ధీమాలేని బీమా | Dhimaleni insurance | Sakshi
Sakshi News home page

ధీమాలేని బీమా

Published Fri, Aug 29 2014 12:11 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

ధీమాలేని బీమా - Sakshi

ధీమాలేని బీమా

  •  ప్రభుత్వ విధానాలతో ప్రీమియం చెల్లించని రైతులు
  •  నెలాఖరుతో గడువు పూర్తి
  •  పంట రుణాల లక్ష్యం రూ.700 కోట్లు  
  •  ఇచ్చింది కేవలం రూ.14.84 కోట్లే
  • తాము పొలంలో నాటేది విత్తో విపత్తో అంతు చిక్కని దయనీయావస్థ మన రైతాంగానిది. సేద్యం సుడిగుండాల పాలబడకుండా కొండంత అండగా నిలిచి ఆదుకోవాల్సిన పంటల బీమా కార్యాచరణ తీరు తెన్నూ నివ్వెర పరుస్తున్నాయి. రుణమాఫీ భారాన్ని తగ్గించుకోడానికి సర్కారు చేసే ప్రతి చర్యా రైతులకు గుదిబండగా మారుతోంది. రుణాలు రద్దుకాక.. కొత్త రుణాలకు నోచుకోక.. పంటల బీమా చేసుకునే అవకాశం లేక.. ఇలా అన్ని విధాల అన్నదాతలు దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
     
    విశాఖ రూరల్:  ప్రభుత్వ విధానాలు రైతులను నిలువునా ముంచుతున్నాయి. పంట చేపట్టక ముందే బీమా ప్రీమియం చెల్లించాలనడంతో వేలాది మంది రైతులు ఆసక్తి కనబరచడం లేదు. రుణమాఫీ నుంచి పంట బీమా వరకు ఏ ఒక్కటీ రైతులకు దక్కకుండా పోతోంది. ఖరీఫ్ ముగియడానికి మరో నెల రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటి వరకు రుణ లక్ష్యంలో కేవలం 2 శాతం మాత్రమే రైతులకు అందజేశారు. పంటల బీమా గడువు కూడా నెలాఖరుతో ముగుస్తోంది. ప్రకృతి విపత్తుల సమయంలో పంట నష్టాల నుంచి రైతులకు ఉపశమనానికి పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు.

    బ్యాంకుల్లో రుణం పొందిన ప్రతీ రైతుకు బీమా వర్తిస్తుంది. రుణం పొందని వారు నేరుగా బీమా చేయించుకోవాలి. లేకుంటే పంట నష్టాలకు బీమా పరిహారం పొందేందుకు అవకాశముండదు. ఈ ఏడాది పరిస్థితులు ఈ రెండింటికీ రైతులను దూరం చేశాయి. వర్షాభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులే అధికంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రైతులు ప్రకృతి ప్రతికూల పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 2.8 లక్షల హెక్టార్లు. ఇప్పటి వరకు కేవలం 1.11 లక్షల హెక్టార్లలోనే పంటలు చేపట్టారు.

    జిల్లాలో పంటరుణాల లక్ష్యం రూ.700 కోట్లు ఇంతవరకు ఇచ్చింది కేవలం రూ.14.84 కోట్లే. ఇప్పటి వరకు రుణాలు పొందినవారు 5500 మంది మాత్రమే. వీరికే బీమా వర్తిస్తుంది. కొత్త రుణాలకు నోచుకోని అన్నదాతలు ప్రైవేటు ఫైనాన్సర్ల నుంచి అధిక వడ్డీలకు అప్పులు చేసి పంటలు చేపడుతున్నారు. ఇటువంటి వారిలో అధిక శాతం మంది పంటల బీమా చెల్లించేందుకు ఆసక్తి చూపడం లేదు. బ్యాంకు రుణాలు పొందని వారిలో కేవలం 451 మంది మాత్రమే వ్యవసాయ శాఖ ద్వారా బీమా ప్రీమియం చెల్లించారు. వేలాది మంది దూరంగా ఉన్నారు.
     
    31తో బీమా గడువు పూర్తి
     
    బ్యాంకుల ద్వారా రుణం తీసుకోని రైతులకు ఏటా బీమా అవకాశం కల్పిస్తున్నారు. వాస్తవానికి జూలై 30వ తేదీతో దీనికి గడువు ముగిసింది. జిల్లాలో పంటలు సాగుకు ముందే బీమా చేయించాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడుతోంది. దేశవ్యాప్తంగా ఇవే సమయాన్ని నిర్దేశిస్తున్నందున మార్పు చేయాలని ఏళ్లుగా డిమాండ్ ఉన్నా అమలుకావడం లేదు. ఈ సీజన్‌లో మాత్రం రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా గడువు పొడిగిస్తూ వచ్చారు. తాజాగా మరోసారి గడువు పెంపు ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ నెలాఖరుతో గడువు ముగుస్తుందని వ్యవసాయ శాఖ జేడీ లీలావతి స్పష్టం చేస్తున్నారు. ఈలోగా రుణాలు పొందని రైతులు బీమా ప్రీమియం చెల్లించాలని సూచిస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement