- అడకత్తెరలో రైతులు
- ఈ నెల 17లోపు బాకీలు చెల్లించకుంటే బంగారు వేలం
- తనకల్లు స్టేట్‌బ్యాంక్ పత్రికా ప్రకటన
- ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న రుణగ్రస్తులు
తనకల్లు: రుణాలు చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారు నగలను వేలం వేస్తామని బ్యాంకు అధికారులు ప్రకటన చేయడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయ, డ్వాక్రా, చేనేత రుణాలన్నీ మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇస్తూ గ్రామగ్రామానా ప్రచారం చేశారు. దీంతో ఆయా వర్గాలవారు ఆయనకు అధికారం కట్టబెట్టారు. అధికార పగ్గాలు చేపట్టి మూడు నెలలు కావస్తున్నా ముఖ్యమంత్రి రుణమాఫీపై అదిగో.. ఇదిగో అంటూ స్పష్టమైన ప్రకటన చేయకుండా కాలం వెళ్లదీస్తున్నారు.
మరోవైపు గడువులోపు తీసుకున్న రుణాలు చెల్లించకపోతే బంగారు నగలు వేలం వేస్తామని బ్యాంకర్లు దండోరా, పత్రిక ప్రకటనలు చేస్తూ రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 17 లోగా అప్పులు చెల్లించకపోతే అదేరోజు నగలు వేలం వేస్తామని తన కల్లు స్టేట్ బ్యాంకు అధికారులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీంతో మండలంలోని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రుణం చెల్లిస్తే మాఫీ వర్తించదని, చెల్లించకుంటే బంగారు పోగొట్టుకోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.
ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తప్పక రుణమాఫీ చేస్తామని రోజూ ప్రకటిస్తున్నారు. కానీ బ్యాంకు అధికారులు ఇస్తున్న వేలం నోటీసులపై ఏమాత్రం స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. కరువు పరిస్థితిలో రుణమాఫీతో ఉపశమనం లభిస్తుందని భావించామని, చివరకు బ్యాంకువారు వేలం నోటీసులు పంపుతున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాయమాటలతో మభ్యపెడ్తున్నారని అధికారపార్టీ ప్రజాప్రతినిధులపై దుమ్మెత్తిపోస్తున్నారు.
రుణమాఫీపై సమాచారం లేదు
రుణమాఫీపై ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకుని మూడేళ్లుగా చెల్లించని రైతులకు నోటీసులు ఇచ్చాం. వారి నుంచి స్పందన లేకపోవడంతో తమ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 17న నగలు వేలం వేస్తామని పత్రికా ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది.
-గురురాజ్, ఎస్‌బీఐ మేనేజర్, తనకల్లు
ఆందోళనలు చేపడతాం
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు రుణమాఫీపై పూటకోమాట మాట్లాడుతున్నారు. బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి బంగారు నగల వేలాన్ని ఆపాలి. రైతుల కష్టాలను తెలుసుకొని వెంటనే రుణమాఫీ అమలు చేయాలి. లేకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేపడతాం.
-రమణ, ఏపీ రైతు సంఘం మండల కన్వీనర్