ఆర్థిక అవసరాలు నిత్యం పెరుగుతున్నాయి. వాటిని తీర్చుకునేందుకు చాలామంది రుణాలు తీసుకుంటున్నారు. ఆర్థిక సంస్థలు రుణాలపై విధించే వడ్డీరేట్లు కూడా భారీగా ఉన్నాయి. మంచి క్రెడిట్ స్కోరు సొంతం చేసుకుంటే తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంచి స్కోరు(CIBIL score)ను సాధించాలంటే దీనిపై ఉన్న అపోహలు వీడాలని సూచిస్తున్నారు.
ఉద్యోగంలో చేరిన కొన్ని నెలలకు సాలరీ ఆధారంగా క్రెడిట్ కార్డు(Credit Card) ఆఫర్ ఉందని ఫోన్లు వస్తుంటాయి. దాంతో చాలామంది క్రెడిట్‌కార్డును తీసుకుంటున్నారు. తొలి కార్డును సంపాదించడమే కొంత కష్టం. ఆ తర్వాత కార్డు బిల్లులు సకాలంలో చెల్లిస్తే, ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ స్కోరును ఆధారంగా చేసుకుని తమ క్రెడిట్ కార్డులు ఇస్తామంటూ ముందుకు వస్తాయి. అయితే క్రెడిట్ స్కోరును పెంచుకునే దశలో చాలామందికి కొన్ని సందేహాలున్నాయి. వాటిపై స్పష్టత ఉంటే స్కోరు దూసుకెళ్లేలా చేయవచ్చు.
ఆదాయం అవసరమా..?
క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉండాలంటే రాబడి బావుండాలని అనుకుంటారు. కానీ, ఆదాయంతో సంబంధం ఉండదు. ఏటా రూ.6 లక్షలు ఆదాయం ఉన్నవారికి మంచి క్రెడిట్ స్కోరు ఉండొచ్చు. ఏటా రూ.20 లక్షల ఆదాయం(Income) ఉన్నవారి స్కోరు పేలవంగా ఉండొచ్చు. వారు గతంలో తీసుకున్న రుణాలు, వాటి చెల్లింపులు సరళి ఎలా ఉందనే దానిపై ఇది ఆధారపడుతుంది. ఆదాయంతో సంబంధం లేకుండా సకాలంలో బిల్లులు చెల్లించడం, తక్కువ క్రెడిట్ వినియోగం వంటివి స్కోరు పెరిగేందుకు దోహదపడుతాయి.
కార్డును పూర్తిగా వాడవచ్చా..?
క్రెడిట్ కార్డు పరిమితి పూర్తిగా వాడలేదు కదా, స్కోరు పడిపోయిందనే సందేహం వ్యక్తం చేస్తారు. నిజానికి కార్డు మొత్తం పరిమితి మేరకు వినియోగిస్తే స్కోరుపై ప్రభావం పడుతుంది. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు లిమిట్(Card Limit) రూ.1 లక్ష అనుకుందాం. మీరు అందులో సుమారు 40 శాతం అంటే రూ.40,000 వినియోగిస్తే మేలు. లిమిట్ ఉందని రూ.90,000 వరకు లిమిట్ వినియోగిస్తే మొదటికే మోసం వస్తుంది. ఏకమొత్తంలో అధికంగా క్రెడిట్ కార్డు వాడితే స్కోరు తగ్గే ప్రమాదం ఉంది.
పాత కార్డులను క్లోజ్ చేయాలా..?
గతంలో వాడి, ప్రస్తుతం వాడకుండా ఉన్న కార్డులను క్లోజ్ చేస్తే స్కోరు పెరుగుతుందనే వాదనలున్నాయి. ఇందులో నిజం లేదు. గతంలో మీరు వాడిన కార్డులపై క్రెడిట్ హిస్టరీ జనరేట్ అవుతుంది. మీరు కార్డు క్లోజ్ చేస్తే ఆ హిస్టరీ కూడా డెలిట్ అవుతుంది. సుధీర్ఘ క్రెడిట్ హిస్టరీ ఉంటే స్కోరు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: ‘పెండింగ్ సబ్సిడీలను విడుదల చేయాలి’
స్కోరు పెరగాలంటే..
గతంలో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలి.
సమయానికి ఈఎంఐ చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది.
రుణాలు తీసుకునే ముందు అన్ని తరహా లోన్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ రుణాల మధ్య బ్యాలెన్స్ పాటించాలి. హోమ్ లోన్స్, కారు లోన్స్‌ను సెక్యూర్డ్ లోన్స్‌గా పరిగణిస్తారు. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్(Loans)ను అన్‌సెక్యూర్డ్ లోన్స్‌గా భావిస్తారు. ఇలా మీరు సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ లోన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బ్యాంకులు మంచి క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి.
క్రెడిట్ కార్డు లిమిట్‌ను పూర్తిగా ఉపయోగించొద్దు. కార్డు లిమిట్‌లో కేవలం 30-40 శాతం మాత్రమే ఉపయోగించాలి. ఈ లిమిట్ కన్నా ఎక్కువగా ఉపయోగిస్తే క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
ఎదుటివారు తీసుకునే రుణాలకు గ్యారెంటీగా ఉండకూడదు. ఎందుకంటే అవతలి వ్యక్తి ఏదైనా పరిస్థితుల్లో రుణం చెల్లించకుండా డీఫాల్ట్ అయితే గ్యారెంటీ మీరు కాబట్టి మిమ్మల్ని చెల్లించమంటారు. ఆ సమయానికి డబ్బు సమకూరకపోతే అది మీ సిబిల్ స్కోరుపై ప్రభావం చూపిస్తుంది.
క్రెడిట్‌కార్డు బిల్లు చెల్లించేప్పుడు వీలైతే రెండు దఫాలుగా పే చేయండి. ఉదాహరణకు మీ బిల్లు రూ.12000 అనుకుందాం. పేమెంట్ తేదీ 15 నుంచి 30వ తేదీ వరకు ఉందనుకుందాం. ఈ 15 రోజుల్లో ఒకసారి రూ.6000 మరోసారి మిగిలిన రూ.6000 చెల్లించండి. దాంతో మీ పేమెంట్ రెండుసార్లు రికార్డు అవుతుంది. ఫలితంగా క్రెడిట్‌స్కోరు పెరిగే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment