‘హోదా’ కన్నతల్లి లాంటిది: రఘువీరా
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి కన్నతల్లితో సమానమైన ప్రత్యేక హోదా కావాలో.. సవతి తల్లిలాంటి ప్రత్యేక ప్యాకేజీ కావాలో సీఎం చంద్రబాబు ప్రజలకు తేల్చి చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పేదలు, రైతులు పడుతున్న ఇబ్బందులను క్షేత్ర స్థాయిలో వివరించేందుకు గుంటూరులో శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో జన ఆవేదన సదస్సు నిర్వహించారు. రఘువీరా మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిలో జాతీయ మహిళా పార్లమెంటు సదస్సును నిర్వహించేందుకు హక్కులేదన్నారు. సీఎం డ్యాష్ బోర్డు క్యాష్ బోర్డుగా మారిందన ఆరోపించారు. ఎంపీ కేవీపీ రామచంద్రరావు, శాసనమండలి విపక్ష నేత సి.రామచంద్రయ్య, ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియాలు మాట్లాడుతూ కోట్లాది ప్రజల జీవితాన్ని ప్రభావితం చేసే నోట్ల రద్దు నిర్ణయం ఏకపక్షంగా తీసుకోవడం ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చన్నారు.
కాంగ్రెస్ నుంచి చెంగల్‌రాయుడు బహిష్కరణ: ఏఐసీసీ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ చెంగల్‌రాయుడును కాంగ్రెస్ నుంచి బహిష్కరించినట్లు రఘువీరారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. చెంగల్‌రాయుడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.