బెంగళూరులో ఘరానా ముఠా
2 వేల మందికి పంగనామాలు?
కృష్ణరాజపురం: నేటి రోజుల్లో అందరికీ డబ్బులు అవసరమే. దానినే మోసగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. బ్యాంకులో లోన్‌లు ఇప్పిస్తామని వేలాదిమంది వద్ద ప్రాసెసింగ్ ఫీజులని లక్షల రూపాయలు వసూలు చేసి పత్తా లేకుండా పోయిన కిలాడి గ్యాంగ్ ఉదంతం బయటపడింది. బాధితులు బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, రేష్మా అనే మహిళను అరెస్టు చేశారు. ఈ కేసులో ఆనంద్, రేష్మా, అంజుం, అనియా అనే నలుగురు ఉన్నారని పోలీసులు తెలిపారు.
ఏం చేసేవారంటే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీకార కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో రూ. 1 లక్ష నుంచి 25 లక్షల వరకు సులభంగా లోన్లు ఇప్పిస్తామని ఈ ముఠా ప్రచారం చేసుకుంది, దీంతో అనేకమంది వీరి బుట్టలో పడిపోయారు. లోన్ ప్రాసెసింగ్ ఫీజులని చెప్పి బాధితుల నుంచి లక్షల రూపాయలను వసూలు చేశారు. కానీ అప్పు మాత్రం ఇప్పించలేదు. ఫీజు డబ్బులు వెనక్కి ఇవ్వాలని అడిగితే అడ్రస్ లేకుండా పోయేవారు.
మోసపోయామని గుర్తించిన వందలాది మంది బాధితులు హైగ్రౌండ్స్ ఠాణాలో ఫిర్యాదులు చేశారు. కిలాడీ రేష్మా తనకు రాజకీయ నాయకులు తెలుసని ఈ దందాలో ముఖ్య పాత్ర పోషించింది. ఈ ముఠా సుమారు 2 వేల మంది నుంచి డబ్బులు కైంకర్య చేసినట్లు బాధితులు తెలిపారు. ఈ డబ్బు కోట్ల రూపాయల్లోనే ఉండవచ్చని తెలుస్తోంది. పరారీలో ఉన్న ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment