
రిలయన్స్ ఇండస్ట్రీస్ 3 బిలియన్ డాలర్లు(రూ.24,900 కోట్లు) రుణాన్ని పొందేందుకు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. వచ్చే ఏడాది చెల్లించాల్సిన రుణాన్ని రీఫైనాన్స్ చేయడానికి ఈ నిధులను ఉపయోగించుకోనున్నట్లు తెలిసింది. ఈమేరకు దాదాపు ఆరు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.
కంపెనీ గతంలో తీసుకున్న దాదాపు 2.9 బిలియన్ డాలర్ల రుణాల మెచ్యురిటీ 2025 మొదటి త్రైమాసికంలో ముగుస్తుంది. కాబట్టి కంపెనీ ఆయా రుణాలు చెల్లించి తిరిగి రిఫైనాన్స్‌కు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకే బ్యాంకు ఇంతమొత్తంలో చెల్లించడం ఒకింత రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం కాబట్టి, దాదాపు ఆరు బ్యాంకులతో సంస్థ అధికారులు చర్చలు జరుపుతున్నారని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
ఈ ఒప్పందం కార్యరూపం దాలిస్తే 2023 నుంచి కొంత విరామం తర్వాత రిలయన్స్ ఆఫ్‌షోర్ రుణాల(ఇతర దేశాలు అందించే అప్పులు) మార్కెట్‌లోకి తిరిగి ప్రవేశించినట్లుగా అవుతుంది. ఇదిలాఉండగా, రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఇటీవల రుణాల ద్వారా 8 బిలియన్ డాలర్లకు పైగా నిధులు సేకరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రెడిట్ ప్రొఫైల్ మెరుగ్గా ఉండడంతో రుణాలు పొందేందుకు మార్గం సులువవుతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: గ్లోబల్ సౌత్ లీడర్‌గా భారత్
మూడీస్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రెడిట్ రేటింగ్‌ను Baa2 వద్ద స్థిరంగా ఉంచింది. ఇది ఇండియన్ సావరిన్ గ్రేడ్ కంటే మెరుగ్గా ఉండడం కూడా రిలయన్స్‌కు కలిసొచ్చే అంశంగా భావించవచ్చు. సంస్థ ఆర్థిక స్థితి, విభిన్న వ్యాపార నమూనా, వినియోగదారుల్లో విశ్వసనీయత..వంటి అంశాలు కూడా రుణదాతలకు భరోసా కల్పిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment