ముంబై: దేశీ బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలకు నిధుల కేటాయింపులు (ప్రొవిజన్లు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2.4 నుంచి రూ.2.6 లక్షల కోట్లుగా ఉండొచ్చని రేటింగ్స్ సంస్థ ఇక్రా అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో ప్రొవిజన్లు రూ.2 లక్షల కోట్ల డాలర్లే. కేంద్ర ప్రభుత్వం ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ)ని తీసుకురావడం, దీని కింద రూ.1.75 లక్షల కోట్ల మొండి బకాయిల కేసులపై దివాలా చర్యలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రొవిజన్లు పెరుగుతాయన్నది ఇక్రా విశ్లేషణ. ఐబీసీకి తాజాగా చేసిన సవరణలతో బ్యాంకులు నిధుల కేటాయింపులను పెంచాల్సి వస్తుందని అభిప్రాయపడింది.
దీంతో ప్రభుత్వరంగ బ్యాంకులు అధిక నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో (జూలై–సెప్టెంబర్) రుణాలకు చేసిన కేటాయింపులు రూ.64,500 కోట్లుగా ఉన్నాయి. క్వార్టర్ వారీగా చూసుకుంటే ఇది 40% అధికం. వార్షిక ప్రాతిపదికన 30 శాతం ఎక్కువ. ఐబీసీ కింద మొత్తం రూ.3 లక్షల కోట్ల ఎన్‌పీఏల కేసులు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. దీంతో మొత్తం మీద క్రెడిట్ ప్రొవిజన్స్ రూ.2.6 లక్షల కోట్ల వరకు ఉండొచ్చు’’ అని ఇక్రా గ్రూప్ హెడ్ కార్తీక్ శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఐబీసీకి ఇటీవల చేసిన సవరణలతో నష్టాలు పెరుగుతాయ ని, అధిక ప్రొవిజన్లకు అవకాశాలున్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment