కరీంనగర్‌క్రైం: సామాన్యుల అవసరాలు అసరాగా చేసుకుని కరీంనగర్‌లో వడ్డీ వ్యాపారం చేస్తున్నవారిపై టాస్క్‌ఫోర్స్ బృందాలు రెండు రోజులు దాడులు చేస్తున్నాయి. ‘వడ్డీ దందాకు అడ్డేది’ శీర్షికన ఈనెల 25న ‘సాక్షి’లో వడ్డీ వ్యాపారుల అగడాలతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులపై కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన సీపీ కమలాసన్‌రెడ్డి వెంటనే టాస్క్‌ఫోర్స్ బృందాలను రంగంలోకి దించారు. రెండు రోజులుగా పలువురు వడ్డీ వ్యాపారులు, అనుమతి లేని ఫైనాన్స్‌లు, గిరిగిరి ఫైనాన్స్ వ్యాపారులపై దాడులు చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు, సంతకాలు చేసిన ఖాళీ ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులు స్వాధీనం చేసుకున్నారు.
పలువురి వద్ద భారీగా నగదు డబ్బులు కూడా లభ్యమైనట్లు సమాచారం. మరో రెండు మూడు రోజుల్లోనే వడ్డీ వ్యాపారుల దందాకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. నిందితులను కూడా అరెస్ట్ చూసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రామగుండం, సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారులపై దాడులు చేసిన పోలీసులు తాజాగా కరీంనగర్‌లోని వడ్డీ వ్యాపారులపై టాస్క్‌ఫొర్స్ బృందాలు దాడులు చేయడం సంచలనం కలిగించింది. అయితే ఈ దందాలో పలువురు బాడా బాబుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. కోటి రూపాయలు పెట్టుబడి పెడితే చాలు నెలకు రూ.20 లక్షలకు పైగా అదాయం వస్తోందని సమాచారం. టాస్క్‌పొర్స్ దాడులతో ఇవన్నీ బట్టబయలు కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment