అభివృద్ధి ఆకాశంలో చేయలేం
♦ రైతులు భూములు ఇస్తేనే రాష్ట్రాభివృద్ధి: సీఎం
♦ కేంద్రాన్ని ప్యాకేజీ, హోదా అడుగుతున్నామని వ్యాఖ్య
♦ విభజన చట్టంలో ఉన్నదాని కంటే ఎక్కువే చేస్తున్నాం:వెంకయ్య
సాక్షి, విజయవాడ: ‘అభివృద్ధిని ఆకాశంలో చేయలేం. రైతులు భూములు ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. రాజధానికి, గన్నవరం విమానాశ్రయానికి భూములు ఇచ్చారు. విమానాశ్రయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఏలూరు కాల్వను మార్చాల్సి ఉంటుంది. అందుకు రైతులు మరిన్ని భూములు ఇవ్వాల్సి ఉంటుంది.’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రూ.137 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న గన్నవరం విమానాశ్రయం నూతన టెర్మినల్ భవనానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో కలిసి చంద్రబాబు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ టెర్మినల్ భవన నిర్మాణం వచ్చే కృష్ణా పుష్కరాల నాటికి పూర్తి చేయాలని ఏవియేషన్ అధికారులను కోరారు. ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా తాము అడుగుతున్నామని, దీనిపై పదేపదే విమర్శించడం సరికాదని చంద్రబాబు చెప్పారు.
ఎక్కువే చేస్తున్నాం..: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఎయిర్‌పోర్టులు, పోర్టులు, రైల్వే లైన్లు, జాతీయ రహదారులే అభివృద్ధికి సూచికలని చెప్పారు. తెలంగాణ, ఏపీ సీఎంలు తరచుగా కలవాలని, కూర్చుని సమస్యలు చర్చించుకోవాలని సూచించారు. పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ గన్నవరం విమానాశ్రయానికి, రాజధానికి భూములు ఇచ్చి తెలుగువారిలో త్యాగమూర్తులు ఇప్పటికీ ఉన్నారని నిరూపించారన్నారు. ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి, పలువురు ఎంపీలు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. అనంతరం భూములు ఇచ్చిన రైతులకు పంచె, చీర, రాజధానికి ఆహ్వాన పత్రం ఇచ్చి సీఎం సత్కరించారు.
అమరావతిలో జలభారతం
అన్ని నదుల నుంచి తెచ్చిన జలాలతో అమరావతిలో జలభారతం సృష్టించేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రయత్నం గొప్పదని చంద్రబాబు అభినందించారు. సేకరించిన జలాలను ఆయన పరిశీలించారు.
అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన సీఎం
విజయవాడ (ఇంద్రకీలాద్రి): బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో ఏడో రోజైన సోమవారం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయనకు ఆలయ ఈవో నర్సింగరావు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్‌వీఎస్ ప్రసాద్ సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారి జన్మనక్షత్రమైన పవిత్ర మూలా నక్షత్రం రోజున రాష్ట్రం నలుమూలల నుంచి అశేష భక్తజనం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు.