న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్ బిడ్డింగ్ ప్రక్రియ సఫలం కాకపోతే, ఈ సమస్యను ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ)కు వెలుపలే పరిష్కరించుకోవాలన్న యోచనతో బ్యాంకులు ఉన్నాయి. జెట్‌కు రూ.8,500 కోట్లకు పైగా రుణాలు ఇచ్చి, వాటి వసూలు కోసం సంస్థను అధీనంలోకి తీసుకున్న ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కమిటీ... సంస్థను విక్రయించేందుకు బిడ్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. సంస్థకు అత్యవసంగా అవసరమైన నిధులను సైతం సమకూర్చేందుకు బ్యాంకులు నిరాకరించడంతో మొత్తం కార్యకలాపాలను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ బిడ్డింగ్ ప్రక్రియ విజయవంతం అవుతుందని బ్యాంకులు ఎంతో ఆశతో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ బిడ్డింగ్ ప్రక్రియ సఫలం కాకపోతే ప్లాన్ బి (ఐబీసీ వెలుపల పరిష్కారం) దిశగా పనిచేయనున్నట్టు పేర్కొన్నాయి. ఐబీసీ కింద అయితే పరిష్కారానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం అవసరం. పైగా ఈ ప్రక్రియ మార్కెట్ స్పందనపై ఆధారపడి, సమయం తీసుకుంటుంది. జెట్‌కు ఉన్న విమానాలు, ఇతర ఆస్తులను విక్రయించడమే ప్లాన్ బిగా పేర్కొన్నాయి. ఎతిహాద్ ఎయిర్‌వేస్, టీపీజీ క్యాపిటల్, ఇండిగో పార్ట్‌నర్స్, నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ జెట్ ఎయిర్‌వేస్‌లో వాటాల పట్ల ఆసక్తి ప్రదర్శించినట్టు సమాచారం. అయితే, బిడ్డర్ల సమాచారం మే 10న అధికారికంగా తెలియనుంది.
జెట్ ఆగిపోవడం ఓ స్కామ్: ఆనంద్‌శర్మ
జెట్‌ఎయిర్‌వేస్ కూలిపోవడం ఓ స్కామ్‌గా కనిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్‌శర్మ ఆరోపించారు. ఎన్నికల ముందు ఇది చోటు చేసుకోవడంతో ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని, దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఆదేశించాలని కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇదో పెద్ద స్కామ్‌గా నాకు అనిపిస్తోంది. ఎన్నికల సమయంలో దీన్ని అమలు చేశారు. దీంతో ఎవరూ ప్రశ్నించరు’’ అని శర్మ అన్నారు. ఎయిర్‌లైన్స్‌కు కావాల్సిన అత్యవసర నిధులను అందించేందుకు రుణదాతల కమిటీ తిరస్కరించడంపై సందేహాలు వ్యక్తం చేశారు.
ప్రైవేటీకరణ పరిష్కారం కాదు: ఏఐ ఉద్యోగులు
ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారం కాదని ఎయిర్ ఇండియా ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రైవేటు రంగంలోని జెట్ ఎయిర్‌వేస్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతపడిన ఘటనలు ఇందుకు ఉదాహరణలుగా పేర్కొంది. ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం తన ప్రణాళికలపై తక్షణమే పునరాలోచన చేయాలని ఎయిర్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏసీఈయూ) సీనియర్ అధికారి పేర్కొన్నారు.
జెట్‌ఎయిర్‌వేస్ 20,000 మంది ఉద్యోగులకు మద్దతుగా మాట్లాడుతూ... ప్రభుత్వ విధానాలు విమానయాన పరిశ్రమలో సంక్షోభానికి, ఉద్యోగాల నష్టానికి కారణమవుతున్న నేపథ్యంలో వీటిపై పునఃపరిశీలన అవసరమని సూచించారు. ‘‘మొదట కింగ్‌ఫిషర్, ఇప్పుడు జెట్ ఎయిర్‌వేస్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ప్రైవేటీకరణ కార్యక్రమం వల్ల అర్థం చేసుకోవాల్సినది ఏమంటే... జాతీయీకరణను తొలగించడం ఒక్కటే లాభాలు, సామర్థ్యాన్ని తెచ్చిపెట్టలేవు’’అని ఆ అధికారి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment