రుణమో.. రామచంద్రా! | this year target Rs.3,280 crore's | Sakshi
Sakshi News home page

రుణమో.. రామచంద్రా!

Published Mon, Jul 7 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM

రుణమో.. రామచంద్రా!

రుణమో.. రామచంద్రా!

ఖరీఫ్ ప్రారంభమై నెలన్నర రోజులైనా అందని బ్యాంకుల సాయం
- ఈ ఏడాది రూ.3,280కోట్ల రుణలక్ష్యం
- కొత్తసర్కారు ప్రకటన కోసం ఎదురుచూపు
- వరుణుడు కరుణించక నష్టాల్లో అన్నదాత

 సాక్షి, మహబూబ్‌నగర్: ఖరీఫ్ సీజన్ ఆరంభమై నెలన్నర గడిచినా బ్యాంకు రుణం అందకపోవడంతోవడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నాడు. వరుణుడు కరుణించకపోవడం.. విత్తిన విత్తు మొలవకపోవడం.. సాగుఖర్చు రెండింతలవడంతో దిక్కుతోచనిస్థితిలో పడ్డాడు. చేతిలో చిల్లిగవ్వలేక రుణమాఫీ అన్న సర్కారు మాట కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నాడు. జిల్లాలో గతేడాది అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల కారణంగా పంటల దిగుబడి కూడా ఆశించినంతగా రాలేదు.

ఈ సారైనా అప్పులబాధ నుంచి గట్టెక్కుదామని భావించిన రైతులకు నిరాశే  మిగిలింది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పాటు అడపాదడపా రాలిన చినుకులకు పంట సాగుచేద్దామంటే చేతిలో చిల్లిగవ్వలేదు. అయితే ఈ సీజన్‌లో బ్యాంకు రుణాలు ఇవ్వడం ప్రారంభించలేదు. జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం బ్యాంకులు రూ. 3,078కోట్ల వ్యవసాయ, దాని అనుబంధ రుణాలు అందజేశాయి. ఈ క్రమంలో 266 మంది కౌలురైతులకు రూ.97లక్షల రుణం అందింది.

రూ.లక్ష లోపు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీచేస్తామని చెప్పిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ హామీకి  కట్టుబడి ఉన్నామని చెబుతోంది. ఈ క్రమంలో ఖరీఫ్ ప్రారంభమై నెలన్నరరోజులు గడుస్తున్నా.. రుణాలపై నిర్ణయం ఏ నిర్ణయం తీసుకోలేదు. దీనికితోడు ఆర్‌బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)కూడా విధివిధానాలను ఖరారు చేయకపోవడంతో బ్యాంకులు అడుగు ముందుకువేయలేకపోతున్నాయి.

జిల్లాలో దాదాపు 4,97,073 వ్యవసాయ బ్యాంక్ ఖాతాలు కలిగిన రైతులు రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. చేసేదిలేక తమ వద్ద ఉన్న బంగారాన్ని వడ్డీవ్యాపారుల వద్ద తాకట్టుపెట్టడం లేదా ఉన్న జీవాలను అమ్ముకోవడం ద్వారా సాగుఖర్చులు వెళ్లదీసుకుంటున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రైతులకు రూ.3,280కోట్ల రుణాలివ్వాలని బ్యాంకులు ప్రణాళికను నిర్ధేషించుకున్నాయి. ఇందులో పంటరుణాలు రూ.2803కోట్లు కాగా, టర్మ్‌లోన్లు రూ.477కోట్లు, అనుబంధ రంగాలకు రూ.176 కోట్లు ఉన్నాయి.
 
నడ్డివిరుస్తున్న వ్యాపారులు
 వ్యవసాయదారులకు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరుకాకపోవడంతో వడ్డీవ్యాపారులకు పంట పడుతోంది. బంగారు, వెండి నగలను కుదువపెడుతున్న రైతుల వద్ద రూ.100కు రూ.3, రూ.4, రూ.5 వడ్డీని వసూలు చేస్తున్నారు. మరికొందరు రైతులు పంటచేతికొచ్చిన తరువాత చెల్లించేవిధంగా ఎరువులు, విత్తనాలు తెచ్చుకుంటున్నారు. రైతుల అవసరాన్ని గమనించి.. అధిక వడ్డీలు డిమాండ్ చేస్తున్నారు. నూటికి ఐదు నుంచి ఏడు రూపాయల వరకు వడ్డీ వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.  
 
వేధిస్తున్న వానదేవుడు..!
గత పదేళ్లలో ఎన్నడూ లే నంతంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటివరకు గట్టిగా ఒక్కవాన కురవలేదు. సాధారణ వర్షపాతం కంటే అతి తక్కువగా నమోదైంది. జూన్ చివరి నాటికి సాధారణ వర్షపాతం 71.2 మి.మీ ఉండగా, 48.8 మి.మీ మాత్రమే కురిసింది. సరైనవర్షాలు లేకపోవడంతో పంటలు కూడా అంతంత మాత్రమే సాగయ్యాయి. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 7,06,216 హెక్టార్లు సాగుకావల్సి ఉండగా, కేవలం 74,190 హెక్టార్లు మాత్రమే సాగైంది. వర్షాలు లేని కారణంగా మొలకలు చనిపోవడంతో రెండుమూడు సార్లు విత్తులు విత్తుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement