interest Traders
-
వడ్డీ వ్యాపారులపై టాస్క్‌ఫోర్స్ దాడులు
కరీంనగర్‌క్రైం: సామాన్యుల అవసరాలు అసరాగా చేసుకుని కరీంనగర్లో వడ్డీ వ్యాపారం చేస్తున్నవారిపై టాస్క్‌ఫోర్స్ బృందాలు రెండు రోజులు దాడులు చేస్తున్నాయి. ‘వడ్డీ దందాకు అడ్డేది’ శీర్షికన ఈనెల 25న ‘సాక్షి’లో వడ్డీ వ్యాపారుల అగడాలతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులపై కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన సీపీ కమలాసన్‌రెడ్డి వెంటనే టాస్క్‌ఫోర్స్ బృందాలను రంగంలోకి దించారు. రెండు రోజులుగా పలువురు వడ్డీ వ్యాపారులు, అనుమతి లేని ఫైనాన్స్‌లు, గిరిగిరి ఫైనాన్స్ వ్యాపారులపై దాడులు చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు, సంతకాలు చేసిన ఖాళీ ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. పలువురి వద్ద భారీగా నగదు డబ్బులు కూడా లభ్యమైనట్లు సమాచారం. మరో రెండు మూడు రోజుల్లోనే వడ్డీ వ్యాపారుల దందాకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. నిందితులను కూడా అరెస్ట్ చూసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రామగుండం, సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారులపై దాడులు చేసిన పోలీసులు తాజాగా కరీంనగర్‌లోని వడ్డీ వ్యాపారులపై టాస్క్ఫొర్స్ బృందాలు దాడులు చేయడం సంచలనం కలిగించింది. అయితే ఈ దందాలో పలువురు బాడా బాబుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. కోటి రూపాయలు పెట్టుబడి పెడితే చాలు నెలకు రూ.20 లక్షలకు పైగా అదాయం వస్తోందని సమాచారం. టాస్క్‌పొర్స్ దాడులతో ఇవన్నీ బట్టబయలు కానున్నాయి. -
మళ్లీ బుసకొట్టిన ‘కాల్‌నాగులు’!
రాజంపేట: వైఎస్సార్ జిల్లా రాజంపేటలో వడ్డీ జలగల ధాటికి తట్టుకోలేక దంపతులు బుధవారం ఆత్మత్యాయత్నానికి పాల్పడ్డారు. దంపతులిద్దరూ తమ స్వగ్రామమైన కొమ్మివారిపల్లె గ్రామపరిధిలోని పొలాల్లోకి వెళ్లి ఆత్మహత్యకు యత్నించారు. ఘటనాస్థలంలోనే భార్య మృతి చెందగా..భర్త చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. స్థానికుల కథనం మేరకు నాగినేని ధనలక్ష్మి (52), నాగినేని లక్ష్మీనారాయణ దంపతులు పట్టణంలోని భరత్‌నగర్ (ప్రభుత్వడిగ్రీకళాశాల వెనుకవైపు)లో ఉన్న సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కూతురు, అల్లుడు అమెరికాలో, కుమారుడు కర్ణాటక రాష్ట్రంలో ఉంటున్నారు. అయితే కుటుంబ అవసరాల నిమిత్తం అప్పులు చేశాడు. దీంతో రోజు వడ్డీ వ్యాపారులు జలగల్లా పీడించడం మొదలుపెట్టారు. ఒత్తిడిని తట్టుకోలేక బుధవారం వారు తమ పొలం వద్దకు చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగారు.ధనలక్ష్మి అక్కడక్కడే మృతి చెందగా.. మృతదేహాన్ని పోస్టుమార్టరం నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లక్ష్మీనారాయణ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండంతో సమీపలోని పశువుల కాపరి చూసి వారి సంబంధీకులకు తెలిపారు. లక్ష్మీనారాయణను ముందుగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అధిక వడ్డీలతో వేధింపులు.. అధిక వడ్డీలతో నిత్యం ఈ దంపతులను కొంతమంది వడ్డీ వ్యాపారులు జలగల్లా పీడించేవారని స్థానికులు చెబుతున్నారు. చివరికి రూ.6 నుంచి రూ.10 వరకు వడ్డీలకు డబ్బులు ఇచ్చి రాబట్టడంలో భాగంగా ఆస్తులను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అవసరమైతే బ్యాంకుల్లో మార్టిగేజ్ చేయించడం లాంటి చర్యలకు వారు పాల్పడడంతో.. తట్టుకోలేని బాధితులు విధిలేక చనువు చాలిస్తున్నారని పేర్కొంటున్నారు. అయితే ఈ విషయమై తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని మన్నూరు ఎస్ఐ మహేశ్‌నాయుడు వెల్లడించారు. -
తల.. మెడపై నరికి చంపేశా...
గోకవరం (జగ్గంపేట): మిస్టరీగా మారిన పెద్దాపురం మండలం గుడివాడకు చెందిన వడ్డీ వ్యాపారి పోతంశెట్టి విష్ణుఈశ్వరులు గోకవరం మండలం తిరుమలాయపాలెంలో హత్యకు గురైన సంగతి పాఠకులకు విదితమే. తిరుమలాయపాలేనికి చెందిన మాంసం వ్యాపారి షేక్ వల్లీ విష్ణుఈశ్వరులును హత్య చేసి సెప్టిక్ ట్యాంక్‌లో పాతి పెట్టగా పోలీసులు శుక్రవారం మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ క్రమంలో రాత్రి కావడంతో మృతదేహాన్ని బయటకు తీయడానికి వీలుకాలేదు. శనివారం ఉదయం రాజమహేంద్రవరం నార్త్‌జోన్ డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కోరుకొండ సీఐ రవికుమార్, గోకవరం ఎస్సై జి.ఉమామహేశ్వరరావులు మృతదేహాన్ని వెలికితీయించి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా హత్యకు పాల్పడిన షేక్ వల్లీని పోలీసులు సంఘటన స్థలానికి తీసుకువచ్చి వివరాలు సేకరించారు. హత్య చేసిన తీరు, మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పూడ్చిన వైనాన్ని నిందితుడు పోలీసులకు వివరించాడు. డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మృతుడు షేక్ వల్లీకి రెండేళ్ల క్రితం రూ. 25 వేలు అప్పుగా ఇచ్చాడని. వారానికి రూ.500 వడ్డీలు కట్టాల్సి ఉండగా మూడు నెలల నుంచి నగదు చెల్లించడం లేదన్నారు. ఈ క్రమంలో డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడంతో గత మంగళవారం నగదు చెల్లిస్తానని చెప్పి ఇంటికి తీసుకువెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి తలపై, మెడపై నరికాడన్నారు. అనంతరం శవాన్ని దుప్పట్లో చుట్టి గదిలో ఉంచి ఎవరికీ అనుమానం రాకుండా అర్ధరాత్రి సమయంలో మృతదేహాన్ని ఈడ్చుకు వెళ్లి సెప్టిక్ ట్యాంక్‌లో పడేశాడన్నారు. దీనిపై వీఆర్వో వెంకన్నదొర ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహం సెప్టిక్ ట్యాంక్‌లోంచి వెలికితీసిన తరువాత మృతుడి బంధువులు బోరున విలపించారు. అలాగే సంఘటనపై తిరుమలాయపాలెం గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. -
ప్రాణాలు తీస్తున్న 'కాల్' నాగులు
నరసరావుపేటలో కాల్ ‘నాగులు’ బుసకొడుతున్నాయి.. అవసరానికి అప్పు అడిగి తీసుకున్న పాపానికి సామాన్యులను నిత్యం వేధిస్తున్నాయి.. అసలుకు నాలుగింతల వడ్డీ కలిపి ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి.. అవసరమైతే ప్రత్యక్ష దాడులకు దిగడం.. ఇంట్లో సామగ్రి తీసుకువెళ్లడం వీటి నైజం. ‘ఖాకీలు’ అండగా నిలబడతాయని ఒకరిద్దరు ధైర్యం చేసి ఠాణాల్లో ఫిర్యాదు చేసినా వచ్చిన స్పందన.. ఒక ‘ఉచిత సలహా’. సమస్యను కోర్టుల్లోనే తేల్చుకోవాలని చెప్పేసరికి, బాధితులు ‘చావు’ మెట్టు ఎక్కుతున్నారు. నరసరావుపేటటౌన్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కాల్ మనీ వ్యవహారంలో ప్రభుత్వం కంటితుడుపు చర్యగా నామమాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంది. దీంతో అధిక వడ్డీ వ్యాపారుల ఆగడాలు ఇంకా పెరిగిపోతున్నాయి. తాజాగా నరసరావుపేటలో రెండు నెలల వ్యవధిలో కాల్ ‘నాగుల’ వేధింపులకు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు వెలుగుచూశాయి. వీరిలో ఇద్దరు మహిళలు వేధింపులు తాళలేకే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ రాయడం గమనార్హం. ఎంతోమంది ఇప్పటికీ ఒత్తిళ్లను భరిస్తున్నారు. వీరి ఆగడాలపై కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఈ వ్యవహారాలను కోర్టులో చూసుకోవాలని ఉచిత సలహాలు ఇవ్వడం గమనార్హం. తీసుకున్న అప్పునకు నాలుగింతల నగదు చెల్లించినా బాకీ తీరలేదని చెప్పడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కొందరు వ్యాపారులు అప్పుల తీసుకున్న వారి గృహాల్లో తిష్ట వేసి సామగ్రి తీసుకువెళ్లిన ఘటనలు జరిగాయి. దీనిపై ప్రశ్నిస్తే భౌతిక దాడులకు తెగబడిన సందర్భాలూ అనేకం. ఉదాహరణలు ఇవిగో.. ► నరసరావుపేట ప్రకాష్‌నగర్‌కు చెందిన కిరాణా వ్యాపారి మువ్వా వెంకటేశ్వరరావుకు వ్యాపారంలో నష్టం వచ్చింది. తెచ్చిన అప్పులకు అధిక వడ్డీలు చెల్లించలేక, ఒత్తిళ్లు తట్టుకోలేక గతనెల 16వ తేదీన గుంటూరు రోడ్డులోని గల హిందూ శ్మశానవాటిక ఎదుట పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మృతికి అధిక వడ్డీలే కారణమని సూసైడ్ నోట్లో స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. ► మరికొన్ని రోజుల తర్వాత పసనతోటకు చెందిన జరీనాబేగం చిట్ నడుపుతూ పాట పాడుకున్న వారికి డబ్బు చెల్లించేందుకు గాను వడ్డీ వ్యాపారుల వద్ద డబ్బు తీసుకుంది. అధిక వడ్డీలు చెల్లించలేక బలవన్మరాణానికి పాల్పడింది. ► ప్రకాష్‌నగర్ కంభంపాలెం ప్రాంతంలో నివాసం ఉంటున్న ఖాశీంబి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది. తన కుమార్తె వివాహానికి వ్యాపారుల నుంచి అధికవడ్డీలకు నగదు తీసుకుంది. వారి నుంచి వచ్చిన వేధింపులు తాళలేక సూసైడ్‌నోట్ వ్రాసి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోయిన ప్రాణం ఎటూ తిరిగిరాదు అనుకున్నారో ఏమో మహిళల ఆత్మహత్యల సంఘటనలపై పోలీసులకు బాధిత బం«ధువులు ఫిర్యాదు చేయలేదు. ఊరు వదిలి వెళ్లిన కుటుంబాలు అనేకం.. ► గతేడాది నరసరావుపేట ఎన్జీవో కాలనీకి చెందిన పద్మజ అనే మహిళ వడ్డీ వ్యాపారులు వేధింపులకు తాళలేక ఇటీవల కుటుంబ సభ్యులతో సహా ఊరువిడిచి వెళ్లిపోయింది. ► మొదటి రైల్వేగేట్ సమీంలో టీ స్టాల్ నిర్వహించే నూర్జహాన్ అనే మహిళ ఇటీవల వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక రాత్రికి రాత్రే పట్టణం విడిచి వెళ్లింది. ► 20 రోజుల క్రితం రావిపాడుకు చెందిన షేక్ మీరావలి వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక గ్రామం వదిలి వెళ్లిపోయాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు ఎట్టకేలకు అతని ఆచూకీ కనిపెట్టి స్టేషన్‌కు తీసుకొచ్చారు. విచారణలో అధికవడ్డీ వ్యాపారుల వేధింపులతో ఊరు విడిచి వెళ్ళినట్లు బాధితుడు చెప్పడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కాల్‌మనీ వ్యాపారుల ఆట కట్టించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇలా వెలుగులోకి వచ్చిన సంఘటనలు కొన్ని ఉంటే, అసలు వెలుగులోకి రాకుండా కాల్‌మనీ వ్యాపారుల అరాచకాలకు బలవుతున్నవారు అనేక మంది ఉన్నారనేది జగమెరిగిన సత్యం. -
అప్పునకు బదులు కొడుకునెత్తుకెళ్లాడు
-
అప్పునకు బదులు కొడుకునెత్తుకెళ్లాడు
బోధన్: తీసుకున్న అప్పుకు బదులు వడ్డీ వ్యాపారి కొడుకును ఎత్తుకు పోయాడు. అప్పుతీర్చకుంటే చంపేస్తానని బెదిరించడంతో భయపడి భర్త పారిపోయాడు. దిక్కుతోచని స్థితిలో ఓ బాధితురాలు సోమవారం నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నిర్వహించిన ప్రజావాణిలో తన గోడును సబ్ కలెక్టర్ వద్ద సిక్తా పట్నాయక్ వెళ్లబోసుకుంది. బోధన్‌లోని శర్భతీ కెనాల్ ప్రాంతంలో భారతి, మోతీ దంపతులకు నలుగురు పిల్లలు రవి, అంజలి, పవన్, ఓం ఉన్నారు. వీరు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఊరూరా తిరుగుతూ మోతీ బట్టల వ్యాపారం చేస్తాడు. వీరి సమీప బంధువు బోధన్‌కు చెందిన నారాయణ వద్ద వ్యాపారం కోసం ఏడాది క్రితం రూ. 70 వేలు అప్పుగా తీసుకున్నారు. తిరిగి అప్పు చెల్లి›ంచడంలో ఆలస్యం జరిగింది. అయితే, దశల వారీగా రూ. 20 వేల వరకు చెల్లించారు. కాగా, అసలు అప్పు, వడ్డీ కలిపి రూ. 2 లక్షల వరకు అయ్యాయని.. మొత్తం అప్పు చెల్లించాలని సదరు వడ్డీవ్యాపారి ఒత్తిడి చేశాడు. వారం రోజుల క్రితం అప్పు చెల్లించి తీసుకెళ్లాలని.. వీరి కుమారుడు పవన్ (9)ను బలవంతంగా తీసుకెళ్లాడు. అలాగే, అప్పు చెల్లించకుంటే చంపేస్తానని బెదిరించడంతో మోతి ఇల్లు వదిలి పారిపోయాడు. తన భర్త ఎక్కడికెళ్లిందీ.. తన కొడుకును ఏం చేశాడో తెలియదని బాధితురాలు భారతి సబ్ కటెక్టర్కు విన్నవించుకుంది. మొత్తం అప్పు చెల్లించకపోతే మిగిలిన ముగ్గురు పిల్లలను తీసుకెళ్తానని బెదిరిస్తున్నాడని బోరుమంది. -
జోరుగా వడ్డీ దందా
♦ చిరువ్యాపారులు, రైతులే టార్గెట్ ♦ రూ.3నుంచి రూ.10 వడ్డీ వసూలు ♦ అనుమతి లేని ఫైనాన్స్లే అధికం నేరడిగొండ(బోథ్): జిల్లాలో వడ్డీ వ్యాపారుల దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. సామాన్య ప్రజలు, రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీ వసూలు చేస్తూ వారిని దోచుకుంటున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని రోజంతా కష్టపడుతున్న శ్రమజీవులకు అప్పులు ఇచ్చి అధిక వడ్డీ గుంజుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో పాటు ఖరీఫ్ కూడా మొదలైంది. దీంతో తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం, రైతులు సాగు పెట్టుబడుల కోసం ప్రైవేట్ ఫైనాన్స్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు ఇష్టారాజ్యంగా వడ్డీ వేస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. తోపుడు బండ్లు, చాయ్ హోటళ్లు, పాన్‌షాప్‌లు, ఆటోరిక్షాలు, చిన్నచిన్న మెకానిక్ సెంటర్లను టార్గెట్‌గా చేసుకుని ఫైనాన్స్ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అవసరాలే ఆసరాగా.. ఖరీఫ్ ప్రారంభం కావడంతో రైతులు పంటల పెట్టుబడుల కోసం అల్లాడిపోతున్నారు. సకాలంలో బ్యాంకుల నుంచి పంట రుణాలు అందడం లేదు. రుణమాఫీ డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవడంతో కొందరు, జమ అయినా బ్యాంకు నుంచి నగదు అందక కొందరు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారు విధి లేక వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో చిన్నవి.. పెద్దవి కలిపి అనుమతులు పొందినవి, పొందనివి 200లకు పైగా ఫైనాన్స్‌లు ఉన్నాయి. వీరంతా రూ.100కు రూ.3 నుంచి రూ.10 వరకు వడ్డీ వసూలు చేస్తున్నారని బాధితుల ద్వారా తెలుస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో తమ వద్దకు వచ్చిన రైతులకు చెందిన భూముల పత్రాలను తాకట్టు పెట్టుకుంటున్నారు. ఖాళీ బాండ్ పేపర్ల మీద రైతులతో పాటు వారి కుటుంబ సభ్యుల సంతకాలు చేయించుకుని అప్పులు ఇస్తున్నారు. అనుమతి లేకుండా దర్జాగా ఆఫీసులను ఏర్పాటు చేసుకుని తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. రైతులకు ఇచ్చే అప్పుల్లో ముందుగానే వడ్డీలను పట్టుకుని మిగతా డబ్బులు చెల్లిస్తున్నారు. రైతులు పంటలు పండగానే మొత్తం డబ్బులను ఒకేసారి కట్టాల్సి ఉంటుంది. ఏ మాత్రం ఆలస్యమైనా ఇచ్చిన డబ్బులకు మళ్లీ వడ్డీ వసూలు చేస్తున్నారు. అలాగే చిరు వ్యాపారులకు ఇచ్చే డబ్బుల్లోనూ ముందుగానే వడ్డీ తీసుకుని డబ్బులు చెల్లిస్తున్నారు. రోజువారీగా డబ్బులు వసూలు చేస్తుంటారు. దీంతో అప్పులు తీసుకున్న వారి నుంచి 20శాతం ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యతరగతి ప్రజలు కూడా తమ పిల్లల చదువుల కోసం వేలాది రూపాయలు చెల్లించలేక వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్తున్నారు. వడ్డీ ఎక్కువైనా సరే అంటూ పిల్లల భవిష్యత్ కోసం అప్పులు తెచ్చుకుంటున్నారు. వడ్డీ భారాన్ని మోయలేక, తిరిగి చెల్లించలేక నానా యాతన పడుతున్నారు. పట్టించుకునేవారేరి? ఈ ఫైనాన్స్‌లలో చాలావరకు ప్రభుత్వ ఉద్యోగులున్నట్లు సమాచారం. జిల్లాలోని పలు చోట్ల అడ్డాలుగా ఏర్పాటు చేసుకుని అప్పులు ఇస్తున్నారు. ప్రతీరోజు జిల్లాలో కోట్లలో వ్యాపారం సాగుతోంది. ఇంతా జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖాలాలు లేవు. లైసెన్సులు లేకుంటే చర్యలు ఎవరైనా లైసెన్సు లేకుండా ఫైనాన్స్ నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా అధికవడ్డీలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కేసులు నమోదు చేస్తాం. ఫైనాన్స్ నిర్వహించేందుకు నిబంధనల ప్రకారం తప్పనిసరిగా అనుమతులు కలిగి ఉండాలి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తాం. – వేముల చంద్రప్రభు, డీఎస్పీ, ఉట్నూర్ -
పట్టా.. తాకట్టు!
వడ్డీ వ్యాపారుల వద్ద రైతుల పట్టదారు పాసుపుస్తకాలు ♦ అప్పు ఇచ్చేముందే జమానతుగాపెట్టుకుంటున్న వైనం ♦ రైతు సమగ్ర సర్వే ద్వారావెలుగులోకి ♦ కృష్ణా మండలంలోనే40శాతం ప్రైవేటు తాకట్టులో ♦ జిల్లాలో కేవలం 72శాతమే సమగ్ర సర్వే ♦ బ్యాంకుల్లో అప్పుపుట్టక విలవిల సాక్షి, మహబూబ్‌నగర్/మాగనూర్ : జిల్లా ప్రాంత రైతన్నకు కొత్త కష్టం వచ్చింది. సరైన వర్షాలు లేక వరుస కరువుతో కొట్టుమిట్టాడే ఈ ప్రాంతంలో అప్పు పుట్టక అన్నదాత విలవిలలాడుతున్నాడు. ఈసారి తొలకరి జల్లులు ముందే పడుతుండటంతో కాసింత పంట వేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. బ్యాంకుల్లో అప్పు పుట్టక, చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. తమతో ఉన్న ఏకైన ఆధారం భూమి పట్టా పుస్తకాలను కుదవపెడుతున్నారు. ఈ విషయం ఇటీవల ప్రభుత్వం చేపట్టిన రైతు సమగ్ర సర్వే ద్వారా వెలుగు చూసింది. జిల్లా సరిహద్దు మండలం కృష్ణాలో దాదాపు 40 శాతం మంది రైతులు తమ భూమి పట్టా పాసు పుస్తకాలను అప్పుకోసం వడ్డీ వ్యాపారుల వద్ద కుదవపెట్టినట్లు వెలుగులోకి వచ్చింది. అప్పు తెచ్చిన వ్యాపారికే పంటను అమ్మేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. పండిన పంటను సదరు వ్యాపారి వద్దకు తీసుకెళ్లకపోతే వడ్డీ రేట్లలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. బ్యాంకుల్లో అప్పు పుట్టడంలేదు.. నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు రైతులకు డబ్బులు ఇవ్వడానికి సతాయిస్తున్నాయి. 2017–18 ఏడాది పంట రుణ ప్రణాళికను ఇప్పటివరకు అమలుచేయడంలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు రూ.6,981.5 కోట్ల రుణాలు అందజేయాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు 15 రోజులు కావొస్తున్నా ఇప్పటివరకు సగం లక్ష్యం కూడా చేరుకోలేదు. చాలావరకు బ్యాంకులు రుణాలను రీషెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో నగదు నిల్వలు భారీగా పడిపోయాయి. చాలా బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డులు పెడుతున్నారు. రైతు రుణాలను తప్పనిసరి చెల్లించాల్సి వస్తే సగం డబ్బులు ఇచ్చి, మిగతాది సేవింగ్ అకౌంట్లో జమ చేస్తున్నారు. విచిత్రంగా సదరు బ్యాంకుకు చెందిన యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని, దాని ద్వారా చెల్లింపులు చేసుకోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. బ్యాంకు అధికారులు ఇస్తున్న ఉచిత సలహాలతో రైతులు విస్తుపోతున్నారు. ప్రైవేటు వ్యాపారుల వద్దకు క్యూ.. బ్యాంకులు చేతులు ఎత్తేయడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. భూమి హక్కులకు సంబంధించి రెవెన్యూ విభాగం రైతులకు రెండు పాస్ పుస్తకాలు అందజేస్తోంది. అందులో ఒకటి టైటిట్ పుస్తకం కాగా.. మరోటి పాస్ పుస్తకం ఉంటుంది. ఆర్డీఓ సంతకం ఉండే టైటిల్ పుస్తకాలు ఇదివరకే బ్యాంకుల్లో ఉండటం... తాజా అప్పుల కోసం రైతులు తమ వద్ద ఉన్న రెండో పాస్‌పుస్తకాన్ని ప్రైవేటు వ్యాపారుల వద్ద కుదవపెడుతున్నారు. ఇలా పాలమూరు ప్రాంతంలో అనేక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలోని ఒక్క కృష్ణామండలంలో దాదాపు 40శాతం మంది రాయిచూరులోని మార్కెట్‌యార్డుకు చెందిన కమిషన్ ఏజెంట్ల వద్ద తాకట్టులో ఉంచారు. వీరు ప్రతి సంవత్సరం వ్యవసాయ పెట్టబడులకు, విత్తనాలు, ఎరువులకు తమ పాసుపుస్తకాలను వారి వద్ద ఉంచి, కావాల్సిన పెట్టుబడులు తెచ్చుకుంటారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు సమగ్ర సర్వే ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారం రోజులుగా అధికారులు ఆయా గ్రామాల్లో సర్వేకు వెళ్లిన సమయంలో సంబంధిత రైతులు తమ పాసు పుస్తకాలు మార్కెట్‌యార్డులో తాకట్టు పెట్టిన విషయాలు బయటపడ్డాయి. -
జూన్ నెల.. జేబు విలవిల
ప్రత్తిపాడుకు చెందిన సాయిరాం ఓ ప్రైవేట్ కంపెనీలో టెక్నికల్ అసిస్టెంటుగా పని చేస్తున్నాడు. భార్య గృహిణి. ఇద్దరు పిల్లలు. నెల జీతం రూ.11 వేలు. ప్రతి నెలా కుటుంబ ఖర్చులుపోనూ వెయ్యో, పదిహేను వందలో మిగులుతాయి. ఇప్పుడు జూన్ గండమొచ్చింది. స్కూల్ ఫీజు, వ్యాన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, నోట్ బుక్స్, టెక్స్ట్‌బుక్స్.. ఇలా అనేక ఖర్చులు అదనంగా వచ్చి కూర్చున్నాయి. ముందస్తు ప్రణాళిక లేకపోవడం.. పొదుపునకు సరిపడా ఆదాయం రాకపోవడంతో వడ్డీ వ్యాపారుల తలుపుతట్టాడు. * ఈ నెలలో ఇంటి బడ్జెట్ తారుమారు * సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు అప్పులపాలు * పిల్లల చదువులతో ఆర్థిక భారం * ముందస్తు ప్రణాళిక అవసరమంటున్న ఆర్థిక నిపుణులు ప్రత్తిపాడు : జూన్ వచ్చిందంటే స్కూలుకు వెళ్లే పిల్లలున్న ఇంట ఒక్కటే టెన్షన్.. ఇంటి బడ్జెట్ లెక్కలన్నీ తారుమారవుతాయి. సామాన్య, మధ్య తరగతిపై ‘జూన్ భారం’ పెనుభారమవుతుంది. ఆర్థిక పరిస్థితులను తలకిందులు చేస్తుంది. ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రో ధరలు, కూరల ధరలు పెరిగి సగటు జీవి మనుగడ ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో విద్య కోసం వెచ్చించాల్సి మొత్తం రెట్టింపై కూర్చుంది. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడడం లేదు. ఇదే అదనుగా తీసుకుని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు జేబులు గుల్ల చేస్తున్నారు. పల్లెల్లో పక్క ఇంటి వారితో పోటీపడుతూ ఉంటారు. వారి పిల్లలు కాన్వెంట్లో చదువుతున్నారంటే..తమ పిల్లలను అలానే చదివించాలనే తలంపుతో ఉంటారు. దీని కోసం ఎంత అప్పు చేయడానికైనా వెనుకాడరు. అయితే ఆర్థిక ప్రణాళికతో ఇలాంటి గండాలను అధికమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఏటా పెరుగుతున్న ఫీజులు.. ప్రతి ఏటా చదువులకు సంబంధించి ఖర్చులు పెరిగిపోతున్నాయి. నర్సరీ నుంచే వేలకు వేలు ఫీజులను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. ఒక్కో తరగతి పెరిగే కొద్దీ పది నుంచి ఇరవై శాతం వరకు ఫీజులను పెంచేస్తున్నాయి. ప్రస్తుతం పాఠశాల స్థాయిని బట్టి ఫీజులు నిర్ణయిస్తున్నారు. ఎల్‌కేజీకే ఐదు వేల నుంచి ఫీజులు ఉన్నాయి. కార్పొరేట్ స్కూల్స్‌లో అయితే ఎల్కేజీకి రూ.8 వేల నుంచి రూ.పది వేల వరకూ వసూలు చేస్తున్నారు. ప్రైమరీ తరగతులకు రూ. 15 వేల నుంచి రూ.20 వేలు వెచ్చించాల్సి వస్తోంది. ఖర్చులు భారంగా మారాయి జూన్‌లో ఖర్చులు ఒకేసారి రావటంతో భారంగా మారాయి. పిల్లలను పాఠశాలల్లో చేర్చే సమయం, పొలాలకు పెట్టుబడులు సమయం ఒకేసారి వచ్చాయి. ఒక పక్క పెరిగిన ఫీజలు, పుస్తకాల ధరలు, మరో పక్క పెరిగిన కౌలు ధరలు, విత్తనాల రేట్లతో అల్లాడిపోతున్నాం .దీంతో కూడబెట్టుకున్న డబ్బులు సరిపోక అప్పులు తీసుకురావల్సి వస్తుంది. - కంచర్ల సింగారావు జూన్ వస్తే దడే జూన్ వస్తే చాలు ఇబ్బం దులు తప్పడం లేదు. నా నెల సంపాదనలో అగ్రభాగాన్ని పిల్లల చదువులకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రతి నెలా ఏదో రకంగా ఖర్చులకు మా సంపాదన సరిపోతుంది. కానీ ఈ నెల మాత్రం ఆర్థిక ఇబ్బందులు రెట్టింపయ్యాయి. అన్ని రకాల విద్యా సామగ్రి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. - టీ రవి -
రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులు
-
వడ్డీ వ్యాపారులకు ముకుతాడు!
- అప్పుల వసూలుకు వేధిస్తే జైలు.. ఆస్తుల జప్తు - వడ్డీలపైనా నియంత్రణ - అన్నదాతలను ఆదుకునేందుకు కొత్త చట్టానికి కసరత్తు సాక్షి, హైదరాబాద్: అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్ల కారణంగానే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు నిర్ధారణ జరిగితే.. ఆ వ్యాపారి ఆస్తులను జప్తు చేసేలా కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. రుణాల రికవరీ కోసం రైతులను వేధించే వడ్డీ వ్యాపారులకు గతంలో ఉన్న చట్టాల ప్రకారం.. ఆరు నెలల పాటు జైలు శిక్ష విధించేలా నిబంధనలున్నాయి. అవసరమైతే ఈ శిక్ష కాలాన్ని మరింత పొడిగించాలని భావిస్తోంది. వరుసగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు కొత్తగా తెలంగాణ వడ్డీ వ్యాపార నియంత్రణ చట్టాన్ని (మనీలాండరింగ్ యాక్ట్) తీసుకురావాలని నిర్ణయించింది. అందుకు సంబంధించి గతంలో ఉన్న చట్టాలకు పదును పెడుతోంది. రైతులను అప్పుల ఒత్తిడి నుంచి గట్టెక్కించేలా ఈ కొత్త చట్టానికి రూపకల్పన జరుగుతోంది. ‘ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చిన వడ్డీ వ్యాపారుల నియంత్రణ చట్టానికి కాలం చెల్లింది. మళ్లీ ఆ చట్టాన్ని తెస్తాం. రైతులను ఆదుకుంటాం...’ అని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అందుకు సంబంధించిన కసరత్తు చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు గతంలో ఉన్న చట్టాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వడ్డీ వ్యాపార నియంత్రణ చట్టాలను పరిశీలిస్తున్నారు. మన ప్రాంతంలో ఉండే పరిస్థితులకు అనుగుణంగా వీటిలో మార్పులు చేర్పులు చేసి కొత్త చట్టానికి రూపకల్పన చేస్తున్నారు. చట్టం నిబంధనలు తయారు చేసిన తర్వాత న్యాయశాఖ, హోంశాఖ పరిశీలనకు పంపుతారు. ఆ శాఖల ఆమోదం తర్వాత చట్టానికి తుది రూపునిస్తారు. కట్టుదిట్టమైన నిబంధనలు.. గతంలో ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ ఏరియా) మనీ లాండరింగ్ యాక్ట్-1939 ఫస్లీ, ఆంధ్రప్రదేశ్ పాన్ బ్రోకర్స్ యాక్ట్-2002 చట్టాలతో పాటు వైఎస్సార్ హయాంలో ఏపీ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ష్( మనీ లెండింగ్) చట్టం అమల్లోకి వచ్చింది. ప్రస్తుత పరిస్థితిలో తెలంగాణలో మైక్రో ఫైనాన్స్ సంస్థల బెడద లేదు. అందుకే మిగతా రెండు చట్టాల్లో ఉన్న నిబంధనలను ఆర్థిక శాఖ పరిగణనలోకి తీసుకుంటోంది. వీటిలో రైతులకు ఉపయుక్తంగా ఉండే నిబంధనలను పరిశీలిస్తోంది. గతంలో ఉన్న తరహాలోనే సెక్యూరిటీ పెట్టి తీసుకున్న రుణాలకు ఏడాదికి 6 శాతం, సెక్యూరిటీ లేకుండా ఇచ్చే రుణాలకు 12 శాతం మించకుండా వడ్డీని నియంత్రించే అవకాశముంది. వడ్డీ వ్యాపారులు బలవంతంగా రుణాల వసూలు చేయవద్దని, వేధించవద్దని చట్టంలో ఉంది. వేధింపులకు పాల్పడితే ఆరు నెలల పాటు జైలుశిక్ష లేదా జరిమానా విధించే నిబంధనలున్నాయి. రుణాలకు బదులుగా ఆస్తులు జప్తు చేయటాన్ని నియంత్రిస్తుంది. 2012లో కేరళలో వరుసగా జరిగిన రైతుల ఆత్మహత్యలకు నిలువరించేందుకు అక్కడి ప్రభుత్వం వడ్డీ నియంత్రణ చట్టాన్ని తెచ్చింది. రుణాల రికవరీకి ఒత్తిడి చేసిన వడ్డీ వ్యాపారులపై ఏకంగా మూడేళ్ల పాటు జైలుశిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించేలా కట్టుదిట్టమైన నిబంధనలు విధించింది. ఈ చట్టం అమలు చేయటంతో కేరళలో రైతుల ఆత్మహత్యల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టిందనే విశ్లేషణలున్నాయి. దౌర్జన్యాలు, వేధింపులకు పాల్పడే వడ్డీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపేలా చట్టం కఠినంగా ఉంటే రైతులను అప్పుల ఒత్తిడి నుంచి విముక్తి చేసినట్లవుతుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. -
‘చిట్టీలరాణి’ కేసు హుష్‌కాకి..!
వడ్డీ వ్యాపారులపై సీసీఎస్ ఉదాసీనత మరోపక్క పీడీ యాక్ట్ ప్రయోగిస్తామంటున్న కమిషనర్ సాక్షి, సిటీబ్యూరో: వడ్డీ వ్యాపారులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని ఓ పక్క నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి హెచ్చరిస్తుంటే.... మరోపక్క సీసీఎస్ పోలీసులు మాత్రం వడ్డీ వ్యాపారులకు ఎర్రతివాచీ పరిచి దొడ్డి దారిన సాగనంపారు. వడ్డీల రూపంలో రూ.1.95 కోట్లు వసూలు చేసిన 28 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని చెప్పిన సీసీఎస్ అధికారులు ఆరు నెలలైనా ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. టీవీ ఆర్టిస్టు విజయరాణి అరెస్టు సందర్భంగా ఏప్రిల్ 11న మీడియాతో డీసీపీ పాలరాజు ఏమన్నారంటే... ‘‘చిట్టీల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి తోటి ఆర్టిస్టులను నిలువునా దోచుకున్న టీవీ ఆర్టిస్టు విజయరాణి అలియాస్ చిట్టీలరాణి (46) రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు చిట్టీలు నిర్వహించేది. అయితే ఒక్కో గ్రూప్‌లో పూర్తిగా సభ్యులు చేరకపోయినా చిట్టీలు నిర్వహించడంతో ఆమెకు నష్టాలొచ్చాయి. వీటిని పూడ్చేందుకు తెలిసిన వారి వద్ద రూ.3 నుంచి రూ.20 వరకు వడ్డీకి అప్పు తీసుకుంది. ఈ వడ్డీలు చెల్లించేందుకు మరికొంత మంది దగ్గర లక్షలాది రూపాయలు అప్పు చేసింది. ఓ వ్యక్తి వద్ద ఆమె రూ.లక్ష అప్పు తీసుకుని కేవలం వడ్డీ రూపంలో ప్రతి రోజు అతనికి రూ.3,500 చెల్లించేది. ఆమె నుంచి అధిక వడ్డీలు వసూలు చేసిన 28 మందిపై కేసులు నమోదు చేస్తాం’’ అన్నారు. ఆరు నెలలైనా ఇప్పటి వరకు ఒక్క వడ్డీ వ్యాపారిపై కూడా కేసు నమోదు చేయలేదు. ఆర్థికంగా నష్టపోయి బెంగళూరుకు పరార్... ఎర్రగడ్డకు చెందిన టీవీ ఆర్టిస్టు విజయరాణి నాలుగేళ్ల నుంచి ఇంట్లోనే ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేటుగా రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు చిట్టీలు నిర్వహించేది. ఆర్ధికంగా పూర్తిగా దిగజారడంతో అప్పుల బాధ పెరిగిపోయింది. కొందరు అప్పుల వారు ఆమెను ఏకంగా బెదిరించడంతో పిల్లాపాపలతో కలిసి ఇల్లు ఖాళీ చేసి మార్చి నెలలో బెంగళూరుకు పారిపోయింది. దీంతో చిట్టీలు వేసి మోసపోయిన సుమారు 80 మంది బాధిత ఆరిస్టులు రూ.10 కోట్ల వరకు మోసపోయామని సీసీఎస్ పోలీసులను ఆశ్రయించడంతో అదే నెల 11న ఆమెతోపాటు మరో ఏడుగురిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వడ్డీ రూపంలో రూ.1.95 కోట్లు చెల్లింపు... విజయరాణికి 54 మంది నుంచి సుమారు రూ.1.20 కోట్లు రావాల్సి ఉంది. వీరు కూడా ఆమె వద్ద చిట్టీలు వేశారు. ఇక ఆమె చిట్టీలు ఎత్తుకోని 78 మందికి సుమారు రూ.2.20 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆమె వడ్డీల రూపంలో రూ.1.95 కోట్లు చెల్లించిందని విచారణలో తేలింది. అరెస్టు సమయంలో ఆమె విక్రయించిన మూడు ఇళ్లు, కారు, మూడు బైక్‌లు, రూ.845 నగదు, కొన్ని బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని కోర్టు ద్వారా విక్రయించి బాధితులకు అందజేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఆమె వడ్డీలకే అధికంగా డబ్బులు కట్టడంతో నష్ట పోయిందని చెప్పిన అధికారులు ఆ వడ్డీ వ్యాపారుల విషయంలో మాత్రం చేతులెత్తేశారు. అలాగే ఆమె నుంచి అధిక వడ్డీలు వసూలు చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. అయితే వారి పేర్లు, వివరాలు సీసీఎస్పోలీసుల చేతికి అందినా నేటి వరకు కూడా ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. ఇప్పుడైనా స్పందించి వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదు చేయాలని బాధితులు కోరుతున్నారు. -
‘బాబు’ మాయ
⇒ అన్నదాతకు కోలుకోలేని దెబ్బ ⇒ బ్యాంకుల నుంచి అందని రుణాలు ⇒ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు ⇒ ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.3,797 కోట్లు ⇒ బ్యాంకులు ఇచ్చింది కేవలం రూ. 227 కోట్లు సాక్షి, గుంటూరు : అన్నదాతలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. రుణ మాఫీ పేరుతో రైతులను ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసింది. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లతో కనీసం పెట్టుబడులు కూడా రాక కుదేలవుతున్న అన్నదాతకు రుణమాఫీ రూపంలో కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. బ్యాంకుల్లో ఉన్న రుణాలు రద్దుకాక, కొత్త అప్పు పుట్టక అవస్థలు పడుతున్నారు. ► బ్యాంకుల నుంచి రుణాలు అందకపోవడంతో పెట్టుబడుల కోసం రైతులు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించక తప్పడం లేదు. ఈ అవకాశాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకొంటున్నారు. అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు. ► ఈ ఏడాది ఖరీఫ్ రుణం లక్ష్యం రూ. 3797.14 కోట్లు కాగా, ఇప్పటి వరకు కేవలం రూ. 227.80 కోట్ల రూపాయల రుణాలను మాత్రమే బ్యాంకులు మంజూరు చేశాయి. దీంతో రైతులంతా వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు. ► ప్రభుత్వ నిర్వాకంతో రెండు రకాల భారం అన్నదాత నెత్తిన పడింది. బ్యాంకుల్లో ఉన్న రుణాలు రద్దుకాకపోవడంతో 14 శాతం వడ్డీ రైతుకు భారంగా మారింది. మరో వైపు పెట్టుబడులకు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించడంతో వందకు మూడు రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారు. ► ఇప్పటికీ రుణమాఫీకి సంబంధించి స్పష్టమైన విధి విధానాలు రాక పోవడంతో అన్నదాతలకు దిక్కు తోచడం లేదు. ► ఖరీఫ్ సీజన్ ముగియడంతో రబీ సాగు కోసం రైతులు సన్నాహాలు చేసుకొంటు న్నారు. చేతిలో రూపాయికూడా లేకపోవడంతో సాగు ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ► జిల్లాలో 12,21,965 మంది రైతులకు రుణ మాఫీ ద్వారా రూ.9,749 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరాల్సివుంది. రుణమాఫీ కాకపోగా, రుణాలను రెన్యూవల్ చేయలేదు. ► ప్రస్తుత ఖరీఫ్ సీజన్ పూర్తయ్యే నాటికి రైతులకు రూ.6,328 కోట్ల రూపాయల రు ణాలను ఇవ్వాలని జిల్లా అధికారులు ప్రణాళికలు వేసినా ఆచరణలో కార్యరూపం దాల్చ లేదు. రబీ సాగుకు సన్నాహాలు... ► జిల్లాలో అన్నదాతలు రబీ సాగుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. పెట్టుబడులు కోసం మళ్లీ వడ్డీ వ్యాపారస్తుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ► రబీలో ముఖ్యంగా జొన్నతో పాటు, రెండో పంట కింద వరి సాగు చేస్తారు. ► ప్రభుత్వం రూ. 2,531.43 కోట్ల రూపాయలను రబీ రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు ఎవ్వరికి ఇవ్వలేదు. ► జిల్లాలో 3,684 మంది రైతు మిత్ర గ్రూపులకు రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా, కేవలం 136 గ్రూపులకు మాత్రమే రుణాలు ఇచ్చారు. ► కౌలు రైతులకు సంబంధించి 27,562 మందికి రుణ అర్హత కార్డులు మంజూరు చేసినా ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. ► జిల్లాలో 7,945 రైతు సంఘాలు ఉండగా 38 గ్రూపులకు మాత్రమే రుణాలు ఇచ్చారు. మొత్తం మీద రైతులకు పంట రుణాలు అందని ద్రాక్షగా మారాయి. -
రుణమో.. రామచంద్రా!
ఖరీఫ్ ప్రారంభమై నెలన్నర రోజులైనా అందని బ్యాంకుల సాయం - ఈ ఏడాది రూ.3,280కోట్ల రుణలక్ష్యం - కొత్తసర్కారు ప్రకటన కోసం ఎదురుచూపు - వరుణుడు కరుణించక నష్టాల్లో అన్నదాత సాక్షి, మహబూబ్‌నగర్: ఖరీఫ్ సీజన్ ఆరంభమై నెలన్నర గడిచినా బ్యాంకు రుణం అందకపోవడంతోవడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నాడు. వరుణుడు కరుణించకపోవడం.. విత్తిన విత్తు మొలవకపోవడం.. సాగుఖర్చు రెండింతలవడంతో దిక్కుతోచనిస్థితిలో పడ్డాడు. చేతిలో చిల్లిగవ్వలేక రుణమాఫీ అన్న సర్కారు మాట కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నాడు. జిల్లాలో గతేడాది అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల కారణంగా పంటల దిగుబడి కూడా ఆశించినంతగా రాలేదు. ఈ సారైనా అప్పులబాధ నుంచి గట్టెక్కుదామని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పాటు అడపాదడపా రాలిన చినుకులకు పంట సాగుచేద్దామంటే చేతిలో చిల్లిగవ్వలేదు. అయితే ఈ సీజన్లో బ్యాంకు రుణాలు ఇవ్వడం ప్రారంభించలేదు. జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం బ్యాంకులు రూ. 3,078కోట్ల వ్యవసాయ, దాని అనుబంధ రుణాలు అందజేశాయి. ఈ క్రమంలో 266 మంది కౌలురైతులకు రూ.97లక్షల రుణం అందింది. రూ.లక్ష లోపు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీచేస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ హామీకి కట్టుబడి ఉన్నామని చెబుతోంది. ఈ క్రమంలో ఖరీఫ్ ప్రారంభమై నెలన్నరరోజులు గడుస్తున్నా.. రుణాలపై నిర్ణయం ఏ నిర్ణయం తీసుకోలేదు. దీనికితోడు ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)కూడా విధివిధానాలను ఖరారు చేయకపోవడంతో బ్యాంకులు అడుగు ముందుకువేయలేకపోతున్నాయి. జిల్లాలో దాదాపు 4,97,073 వ్యవసాయ బ్యాంక్ ఖాతాలు కలిగిన రైతులు రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. చేసేదిలేక తమ వద్ద ఉన్న బంగారాన్ని వడ్డీవ్యాపారుల వద్ద తాకట్టుపెట్టడం లేదా ఉన్న జీవాలను అమ్ముకోవడం ద్వారా సాగుఖర్చులు వెళ్లదీసుకుంటున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రైతులకు రూ.3,280కోట్ల రుణాలివ్వాలని బ్యాంకులు ప్రణాళికను నిర్ధేషించుకున్నాయి. ఇందులో పంటరుణాలు రూ.2803కోట్లు కాగా, టర్మ్లోన్లు రూ.477కోట్లు, అనుబంధ రంగాలకు రూ.176 కోట్లు ఉన్నాయి. నడ్డివిరుస్తున్న వ్యాపారులు వ్యవసాయదారులకు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరుకాకపోవడంతో వడ్డీవ్యాపారులకు పంట పడుతోంది. బంగారు, వెండి నగలను కుదువపెడుతున్న రైతుల వద్ద రూ.100కు రూ.3, రూ.4, రూ.5 వడ్డీని వసూలు చేస్తున్నారు. మరికొందరు రైతులు పంటచేతికొచ్చిన తరువాత చెల్లించేవిధంగా ఎరువులు, విత్తనాలు తెచ్చుకుంటున్నారు. రైతుల అవసరాన్ని గమనించి.. అధిక వడ్డీలు డిమాండ్ చేస్తున్నారు. నూటికి ఐదు నుంచి ఏడు రూపాయల వరకు వడ్డీ వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. వేధిస్తున్న వానదేవుడు..! గత పదేళ్లలో ఎన్నడూ లే నంతంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటివరకు గట్టిగా ఒక్కవాన కురవలేదు. సాధారణ వర్షపాతం కంటే అతి తక్కువగా నమోదైంది. జూన్ చివరి నాటికి సాధారణ వర్షపాతం 71.2 మి.మీ ఉండగా, 48.8 మి.మీ మాత్రమే కురిసింది. సరైనవర్షాలు లేకపోవడంతో పంటలు కూడా అంతంత మాత్రమే సాగయ్యాయి. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 7,06,216 హెక్టార్లు సాగుకావల్సి ఉండగా, కేవలం 74,190 హెక్టార్లు మాత్రమే సాగైంది. వర్షాలు లేని కారణంగా మొలకలు చనిపోవడంతో రెండుమూడు సార్లు విత్తులు విత్తుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. -
దిల్‌సుఖ్‌నగర్‌లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు