కౌలు రైతుపై కరుణ లేదు | Five percent of loans are also not available | Sakshi
Sakshi News home page

కౌలు రైతుపై కరుణ లేదు

Published Sat, Dec 12 2015 3:50 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

కౌలు రైతుపై కరుణ లేదు - Sakshi

కౌలు రైతుపై కరుణ లేదు

ఐదుశాతం మందికి కూడా అందని రుణాలు
 
 సాక్షి, హైదరాబాద్: కౌలు రైతులకు బ్యాంకుల నుంచి పంట రుణాలను మంజూరు చేయించడంలో  వరుసగా రెండో సంవత్సరం కూడా రాష్ర్టప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. రాష్ర్టస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం కోసం రూపొందించిన అజెండాలోని గణాంకాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమౌతుంది. కౌలురైతులకు రుణాలిచ్చే విషయంలో బ్యాంకులు కనీసం ఐదు శాతం లక్ష్యాన్ని కూడా చేరుకోలేదు. రుణ పరపతి లక్ష్యాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈ నెల 16వ తేదీన 192వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో సమీక్షించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 16.25 లక్షల మంది కౌలు రైతులకు బ్యాంకుల నుంచి పంట రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా అందులో ఐదుశాతం మందికి కూడా రుణాలను అందించలేదు.

8,45,069 మంది కౌలు రైతుల రుణాలను రెన్యువల్ చేయాలని, కొత్తగా 7,79,931 కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధారించింది. అంటే మొత్తం 16,24,990 మంది కౌలు రైతులకు పంట రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అందులో ఇప్పటి వరకు కేవలం 70,013 మంది కౌలు రైతులకు 146.88 కోట్ల రూపాయల పంట రుణాలను మాత్రమే మంజూరు చేశారు. కౌలు రైతులకు రుణాలు విరివిగా మంజూరు కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ తాత్సారమే కారణమని బ్యాంకర్ల కమిటీ చెబుతోంది. క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ఏర్పాటు, రుణ అర్హత కార్డుల పరిమితి పెంపు వంటి వాటి విషయంలో నిర్ణయం తీసుకోకుండా రాష్ర్టప్రభుత్వం చేస్తున్న తాత్సారం కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందనీయకుండా చేస్తోంది.

 గత ఏడాదీ ఇదే తీరు..
 గత ఆర్థిక సంవత్సరంలో 9.5 లక్షల మంది కౌలు రైతులకు పంట రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించుకోగా కేవలం 36,543 మంది కౌలు రైతులకు 63.36 కోట్ల రూపాయలు మాత్రమే పంట రుణాలను మంజూరు చేశారు. గత ఆర్థిక సంవత్సరం కన్నా ఈ ఆర్థిక సంవత్సరం కొంత మెరుగుపడినప్పటికీ లక్ష్యాలకు ఆమడ దూరంలో ఉన్నారు. కౌలు రైతులకు బ్యాంకుల నుంచి రుణం పుట్టకపోవడంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించి ఎక్కువ వడ్డీకి అప్పులు చేస్తున్నారు.  ఆ అప్పులు తీర్చలేక ఆత్మాభిమానం చంపుకోలేక కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

 క్రెడిట్ గ్యారెంటీ నిధి ఏది?
 కౌలు రైతులకు విరివిగా పంట రుణాల మంజూరుకు వీలుగా క్రెడిట్ గ్యారెంటీ నిధిని ఏర్పాటు చేయాలని గత ఆర్థిక సంవత్సరం నుంచి బ్యాంకర్ల కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ కూడా గత ఏడాదే రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయినా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్ గ్యారెంటీ నిధి ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోలేదు. క్రెడిట్ గ్యారెంటీ నిధికి కౌలు రైతులకు రుణాల మంజూరు నుంచి కొత్త మొత్తాన్ని ప్రీమియంగా తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తంలో కార్పస్ ఫండ్‌కు మ్యాచింగ్ గ్రాంటు మంజూరు చేయాలని బ్యాంకర్ల కమిటీ పేర్కొంది. అలాగే కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రుణ అర్హత కార్డుల కాలపరిమితిని ఏడాది నుంచి మూడు సంవత్సరాలకు పెంచాలని కూడా బ్యాంకర్ల కమిటీ సిఫార్సు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో చేసిన ఈ సిఫార్సులపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం కౌలు రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో తెలియజేస్తోంది.
 
 డ్వాక్రా, వ్యవసాయ రుణాలదీ అదేదారి...
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డ్వాక్రా మహిళా సంఘాలకు 10,032 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధారించగా ఇప్పటి వరకు కేవలం రూ.3,464 కోట్ల రూపాయల రుణాలనే మంజూరు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీలో కలిపి మొత్తం వ్యవసాయ రంగానికి పంట రుణాలు, వ్యవసాయ టర్మ్ రుణాలు కలిపి మొత్తం 61,905 కోట్ల రూపాయలు రుణంగా మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధారించగా ఇప్పటి వరకు 39,401 కోట్ల రూపాయలను రుణంగా మంజూరు చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement