
హత్య చేసిన తీరును వివరించిన నిందితుడు షేక్ వల్లీ
గోకవరం (జగ్గంపేట): మిస్టరీగా మారిన పెద్దాపురం మండలం గుడివాడకు చెందిన వడ్డీ వ్యాపారి పోతంశెట్టి విష్ణుఈశ్వరులు గోకవరం మండలం తిరుమలాయపాలెంలో హత్యకు గురైన సంగతి పాఠకులకు విదితమే. తిరుమలాయపాలేనికి చెందిన మాంసం వ్యాపారి షేక్ వల్లీ విష్ణుఈశ్వరులును హత్య చేసి సెప్టిక్ ట్యాంక్‌లో పాతి పెట్టగా పోలీసులు శుక్రవారం మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ క్రమంలో రాత్రి కావడంతో మృతదేహాన్ని బయటకు తీయడానికి వీలుకాలేదు. శనివారం ఉదయం రాజమహేంద్రవరం నార్త్‌జోన్ డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కోరుకొండ సీఐ రవికుమార్, గోకవరం ఎస్సై జి.ఉమామహేశ్వరరావులు మృతదేహాన్ని వెలికితీయించి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఈ సందర్భంగా హత్యకు పాల్పడిన షేక్ వల్లీని పోలీసులు సంఘటన స్థలానికి తీసుకువచ్చి వివరాలు సేకరించారు. హత్య చేసిన తీరు, మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పూడ్చిన వైనాన్ని నిందితుడు పోలీసులకు వివరించాడు. డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మృతుడు షేక్ వల్లీకి రెండేళ్ల క్రితం రూ. 25 వేలు అప్పుగా ఇచ్చాడని. వారానికి రూ.500 వడ్డీలు కట్టాల్సి ఉండగా మూడు నెలల నుంచి నగదు చెల్లించడం లేదన్నారు. ఈ క్రమంలో డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడంతో గత మంగళవారం నగదు చెల్లిస్తానని చెప్పి ఇంటికి తీసుకువెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి తలపై, మెడపై నరికాడన్నారు.
అనంతరం శవాన్ని దుప్పట్లో చుట్టి గదిలో ఉంచి ఎవరికీ అనుమానం రాకుండా అర్ధరాత్రి సమయంలో మృతదేహాన్ని ఈడ్చుకు వెళ్లి సెప్టిక్ ట్యాంక్‌లో పడేశాడన్నారు. దీనిపై వీఆర్వో వెంకన్నదొర ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహం సెప్టిక్ ట్యాంక్‌లోంచి వెలికితీసిన తరువాత మృతుడి బంధువులు బోరున విలపించారు. అలాగే సంఘటనపై తిరుమలాయపాలెం గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.