
రాజంపేట: వైఎస్సార్ జిల్లా రాజంపేటలో వడ్డీ జలగల ధాటికి తట్టుకోలేక దంపతులు బుధవారం ఆత్మత్యాయత్నానికి పాల్పడ్డారు. దంపతులిద్దరూ తమ స్వగ్రామమైన కొమ్మివారిపల్లె గ్రామపరిధిలోని పొలాల్లోకి వెళ్లి ఆత్మహత్యకు యత్నించారు. ఘటనాస్థలంలోనే భార్య మృతి చెందగా..భర్త చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. స్థానికుల కథనం మేరకు నాగినేని ధనలక్ష్మి (52), నాగినేని లక్ష్మీనారాయణ దంపతులు పట్టణంలోని భరత్‌నగర్ (ప్రభుత్వడిగ్రీకళాశాల వెనుకవైపు)లో ఉన్న సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కూతురు, అల్లుడు అమెరికాలో, కుమారుడు కర్ణాటక రాష్ట్రంలో ఉంటున్నారు. అయితే కుటుంబ అవసరాల నిమిత్తం అప్పులు చేశాడు. దీంతో రోజు వడ్డీ వ్యాపారులు జలగల్లా పీడించడం మొదలుపెట్టారు.
ఒత్తిడిని తట్టుకోలేక బుధవారం వారు తమ పొలం వద్దకు చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగారు.ధనలక్ష్మి అక్కడక్కడే మృతి చెందగా.. మృతదేహాన్ని పోస్టుమార్టరం నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లక్ష్మీనారాయణ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండంతో సమీపలోని పశువుల కాపరి చూసి వారి సంబంధీకులకు తెలిపారు. లక్ష్మీనారాయణను ముందుగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అధిక వడ్డీలతో వేధింపులు..
అధిక వడ్డీలతో నిత్యం ఈ దంపతులను కొంతమంది వడ్డీ వ్యాపారులు జలగల్లా పీడించేవారని స్థానికులు చెబుతున్నారు. చివరికి రూ.6 నుంచి రూ.10 వరకు వడ్డీలకు డబ్బులు ఇచ్చి రాబట్టడంలో భాగంగా ఆస్తులను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అవసరమైతే బ్యాంకుల్లో మార్టిగేజ్ చేయించడం లాంటి చర్యలకు వారు పాల్పడడంతో.. తట్టుకోలేని బాధితులు విధిలేక చనువు చాలిస్తున్నారని పేర్కొంటున్నారు. అయితే ఈ విషయమై తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని మన్నూరు ఎస్‌ఐ మహేశ్‌నాయుడు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment