతో వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణ ఏపాటిదో సులువుగా తెలుసుకోవచ్చు. ఆర్థిక నియంత్రణ క్రమశిక్షణ లేకపోవడం కారణంగా చాలామంది చిరుద్యోగులు, చిరు వ్యాపారులు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు.
అప్పు చేసి విలాసాలు..
పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా మారింది ప్రస్తుతం మధ్య తరగతి ప్రజల పరిస్థితి. తమ చుట్టుపక్కల వారు ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే తమ ఇంట్లోనే ఉండాలనే ఆకాంక్ష తప్పు కాదు. అయితే ఇందు కోసం అప్పు చేసి ఆ తర్వాత రుణాలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి లేని తలనొప్పులు తెచ్చుకుంటున్నారు. చిన్నపాటి లావాదేవీల విషయంగానే సిబిల్ స్కోరు పడిపోయి.. భవిష్యత్తులో బ్యాంకుల ద్వారా రుణాలు పొందే సదుపాయాన్ని కోల్పోతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.
మధ్య తరగతి ప్రజల అవసరాలను తెలివిగా ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఆఫర్ల పేరుతో రుణాల ఎర వేసి ఆకట్టుకుంటున్నారు. అయితే రుణం తీసుకునే సమయంలో సరైన ప్లానింగ్ లేకపోవడంతో నెలవారీ కంతులు చెల్లించడంలో జాప్యం చోటు చేసుకుని భారీగా నష్టపోతున్నారు. ఆర్థిక క్రమశిక్షణ, అవగాహన లేకుంటే ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పెరిగిపోతున్న డిఫాల్టర్లు..
జిల్లా వ్యాప్తంగా రకరకాల ప్రైవేటు సంస్థల ద్వారా రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించలేని స్థితిలో చాలా మంది డిఫాల్టర్లుగా మారిపోతున్నారు. ఇటీవల వీరి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మొబైల్ ఫోన్లు, వాషింగ్ మెషీన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ఫర్నిచర్లు... తదితరాలను కొనుగోలు చేసిన వారే ఎక్కువ మంది డిఫాల్టర్లుగా మారినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా సిబిల్ స్కోరు 650 దాటితే ఏవైనా రుణాలొస్తాయి. కానీ తీసుకున్న రుణం సక్రమంగా చెల్లించకపోవడంతో ప్రతి పది మందిలో ఇద్దరు డిఫాల్టర్లుగా మారుతున్నారు.
సున్నా వడ్డీతో ఆకర్షిస్తూ..
పలు ఫైనాన్స్ కంపెనీలు జీరో ప్రాసెసింగ్, సున్నా వడ్డీ అంటూ ఇచ్చే ప్రకటనలతో చాలామంది వినియోగదారులు మోసపోతున్నారు. ఎలాంటి వడ్డీ లేకుండా, ప్రాసెసింగ్ ఫీజు లేకుండా వస్తువుకు డబ్బు కట్టి, పది నెలలు మనతో రీపేమెంట్ ఎందుకు చేసుకుంటాయనే లోగుట్టును చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఓ కంపెనీ ఎలాంటి లాభాపేక్ష లేకుండా జీరో ప్రాతిపదికన రుణం ఎందుకు ఇస్తుందనే విషయాన్ని వినియోగదారులు ఆలోచించాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఉంటే ఉత్తమమని సూచిస్తున్నారు.
సిబిల్ స్కోరు కీలకం
ప్రస్తుత పరిస్థితుల్లో సిబిల్ స్కోరు చాలా కీలకంగా మారింది. చిన్నపాటి అప్పుల సమాచారాన్ని సైతం ఆయా ఫైనాన్స్ సంస్థలు సిబిల్‌కు తెలియజేస్తాయి. చెల్లింపుల్లో జాప్యం లేదా మొండి బకాయిలు.. ఇలా రకరకాల కారణంగా చాలామందికి సిబిల్ స్కోరు లేక బ్యాంకుల్లో రుణాలు అందడం లేదు. వస్తువు తీసుకున్నాక సకాలంలో చెల్లింపులు చేయకపోతే భవిష్యత్తులో పరపతి లభించడం చాలా కష్టం. – రాధాకృష్ణారెడ్డి, ఆడిటర్, పుట్టపర్తి
Comments
Please login to add a commentAdd a comment