‘హోదా’తోనే అంతా కాదు
సీఎం బాబు పునరుద్ఘాటన
అందుకే అన్నివిధాలా చేయూతకు ప్రధానిని కోరా
సాక్షి, రాజమహేంద్రవరం/కాకినాడ: ప్రత్యేక హోదాతో ఒరిగేదేమీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి జరగదని ఆయన పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలుసహా పది రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉందని, అయితే అవి ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయని వ్యాఖ్యానించారు. అందువల్లే రాష్ట్రానికి అన్నివిధాలా చేయూతనివ్వాలని ప్రధానిని కోరానని చెప్పారు. రెవెన్యూలోటు తీర్చడంతోపాటు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని విన్నవించానన్నారు. సీఎం బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, జగ్గంపేట, సామర్లకోట, పెద్దాపురం ప్రాంతాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో నీరు-చెట్టు ప్రగతి ఆవశ్యకతపై రైతులు, సాగునీటి సంఘాల అధ్యక్షులతో చర్చ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ విభజన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. కేంద్రం ఆదుకోవాలన్నారు. నదీజలాల విషయంలో ఎగువ రాష్ట్రాలతో తాను గొడవలు పెట్టుకోనని, కేంద్రమే ఈ సమస్యను పరిష్కరించాలన్నారు.
నన్ను చూసే ఓట్లు వేశారు..
ఎన్నికలవేళ ప్రజలు కేవలం తనను చూసే ఓట్లు వేశారని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి తాను కష్టపడుతుంటే ప్రతిపక్షాలు తనపై ఆరోపణలు చేస్తున్నాయన్నారు.
సాక్షిపై మరోసారి అక్కసు
సీఎం చంద్రబాబు మరోసారి ‘సాక్షి’పై తన అక్కసును వెళ్లగక్కారు. 24 గంటలూ ప్రభుత్వాన్ని విమర్శిస్తోందని, కుంభకోణాలంటూ ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ‘సాక్షి’ ప్రభుత్వ పేపరని అంటూ.. త్వరలో దాన్ని ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటామన్నారు.
‘తూర్పు’ను తీర్చిదిద్దుతా: సహజవనరులు ఉన్న తూర్పుగోదావరి జిల్లాను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని సీఎం ప్రకటించారు. పెద్దాపురం మున్సిపాలిటీ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.