సాక్షి, అమరావతి: రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన కేంద్రం సాయం చేయకపోగా ఎదురుదాడికి దిగుతోందని, అందుకనే ప్రభుత్వం నుంచి వైదొలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయం నుంచి విభాగాధిపతులు, ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ ఏపీకి అన్యాయం జరుగుతోందని గట్టిగా నిలదీస్తే ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ఇవ్వలేమంటున్నారని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో ఎక్కడా ఏపీ పేరు ప్రస్తావించలేదన్నారు.
మూడు రోజులుగా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అడుగుతూ వచ్చానని, బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ ఈ అంశాన్ని ప్రస్తావించినా కేంద్రం నుంచి సానుకూల స్పందన లేదన్నారు. నిధుల వినియోగ పత్రాలు ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉన్నా ఇవ్వట్లేదని కేంద్రం చెబుతోందన్నారు. రాజధానికి కేంద్రం ఇచ్చింది కేవలం రెండున్నర వేల కోట్ల రూపాయలేనన్నారు. అమరావతికి కేంద్రం కన్నా రాజధాని రైతులే 40 వేల కోట్ల రూపాయల విలువైన భూములు ఇచ్చారని వ్యాఖ్యానించారు.
బీజేపీపై ఇక పోస్టర్ల యుద్ధం: హోదాను ప్రజలు హక్కుగా భావిస్తున్నారని, అందుకే కేంద్ర మంత్రి పదవులకు రాజీనామాలు చేసినట్లు చెప్పాలని టీడీపీ ఎంపీలతో శుక్రవారం తన నివాసం నుంచి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు పేర్కొన్నట్లు తెలిసింది. రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయలేదని, అవమానించిందనేలా పోస్టర్లు వేయాలని సీఎం చెప్పినట్లు తెలిసింది. రాష్ట్రం ఏం అడిగింది? కేంద్రం ఏం ఇచ్చింది? ఎలా మోసం చేసిందనే అంశాలతో కూడిన కరపత్రాలను రూపొందిస్తున్నామని, వీటిని గ్రామాల్లో అందరికీ పంపిణీ చేయాలని ఆదేశించారు. రాజీనామాలపై జాతీయ స్థాయిలో వివిధ పార్టీల స్పందన గురించి ఎంపీలను సీఎం ఆరా తీసినట్లు సమాచారం.
సాయం చేయకపోగా ఎదురు దాడి
Published Sat, Mar 10 2018 1:19 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM
Advertisement