మీ స్కోర్‌ ఎంత..? | Sakshi Special story about summary of your credit history | Sakshi
Sakshi News home page

మీ స్కోర్‌ ఎంత..?

Published Mon, Mar 24 2025 5:12 AM | Last Updated on Mon, Mar 24 2025 5:12 AM

Sakshi Special story about summary of your credit history

రుణ అర్హతలకి క్రెడిట్‌ స్కోర్‌ ప్రామాణికం

క్రెడిట్‌ రిపోర్ట్‌లో తప్పులతో తగ్గిపోవచ్చు

లోపాలు, మోసపూరిత లావాదేవీ ఎంట్రీలు

అందుకే ఏటా రుణ చరిత్రను తిరగేయాలి

తప్పులుంటే సరిచేసుకోవాలి

చివరిగా అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించాలి  

ముంబైకి చెందిన అజయ్‌ వర్మ (31) తన పర్సనల్‌ లోన్‌ను పూర్తిగా తీర్చేసి నాలుగు నెలలు గడిచిపోయింది. ఇటీవలే క్రెడిట్‌ రిపోర్ట్‌ను పరిశీలించగా.. ఆ రుణం ముగిసిపోయిన విషయం తన రుణ చరిత్రలోకి చేరలేదన్న విషయం అర్థమైంది. క్రెడిట్‌ స్కోర్‌ను తెలుసుకోండంటూ ‘పైసాబజార్‌’ నుంచి వచ్చిన సందేశం చూసి, హైదరాబాద్‌కు చెందిన అఖిలేశ్‌ (45) లింక్‌పై క్లిక్‌ చేశాడు. మొబైల్‌ నంబర్, ఓటీపీతో లాగిన్‌ అయిన తర్వాత క్రెడిట్‌ రిపోర్ట్‌ తెరుచుకుంది. అందులో తాను తీసుకోని రుణాల సమాచారం ఉండడాన్ని చూసి ఆందోళన చెందాడు. ఆర్జించే ప్రతి వ్యక్తి క్రెడిట్‌ రిపోర్ట్‌ను తరచుగా ఎందుకు తనిఖీ చేసుకోవాలి? అన్న దానికి ఇవి నిదర్శనాలుగా నిలుస్తాయి.  

మనలో కొందరు ఏటా ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటూ ఉంటారు. అనారోగ్యాలు ఏవైనా ఉంటే ఆరంభంలోనే గుర్తించి నయం చేసుకునేందుకు ఈ పరీక్షలు వీలు కల్పిస్తాయి. అదే మాదిరి క్రెడిట్‌ రిపోర్ట్‌ను ఏడాదికోసారి అయినా తనిఖీ చేసుకోవడం ద్వారా అందులో తప్పులు, పొరపాట్లు, మోసపూరిత లావాదేవీలకు చోటు లేకుండా చూసుకోవచ్చు. మెరుగైన క్రెడిట్‌ స్కోర్‌తో రుణ పరపతిని గణనీయంగా పెంచుకోవచ్చు.                                               
                                             

గతంలో ఎంతో ముఖ్యమైన అవసరం ఉంటేనే అరువు తీసుకునేవారు. కానీ, నేడు మెరుగైన జీవనం కోసం, కోరికలు తీర్చుకోవడానికి, సొంతింటి కల సాకారానికి ఇలా ఒకటేమిటి.. అన్ని అవసరాలకు రుణాలను ఆశ్రయించే సంస్కృతి విస్తరిస్తోంది. 2024 ఫిబ్రవరి నాటికి మన దేశంలో 10 కోట్ల మందికి పైగా క్రెడిట్‌ కార్డులున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇల్లు, కారు, ఇంట్లో ఖరీదైన ఎల్రక్టానిక్‌ పరికరాలను ఈఎంఐలపై తీసుకోవడానికి ఎంతమాత్రం సంకోచించడం లేదు. ప్రతి రుణానికి గీటురాయి మెరుగైన క్రెడిట్‌ స్కోరే. తీరా రుణం అవసరమైన పరిస్థితుల్లో క్రెడిట్‌ రిపోర్ట్‌లో లోపాలు అడ్డంకిగా మారొచ్చు. అందుకే క్రెడిట్‌ రిపోర్ట్‌ను అప్పుడప్పుడూ పరిశీలించుకోవడం అవసరం. ‘గతంలో రుణం తీసుకుని, అన్ని ఈఎంఐలను సకాలంలో చెల్లించేశాను. కనుక, భవిష్యత్తులో సులభంగా రుణం లభిస్తుంది’ అని అనుకోవడానికి లేదు. మీకున్న క్రెడిట్‌ స్కోర్‌? మీ అర్హతలను నిర్ణయిస్తుంది.    

క్రెడిట్‌ రిపోర్ట్‌.. 
వ్యక్తులు, వ్యాపార సంస్థల పేరిట (పాన్‌ ఆధారంగా) అన్ని రుణాలు, వాటి చెల్లింపుల వివరాలతో కూడిన సెంట్రల్‌ డేటాను నిర్వహించేవే క్రెడిట్‌ బ్యూరోలు. బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు ప్రతీ రుణానికి సంబంధించి చెల్లింపుల వివరాలను ఎప్పటికప్పుడు క్రెడిట్‌ బ్యూరోలకు తెలియజేస్తుంటాయి. ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్, ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్, క్రిఫ్‌ హైమార్క్‌ సంస్థలు ప్రస్తుతం ఈ సేవలను ఆందిస్తున్నాయి. రుణం కోరుతూ చేసే విచారణలు, రుణానికి చేసే దరఖాస్తులు, రుణాల జారీ, వాటికి చెల్లింపులు, ఈఎంఐలను సకాలంలో చెల్లించలేకపోవడం, రుణ చెల్లింపులను ఎగవేయడం ఇలా ప్రతీ సమాచారం క్రెడిట్‌ బ్యూరో రికార్డుల్లో నమోదవుతుంటుంది. ఇప్పటి వరకు ఒక వ్యక్తి లేదా సంస్థ ఎన్ని రుణాలు తీసుకున్నారు, వాటిని పూర్తిగా చెల్లించారా? లేదా? అన్న సంపూర్ణ సమాచారం ఉంటుంది. 
 
ప్రతి రుణ ఖాతాకు సంబంధించి తాజా సమాచారాన్ని 15 రోజులకు ఒకసారి (గతంలో నెలకోసారి) క్రెడిట్‌ బ్యూరోలకు అందించాలని ఆర్థిక సంస్థలు, బ్యాంక్‌లను ఇటీవలే ఆర్‌బీఐ ఆదేశించడం గమనార్హం. ఇలా అన్ని మార్గాల ద్వారా వచ్చే సమాచారం ఆధారంగానే ప్రతి వ్యక్తి/సంస్థ పేరిట క్రెడిట్‌ రిపోర్ట్‌ను క్రెడిట్‌ బ్యూరోలు రూపొందిస్తుంటాయి. ఈ సమాచారం ఆధారంగానే స్కోర్‌ను కేటాయిస్తుంటాయి. వివిధ రకాల రుణ సాధనాలను వినియోగించుకోవడం.. వాయిదాలను సకాలంలో చెల్లిస్తూ ఆర్థిక క్రమశిక్షణ చూపించే వారికి బలమైన స్కోర్‌ లభిస్తుంది. 

రుణం మంజూరు చేస్తే ఎంత రిస్క్‌ ఉంటుందన్న విషయాన్ని బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు క్రెడిట్‌ రిపోర్ట్, స్కోర్‌ ఆధారంగా సులభంగా అంచనాకు వస్తాయి. కేవలం రుణదాతలే క్రెడిట్‌ స్కోర్‌/రిపోర్ట్‌కు పరిమితం కావడం లేదు. బీమా కంపెనీలు పాలసీల జారీకి ముందు సంబంధిత దరఖాస్తుదారుడి క్రెడిట్‌ స్కోర్‌ను ఇటీవలి కాలంలో పరిశీలిస్తున్నాయి. కంపెనీలు ఉద్యోగ నియామకాల సమయంలోనూ అభ్యర్థుల క్రెడిట్‌ స్కోర్‌ను గమనిస్తున్నాయి. తద్వారా వారు ఆర్థిక విషయాల్లో ఎంత క్రమశిక్షణగా ఉంటున్నారో తెలుసుకోవాలని అనుకుంటున్నాయి. క్రెడిట్‌ రిపోర్ట్‌లో ఒక్కోసారి తప్పులు, పొరపాట్లకు అవకాశం లేకపోలేదు. ప్రతి ఒక్కరూ తమ క్రెడిట్‌ రిపోర్ట్‌ను పరిశీలించుకోవడం ద్వారానే వీటి గురించి తెలుస్తుంది. లేదంటే రుణ దరఖాస్తు తిరస్కారానికి గురైనప్పుడే వాటి గురించి తెలుస్తుంటుంది.

ఏమి చూడాలి..? 
క్రెడిట్‌ స్కోర్‌ను సరిగ్గా అర్థం చేసుకోవడం, మెరుగైన స్కోర్‌ కొనసాగేలా చూసుకోవడం ఎంతో ముఖ్యమని సిబిల్‌ మాజీ ఎండీ, అథేనా క్రెడ్‌ఎక్స్‌పర్ట్‌ వ్యవస్థాపకుడు సతీష్‌ మెహతా పేర్కొన్నారు. నాలుగు క్రెడిట్‌ బ్యూరోల నుంచి ఏడాదికోసారి ఉచితంగా క్రెడిట్‌ రిపోర్ట్‌ను పొందొచ్చు. అంటే ప్రతి బ్యూరో నుంచి ఒకటి పొందే అవకాశం ఉంటుంది. ప్రతి మూడు నెలలకు ఒక బ్యూరో నుంచి రిపోర్ట్‌ను ఉచితంగా పొందడం ద్వారా అందులో సమాచారం సరిగ్గా ఉందా? లేదా అన్నది నిర్ధారించుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఏదైనా రుణం తీసుకోవాలని అనుకుంటుంటే, దానికంటే ముందుగానే క్రెడిట్‌ రిపోర్ట్‌ను పరిశీలించుకుని, అందులోని సమాచారం అంతా సవ్యంగా ఉందో లేదో అన్నది ధ్రువీకరించుకోవాలి. లేదంటే రుణ అర్హతపై ప్రభావం పడుతుంది. కనీసం ఏడాదిలో ఒకసారి పరిశీలించుకోవడం ద్వారా తప్పులు సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.  

→ గతంలో ఎప్పుడో వాడి పడేసిన క్రెడిట్‌ కార్డ్‌పై రూ.100 బకాయి ఉన్నా సరే అది ఏళ్లపాటు క్రెడిట్‌ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది. 
→ రుణం పూర్తిగా చెల్లించినప్పటికీ.. సంబంధిత రుణ ఖాతాను ‘ఓపెన్‌’ అని (ఇంకా తీరిపోలేదు) చూపించొచ్చు. బాకీ మొత్తాన్ని తప్పుగా చూపించొచ్చు. తాము తీసుకోని రుణాలు  తీసుకున్నట్టుగా క్రెడిట్‌ రిపోర్ట్‌లోకి చేరొచ్చు.  

→ మోసపూరిత రుణ ఖాతాలు సైతం ఒకరి రుణ చరిత్రను దెబ్బతీసే ప్రమాదం ఉంది. అంటే ఒకరి పాన్‌పై వేరొకరు/సంస్థలు మోసపూరితంగా రుణాలు తీసుకుని ఎగ్గొట్టడం వంటివి చోటు చేసుకోవచ్చు. 
→ రుణ ఖాతా వర్గీకరణను చూడాలి. అన్ని రుణ ఖాతాలకూ ‘స్టాండర్డ్‌’అనే ఉండాలి. ‘ఓవర్‌ డ్యూ’, ‘ఎస్‌ఎంఏ’ అన్న ట్యాగ్‌లు ఉండకూడదు. 
→ ఒక్కోసారి ఒకే రుణం రెండు రుణ ఖాతాలుగా క్రెడిట్‌ రిపోర్ట్‌లో నమోదు కావచ్చు. 
→ క్రెడిట్‌ రిపోర్ట్‌లో ప్రతి లోపం మోసం కాకపోవచ్చు. రుణ గ్రహీత సకాలంలోనే చెల్లించినప్పటికీ, బ్యాంక్‌ లేదా ఎన్‌బీఎఫ్‌సీ జాప్యం అయినట్టు పొరపాటుగా క్రెడిట్‌ బ్యూరోలకు సమాచారం ఇవ్వొచ్చు. అలాంటి అవాస్తవ, తప్పులు/లోపాలు/మోసాలకు సంబంధించిన సమాచారాన్ని తొలగించుకునే హక్కు రుణ గ్రహీతలకు ఉంటుంది. 
→ వ్యక్తిగత రుణాన్ని వ్యాపార రుణంగా పేర్కొనే అవకాశం లేకపోలేదు.  

మెరుగైన స్కోర్‌తో లాభాలు.. 
→ చక్కని ఆర్థిక క్రమశిక్షణ, సకాలంలో రుణ చెల్లింపులతో క్రెడిట్‌ స్కోర్‌ను మెరుగ్గా కాపాడుకోవచ్చు. దీనివల్ల రుణాలను ఇతరులతో పోల్చితే తక్కువ రేటుకే సొంతం చేసుకోవచ్చు. వ్యాపార సంస్థల విషయంలోనూ ఇంతే. రుణ షరతుల్లో వెసులుబాటు లభిస్తుంది.  
→ ఒకేసారి ఒకటికి మించిన రుణాలు తీసుకోవడం క్రెడిట్‌ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అలాగే, తరచూ రుణాల కోసం చేసే విచారణలు సైతం క్రెడిట్‌ స్కోర్‌ను తగ్గించేస్తాయి.   
→ రుణ బకాయిలను జాప్యం లేకుండా నిర్ణీత కాలవ్యవధిలో తీర్చేయాలి. ఒక్క రుణ వాయిదా చెల్లింపులోనూ ఆలస్యం లేకుండా చూసుకోవాలి. చెల్లించడం కష్టమని భావిస్తే రుణ కాల వ్యవధిని పెంచుకుని, ఈఎంఐ తగ్గించుకోవాలి.   
→ ఒకేసారి ఒకటికి మించి ఒకే తరహా రుణాలు తీసుకోకూడదు. ఒకటికి మించిన పర్సనల్‌ లోన్‌లు, వాహన రుణాలు స్కోర్‌ను తగ్గించేస్తాయి. దీనికి బదులు క్రెడిట్‌ కార్డ్, పర్సనల్‌ లోన్, వెహికల్‌ లోన్, హౌసింగ్‌ లోన్‌ ఇలా రుణాలు మిశ్రమంగా ఉంటే స్కోర్‌కు నష్టం చేయదు.  
→ క్రెడిట్‌ కార్డుపై క్రెడిట్‌ లిమిట్‌లో వినియోగం (యుటిలైజేషన్‌ రేషియో) 30–40 శాతం మించకుండా చూసుకోవాలి.

తప్పులు సరిచేసుకోవడం ఎలా? 
→ రుణాలకు సంబంధించి ఏవైనా తప్పులను గుర్తించినట్టయితే, క్రెడిట్‌ బ్యూరో దృష్టికి తీసుకెళ్లాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు దాఖలు చేయొచ్చు. తమ క్లెయిమ్‌కు ఆధారాలను కూడా జత చేయాలి.  
→ రుణాలను సరిగ్గానే చెల్లించినప్పటికీ తప్పులు చోటుచేసుకుంటే బ్యాంక్‌ లేదా ఎన్‌బీఎఫ్‌సీ దృష్టికి తీసుకెళ్లాలి. క్రెడిట్‌ బ్యూరోలోని సమాచారం అప్‌డేట్‌కు బ్యాంక్, ఎన్‌బీఎఫ్‌సీ సహకరిస్తాయి.  
→ అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌ వద్ద ఫిర్యాదు దాఖలు చేయాలి.  
→ క్రెడిట్‌ రిపోర్ట్‌లో మీ పేరు, చిరునామా, డేట్‌ ఆఫ్‌ బర్త్, గుర్తింపు వివరాల్లో పొరపాట్లు ఉంటే అదే విషయాన్ని సంబంధిత క్రెడిట్‌ బ్యూరో దృష్టికి తీసుకెళ్లి సరిచేసుకోవచ్చు.  

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement