రుణ మాఫీకిచంద్ర గ్రహణం
- రుణాలు చెల్లించని రైతులపై భారీ వడ్డన
- 12 నుంచి 13.5 శాతం ‘వడ్డిం’పు
- జిల్లా రైతాంగంపై రూ.102 కోట్ల భారం
- చంద్రబాబు తప్పుడు హామీల ప్రభావం
మనవాడే మారాజా... అంటే మరి నాలుగు తన్నమన్నారట. రుణమాఫీ హామీతో చంద్రబాబు అందలమెక్కారు. అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ప్రతి రైతుకు రూ.1.5 లక్షల రుణం రద్దు చేస్తామని ప్రకటించారు. విధి విధానాలు జారీలో నిర్లక్ష్యం చేశారు.బ్యాంకర్లు మాత్రం తమ పని తాము కానిచ్చేస్తున్నారు. బకాయిలు కట్టని జిల్లా రైతులపై రూ.102 కోట్ల వడ్డీ భారం మోపారు.
విశాఖ రూరల్ : చంద్రబాబు తప్పుడు హామీలను నమ్మి రైతులు ఓట్లేసి టీడీపీకి పట్టం కట్టారు. పీఠాన్ని చేజిక్కించుకున్నాక మాటమార్చారు. రైతుల ఆశలపై నీళ్లు చల్లారు. రుణాలు రద్దు చేయకపోగా.. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకోడానికి కమిటీ వేసి తాత్సారం చేస్తున్నారు. ఇటీవలే ప్రతి రైతుకు రూ.1.5 లక్షల రుణం రద్దు చేస్తామని ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. రుణమాఫీ విధి విధానాలపై బ్యాంకులకు స్పష్టత ఇవ్వలేకపోయారు. ఈలోగా పుణ్యకాలం గడిచిపోవడంతో రైతన్నలపై గతేడాది తీసుకున్న రుణాలపై 12 నుంచి 13.5 శాతం మేర వడ్డీ పడనుంది.
జిల్లాలో గతేడాది ఖరీఫ్‌లో 1,32,375 మందికి రూ.640 కోట్లు, రబీ సీజన్‌లో 14,548 మందికి రూ.104 కోట్లు, 287 మంది కౌలు రైతులకు రూ.56.1 లక్షలు,పావలా వడ్డీ కింద 7505 మందికి రూ.2.65 కోట్ల పంట రుణాలు అందజేశారు. దీంతో పాటు రూ.లక్షలోపు రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన వారిలో 56,166 మంది రైతులకు 11.73 కోట్ల వడ్డీ లేని రుణాలను ఇచ్చారు. జిల్లాలో 2013-14 సంవత్సరంలో బంగారం, వ్యవసాయేతర రుణాలు మినహా కేవలం పంట రుణాల కింద రూ.760 కోట్ల రుణాలున్నాయి. 2,10,881 మంది రైతులు బ్యాంకులకు బకాయి పడ్డారు.
ఏడాది దాటితే రూ.13.5 శాతం వడ్డీ
రైతులు గతేడాది జూలై 31లోపు రుణాలు పొందారు. ఆలోపు రుణం పొందిన వారికి బీమా వర్తిస్తుందనే కారణంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఏడాదిలోపు రుణం చెల్లిస్తే 3 శాతం నాబార్డ్, 4 శాతం రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది. రైతన్నలు ఏడాదిలోపు రుణాలు రెన్యువల్ చేసుకుంటే వారికి వడ్డీలేని రుణం దక్కేది. రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో రైతులు తీసుకున్న రుణాలు చెల్లించలేదు. రుణాలు రద్దవుతాయనే ఆలోచనలో ఉండటంతో ఈ ఖరీఫ్ సీజన్‌కు రుణాలు రెన్యువల్ కాలేదు.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం పంట రుణాలు పొందిన రైతులు ఏడాది లోపు రుణాలు చెల్లించకపోతే బ్యాంకులను బట్టి 12 నుంచి 13.5 శాతం వడ్డీ భరించాల్సి ఉంటుంది. జూలై 31లోపు మఖ్యమంత్రి ప్రకటించిన రుణమాఫీ వర్తిస్తే ఎలాంటి సమస్య తలెత్తేది కాదు. ఇప్పటికే ఏడాది పూర్తయిన నేపథ్యంలో జిల్లాలో 2,10,881 లక్షల మంది రైతులు తీసుకున్న రూ.760 కోట్లకు రూ.102 కోట్ల వడ్డీ భారం భరించాల్సిన దుస్థితి నెలకొంది. ఇన్స్‌పెక్షన్ చార్జీలు రూపేణా బ్యాంకు రుణం ఉన్న ప్రతి రైతు రూ.150 భరించాల్సి ఉంది.
ఈ కారణంగా రూ.3.16 కోట్లు రైతులు భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. రుణమాఫీకి నిధుల సమీకరణ పేరుతో తాత్సారం చేస్తున్న ప్రభుత్వం ఈ అదనపు వడ్డీ భారంపై మాత్రం నోరు మెదపడం లేదు. కొత్త రుణాలందక వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి అప్పులు తెచ్చి పంటలు వేసుకుంటున్న రైతన్నలపై వడ్డీ భారం తప్పించని పక్షంలో వారు మరింత నష్టపోనున్నారు.