ఏపీలో పెట్టుబడులు పెట్టండి
ఫార్మా కాంగ్రెస్ సదస్సులో పారిశ్రామికవేత్తలకు సీఎం పిలుపు
సాక్షి, విశాఖపట్నం: ఫార్మా రంగానికి గాను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా సీఎం చంద్రబాబు పారిశ్రామిక వేత్తలను కోరారు. ఔషధ ఉత్పత్తులు, పరికరాల తయారీ సంస్థలకు అనుకూలమైన పాలసీలు అమలు చేస్తామన్నారు. శనివారం విశాఖలో జరుగుతున్న 68వ ఫార్మా కాంగ్రెస్ రెండో రోజు సదస్సుకు ఆయన హాజరై ప్రసంగించారు. తొలుత ఆయన ఇండియన్ ఫార్మా కాంగ్రెస్–2016 సావనీర్‌ను సీఎం విడుదల చేశారు. అలాగే విశాఖ, రుషికొండలోని ఐటీ సెజ్ హిల్ నం.2లో ‘ఫిన్‌టెక్ టవర్’ను సీఎం చంద్రబాబు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐదు ఐటీ సంస్థలు, మరో ఐదు విద్యాసంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం వాటి నిర్వాహకుల నుంచి ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.
జన్మభూమి రుణం తీర్చుకోవాలి..: జన్మభూమి రుణం తీర్చుకున్నట్టే ప్రయోజకులను చేసిన విద్యాలయం రుణం కూడా తీర్చుకోవాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం రాత్రి విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. కేంద్రమంత్రి, ఏయూ పూర్వ విద్యార్థి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తాను ఇక్కడకు వచ్చాక తన తల్లి ఒడిలో కూర్చున్న అనుభూతిని పొందుతున్నానన్నారు. ఏయూ పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షుడు, జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు, ఎంపీ గోకరాజు గంగరాజు ఏయూ కార్పస్ ఫండ్‌కు చెరో కోటి విరాళంగా ఇచ్చారు. హడ్కో నుంచి రూ.కోటి విరాళంగా ఇస్తున్నట్టు వెంకయ్యనాయుడు ప్రకటించారు.