హోదా విషయంలో వైఎస్సార్‌సీపీనే టార్గెట్
♦ బీజేపీని, ఆ పార్టీ నేతలను విమర్శించొద్దని సూచన
♦ పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకపోవటానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కారణమని ఎట్టి పరిస్థితుల్లో బహిరంగంగా చెప్పొద్దని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రధానంగా వైఎస్సార్‌సీపీ, ఆ తరువాత కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల వల్లే ప్రత్యేక హోదా రావటం లేదని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీతో ప్రస్తుత పరిస్థితుల్లో తెగతెంపులు చేసుకోలేమని, వారితో బంధం కొనసాగించాల్సిన అవసరం వ్యక్తిగతంగా, పార్టీ పరంగా ఉందని తెలిపారు. శుక్రవారం పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంటులో జరిగిన పరిణామాలు, విపక్షాలు ఆందోళనకు పిలుపునివ్వటంపై చర్చించారు. ప్రత్యేక హోదాపై విపక్షాలు ఆందోళన చేస్తే అటు కేంద్ర , రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, టీడీపీలకు నష్టం జరుగుతుందని, ఆ పరిస్థితి రాకుండా నేతలు చూడాలని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్‌సీపీ దూకుడుగా వెళ్లే అవకాశం ఉంది కాబట్టి రాష్ర్ట విభజన నుంచి ఇప్పటి వరకూ ఆ పార్టీ వల్లే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని వాడవాడలా ప్రచారం చేయాలని చెప్పారు. తాను కూడా ఇదే ప్రచారం చేస్తానన్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని పల్లెత్తు మాట అనొద్దని స్పష్టం చేశారు. ఆ పార్టీ నేతలను వ్యక్తిగతంగా విమర్శలు చేయొద్దని, ఏదైనా మాట్లాడాల్సి వస్తే సుతిమెత్తగా చెప్పాలన్నారు. హోదా విషయంపై విలేకరుల సమావేశాల్లో పత్రికలు, టీవీ చానెళ్ల ప్రతినిధులు ఇబ్బందికర ప్రశ్నలు వేస్తుంటారని, వాటి ని సాధ్యమైనంత వరకూ దాటవేయాలన్నారు.
ఐటీ నగరాలుగా విశాఖ, తిరుపతి, అమరావతి: సీఎం
సాక్షి, విజయవాడ బ్యూరో: విశాఖపట్నం, తిరుపతి, అమరావతి నగరాలకు సమ ప్రాధాన్యమిస్తూ వాటిని ఐటీ నగరాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఐటీ ప్రమోషన్స్, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్, ఇన్నోవేషన్స్, స్టార్టప్స్, ఇ-గవర్నెన్స్, మీ-సేవ, ఇ-ప్రగతి పురోగతిపై అధికారులతో ఆయన సమీక్షించారు.
రైతులు అదనంగా కరెంట్ వాడేస్తున్నారు
రాష్ట్రంలో రైతులు అవసరానికంటే 35 శాతం అదనంగా కరెంటు వాడేస్తున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దీనిని అరికట్టేందుకోసం మీటర్లను పెట్టనున్నామని ప్రకటించారు.ఇందుకోసం తక్కువ కరెంటు ఖర్చుతో పనిచేసే కోటి 50 లక్షల పంపుసెట్లు అందిస్తామని చెప్పారు. విజయవాడ ఎ-కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన నీరు-చెట్టు ప్రగతి వర్క్‌షాపు ముగింపు కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజలు దొంగతనంగా కరెంటు వాడకుండా అరికడతామని చెప్పారు. దీనికోసం పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు.