బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో అప్పులు తీసుకొని ఎగ్గొట్టి, కుమోసగించి విదేశాల పలాయనం చిత్తగిస్తున్న నేరగాళ్ల పని పట్టేందుకు చట్టం తీసుకురావాలని ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బిల్లును గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. నిరుడు ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించి, ఆ ఏడాది సెప్టెంబర్ నాటికే సిద్ధమై అతీ గతీ లేకుండా పడి ఉన్న బిల్లుకు ఇప్పుడు కదలిక రావడానికి గల కారణాలేమిటో అందరికీ తెలుసు. రూ. 11,400 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) కుంభకోణం భళ్లున బద్దలయ్యాక ఈమధ్యకాలంలో వరసగా వెల్లడవు తున్న స్కాంలపై దేశ ప్రజల్లో కలవరం బయల్దేరింది. సహజంగానే ఈ వ్యవహారంపై విపక్షాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాలున్నాయి. అందువల్లే ఈ బిలుకు మోక్షం కలిగింది. కారణం ఏదైనా తక్షణం ఇలాంటి చట్టం రావలసి ఉన్నదని ఎవరైనా అనుకుంటారు.
మన దేశంలో ఇప్పుడే కాదు.. దశాబ్దాలుగా బ్యాంకులనుంచి అప్పు తీసు కోవడం, ఎగ్గొట్టడం, చివరకు దేశంనుంచి పరారు కావడం రివాజుగా మారింది. కొందరు ఎగవేతదార్లు ఇక్కడే బోర విరుచుకుని తిరుగుతున్నారు. అన్నిటికన్నా ఘోరమైన విషయమేమంటే ఆ బాపతు వ్యక్తులకు రాజకీయ పార్టీలు టిక్కెట్లిచ్చి చట్టసభలకు పంపుతున్నాయి. మంత్రులుగా అందలమెక్కిస్తున్నాయి. కనీసం ఎగ వేతదార్ల జాబితా బయటపెడితే జనంలో నగుబాటుపాలై బాకీలు చెల్లిస్తారను కుంటే ప్రభుత్వాలు ఆ పని చేయడం లేదు. సాక్షాత్తూ సుప్రీంకోర్టే ఆ మధ్య ఎగవేతదార్ల జాబితా విడుదల చేయడానికి మీకున్న అభ్యంతరమేమిటని అడి గితే... అలా ప్రకటిస్తే వారు మరింత మొండికేసే ప్రమాదం ఉన్నదని, బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడుతుందని జవాబొచ్చింది. రుణ ఎగవేతదార్ల జాబితా వెల్లడించాలని ఈమధ్యే అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య(ఏఐబీఓసీ) రిజర్వు బ్యాంకును సవాలు చేసింది. అలాగే కేవలం 12,000 మంది రుణ ఎగవేతదార్లు వివిధ బ్యాంకుల నుంచి రూ. 1,60,256 కోట్లు కొల్లగొట్టారని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(ఇండియా)లిమిటెడ్(సిబిల్) బయట పెట్టింది.
అప్పులిచ్చి నష్టపోయిన బ్యాంకుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు ప్రైవేటు బ్యాంకులు, సహకార బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కూడా ఉన్నాయి. ఈ లెక్కంతా గత డిసెంబర్ 31 నాటిది. ఇందులో రూ. 25 లక్షలకు మించి కోటి రూపాయల్లోపు ఉన్న రుణాల విలువ రూ. 69,279 కోట్ల యితే... కోటి రూపాయలకు మించి ఎగ్గొట్టిన రుణాల విలువ రూ. 90,976 కోట్లు. సిబిల్ అడిగిన వివరాలకు జవాబిచ్చిన పబ్లిక్ రంగ బ్యాంకులు–అలహాబాద్ బ్యాంకు, ఆంధ్రాబ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంకు, దేనా బ్యాంకు, యూనియన్ బ్యాంకు మాత్రమే. స్టేట్ బ్యాంకుతోపాటు మరికొన్ని ఇతర బ్యాంకులు వివరాలివ్వడానికి సిగ్గుపడినట్టున్నాయి. కనుక వాస్తవంగా ఎగ్గొట్టిన రుణాల విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను ఎగ్గొడుతున్నవారు వ్యాపారాల్లో దివాలా తీసినవారే అయి ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ లాభార్జన గడిస్తూ ఉద్దేశ పూర్వకంగా రుణాల్ని ఎగవేసే వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు పెరుగుతున్నారు. ఈమధ్య ‘ఇండియా టుడే’ చానల్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి వజ్రాల వ్యాపా రంలో ఉంటున్నవారు రుణాలెలా తీసుకుంటున్నారో బయటపెట్టింది. వజ్రాలు లేకుండా, వ్యాపారమే లేకుండా దొంగ కంపెనీలు పెట్టి కాగితాలపై గారడీ చేసి బ్యాంకుల నుంచి రుణాలెలా తీసుకోవచ్చునో ఆ ఆపరేషన్‌లో పలువురు వెల్లడిం చారు. అది చూస్తే ఈ దేశంలో ఇంకెంతమంది నీరవ్ మోదీలున్నారోనన్న బెంగ కలుగుతుంది.
ఇప్పుడు ప్రవేశపెట్టబోయే ఫ్యుజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ బిల్లు అప్పులు తీసుకుని పరారైన నేరగాళ్ల ఆస్తులన్నిటినీ జప్తు చేయడానికి వీలు కల్పిస్తుంది. అలా జప్తు చేసిన ఆస్తులను విక్రయించడానికి కూడా ప్రభుత్వానికి అధికారాన్నిస్తోంది. అయితే రూ. 100 కోట్లు, అంతకన్నా ఎక్కువ బకాయిపడి పరారైనవారికే దీన్ని వర్తింపజేస్తారు. అలాగే న్యాయస్థానాలు జారీచేసిన అరెస్టు వారెంట్‌నూ, విచా రణనూ తప్పించుకోవడానికి దేశం విడిచివెళ్లినవారిని ‘పరారీలో ఉన్న నేరగాడి’గా భావిస్తారు. కోర్టు వారెంట్ జారీ చేసిన మరుక్షణం అలాంటివారు కొత్త చట్టం పరిధిలోకి వస్తారు. అయితే నిందితులు వారెంట్ జారీకి ముందే వెనక్కొస్తే ఈ చట్టం కింద చర్యలు ఆపేస్తారు. బ్యాంకులకు ఎగనామం పెట్టేవారి కోసం ఇప్పుడు చాలా చట్టాలున్నాయి. ఉద్దేశపూర్వక ఎగవేతదార్లను నిర్ధారించడం మొదలుకొని అలాంటివారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం వరకూ వివిధ చర్యలను సూచించే చట్టాలు అమలు చేస్తున్నారు. అయితే ఎగవేతదార్లు దేశం విడిచి పరారైనప్పుడు ఈ చట్టాలు పెద్దగా ఉపయోగపడటం లేదు. అంతేగాక ఎగ్గొట్టిన రుణాలకు సమాన విలువగల ఆస్తుల్ని మాత్రమే ఈ చట్టాల కింద జప్తు చేసుకోవడానికి వీలవుతోంది. అందుకు భిన్నంగా ప్రతిపాదిత బిల్లు నేరగాళ్ల సమస్త ఆస్తుల్ని జప్తు చేసుకునేందుకు అధికారమిస్తోంది. అలాగే ఆ ఆస్తులపై మరెవరికీ హక్కు లేకుండా చేస్తోంది. దీంతోపాటు అవకతవకలకు పాల్పడే ఆడిటర్లపై చర్యల కోసం నేషనల్ ఫైనా న్షియల్ రిపోర్టింగ్ అథారిటీ(ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ) ఏర్పాటు చేయాలని కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. అయితే నేరగాళ్లు విదేశాల్లో పోగేసుకునే ఆస్తుల విష యంలో ఈ బిల్లు చేయగలిగిందేమీ లేదు. కనుక కఠినమైన చట్టాలు తీసుకురావా లన్న ఆలోచన మంచిదే అయినా... అసలు నేరమే జరగకుండా చూసే పటిష్టమైన తనిఖీ వ్యవస్థల్ని అమల్లోకి తీసుకురావల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థపైనా, ప్రభుత్వంపైనా పౌరుల్లో విశ్వాసం ఏర్పడుతుంది. అందు కోసం ఇంకేమి చేయాలో కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి.
Comments
Please login to add a commentAdd a comment