‘బాబు’ మాయ
⇒ అన్నదాతకు కోలుకోలేని దెబ్బ
⇒ బ్యాంకుల నుంచి అందని రుణాలు
⇒ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు
⇒ ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.3,797 కోట్లు
⇒ బ్యాంకులు ఇచ్చింది కేవలం రూ. 227 కోట్లు
సాక్షి, గుంటూరు : అన్నదాతలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. రుణ మాఫీ పేరుతో రైతులను ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసింది. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లతో కనీసం పెట్టుబడులు కూడా రాక కుదేలవుతున్న అన్నదాతకు రుణమాఫీ రూపంలో కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. బ్యాంకుల్లో ఉన్న రుణాలు రద్దుకాక, కొత్త అప్పు పుట్టక అవస్థలు పడుతున్నారు.
► బ్యాంకుల నుంచి రుణాలు అందకపోవడంతో పెట్టుబడుల కోసం రైతులు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించక తప్పడం లేదు. ఈ అవకాశాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకొంటున్నారు. అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు.
► ఈ ఏడాది ఖరీఫ్ రుణం లక్ష్యం రూ. 3797.14 కోట్లు కాగా, ఇప్పటి వరకు కేవలం రూ. 227.80 కోట్ల రూపాయల రుణాలను మాత్రమే బ్యాంకులు మంజూరు చేశాయి. దీంతో రైతులంతా వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు.
► ప్రభుత్వ నిర్వాకంతో రెండు రకాల భారం అన్నదాత నెత్తిన పడింది. బ్యాంకుల్లో ఉన్న రుణాలు రద్దుకాకపోవడంతో 14 శాతం వడ్డీ రైతుకు భారంగా మారింది. మరో వైపు పెట్టుబడులకు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించడంతో వందకు మూడు రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారు.
► ఇప్పటికీ రుణమాఫీకి సంబంధించి స్పష్టమైన విధి విధానాలు రాక పోవడంతో అన్నదాతలకు దిక్కు తోచడం లేదు.
► ఖరీఫ్ సీజన్ ముగియడంతో రబీ సాగు కోసం రైతులు సన్నాహాలు చేసుకొంటు న్నారు. చేతిలో రూపాయికూడా లేకపోవడంతో సాగు ఎలా అని ఆందోళన చెందుతున్నారు.
► జిల్లాలో 12,21,965 మంది రైతులకు రుణ మాఫీ ద్వారా రూ.9,749 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరాల్సివుంది. రుణమాఫీ కాకపోగా, రుణాలను రెన్యూవల్ చేయలేదు.
► ప్రస్తుత ఖరీఫ్ సీజన్ పూర్తయ్యే నాటికి రైతులకు రూ.6,328 కోట్ల రూపాయల రు ణాలను ఇవ్వాలని జిల్లా అధికారులు ప్రణాళికలు వేసినా ఆచరణలో కార్యరూపం దాల్చ లేదు.
రబీ సాగుకు సన్నాహాలు...
► జిల్లాలో అన్నదాతలు రబీ సాగుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. పెట్టుబడులు కోసం మళ్లీ వడ్డీ వ్యాపారస్తుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
► రబీలో ముఖ్యంగా జొన్నతో పాటు, రెండో పంట కింద వరి సాగు చేస్తారు.
► ప్రభుత్వం రూ. 2,531.43 కోట్ల రూపాయలను రబీ రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు ఎవ్వరికి ఇవ్వలేదు.
► జిల్లాలో 3,684 మంది రైతు మిత్ర గ్రూపులకు రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా, కేవలం 136 గ్రూపులకు మాత్రమే రుణాలు ఇచ్చారు.
► కౌలు రైతులకు సంబంధించి 27,562 మందికి రుణ అర్హత కార్డులు మంజూరు చేసినా ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు.
► జిల్లాలో 7,945 రైతు సంఘాలు ఉండగా 38 గ్రూపులకు మాత్రమే రుణాలు ఇచ్చారు. మొత్తం మీద రైతులకు పంట రుణాలు అందని ద్రాక్షగా మారాయి.