ఎన్‌పీఏలపై త్వరలోనే చర్యలు: జైట్లీ
♦ ఈ దిశగా ఆర్‌బీఐ చురుగ్గా పనిచేస్తోంది
♦ రుణమాఫీకి కేంద్ర సాయం ఉండదని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: దివాలా, బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద చర్యలు చేపట్టాల్సిన రుణ ఎగవేతదారుల జాబితాను ఆర్‌బీఐ రూపొందిస్తోందని, ఇందుకు సంబంధించి త్వరలోనే నిర్ణయాలు వెలువడతాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వరంగ బ్యాంకుల మొండిబకాయిలు (ఎన్‌పీఏలు) రూ.6 లక్షల కోట్లను దాటిపోయిన నేపథ్యంలో... సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునే అధికారాన్ని ఆర్‌బీఐకి కట్టబెడుతూ కేంద్రం ఇటీవలే బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి సవరణలతో ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్‌తో ఆర్‌బీఐ మరింత మెరుగైన స్థితిలో ఉందని జైట్లీ పేర్కొన్నారు. జైట్లీ సోమవారం ఢిల్లీలో ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లతో సమావేశమయ్యారు. ఎన్‌పీఏలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితులు, సైబర్ భద్రత సహా పలు అంశాలపై ఈ సందర్భంగా సమీక్ష జరిగింది. అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడారు.
ఎన్‌పీఏల ఆర్డినెన్స్ అమలు విషయంలో మౌలిక సదుపాయాలపై పలువురు బ్యాంకర్లు ఆందోళన వ్యక్తం చేసినట్టు చెప్పారు. ఐబీసీ కింద జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్టీ)లో 81 కేసులు దాఖలయ్యాయని, వీటిలో 18 రుణదాతలు దాఖలు చేసినవిగా జైట్లీ తెలిపారు. ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఆధారంగా కఠినచర్యలు తీసుకుంటే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమావేశంలో పాల్గొన్న ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ముంద్రా మాట్లాడుతూ.. ఎన్‌పీఏలపై మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.
రైతు రుణాల మాఫీ భారం రాష్ట్రాలదే
రైతుల రుణాల మాఫీ విషయంలో రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సాయం చేయదని, ఇందుకు సంబంధించిన వ్యయమంతా ఆయా రాష్ట్రాలే భరించాల్సి ఉంటుందని జైట్లీ స్పష్టం చేశారు. మహారాష్ట్ర సర్కారు రైతు రుణాలను మాఫీ చేస్తూ ఆదివారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోనూ ఇదే డిమాండ్‌తో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
జైట్లీతో ఇన్ఫీ సిక్కా భేటీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా సోమవారం ఆర్థిక మంత్రి జైట్లీతో సమావేశమయ్యారు. దేశీ ఐటీ రంగంలో ఉద్యోగాల్లో కోతలు, కీలకమైన అమెరికా తదితర మార్కెట్లలో వీసా నిబంధనలు కఠినతరం అవుతుండటం మొదలైన అంశాలపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సుమారు 45 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో ఇన్ఫోసిస్ సీవోవో యూబీ ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.