
నరసరావుపేటలో కాల్ ‘నాగులు’ బుసకొడుతున్నాయి.. అవసరానికి అప్పు అడిగి తీసుకున్న పాపానికి సామాన్యులను నిత్యం వేధిస్తున్నాయి.. అసలుకు నాలుగింతల వడ్డీ కలిపి ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి.. అవసరమైతే ప్రత్యక్ష దాడులకు దిగడం.. ఇంట్లో సామగ్రి తీసుకువెళ్లడం వీటి నైజం. ‘ఖాకీలు’ అండగా నిలబడతాయని ఒకరిద్దరు ధైర్యం చేసి ఠాణాల్లో ఫిర్యాదు చేసినా వచ్చిన స్పందన.. ఒక ‘ఉచిత సలహా’. సమస్యను కోర్టుల్లోనే తేల్చుకోవాలని చెప్పేసరికి, బాధితులు ‘చావు’ మెట్టు ఎక్కుతున్నారు.
నరసరావుపేటటౌన్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కాల్ మనీ వ్యవహారంలో ప్రభుత్వం కంటితుడుపు చర్యగా నామమాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంది. దీంతో అధిక వడ్డీ వ్యాపారుల ఆగడాలు ఇంకా పెరిగిపోతున్నాయి. తాజాగా నరసరావుపేటలో రెండు నెలల వ్యవధిలో కాల్ ‘నాగుల’ వేధింపులకు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు వెలుగుచూశాయి. వీరిలో ఇద్దరు మహిళలు వేధింపులు తాళలేకే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ రాయడం గమనార్హం. ఎంతోమంది ఇప్పటికీ ఒత్తిళ్లను భరిస్తున్నారు. వీరి ఆగడాలపై కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఈ వ్యవహారాలను కోర్టులో చూసుకోవాలని ఉచిత సలహాలు ఇవ్వడం గమనార్హం. తీసుకున్న అప్పునకు నాలుగింతల నగదు చెల్లించినా బాకీ తీరలేదని చెప్పడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కొందరు వ్యాపారులు అప్పుల తీసుకున్న వారి గృహాల్లో తిష్ట వేసి సామగ్రి తీసుకువెళ్లిన ఘటనలు జరిగాయి. దీనిపై ప్రశ్నిస్తే భౌతిక దాడులకు తెగబడిన సందర్భాలూ అనేకం.
ఉదాహరణలు ఇవిగో..
► నరసరావుపేట ప్రకాష్‌నగర్‌కు చెందిన కిరాణా వ్యాపారి మువ్వా వెంకటేశ్వరరావుకు వ్యాపారంలో నష్టం వచ్చింది. తెచ్చిన అప్పులకు అధిక వడ్డీలు చెల్లించలేక, ఒత్తిళ్లు తట్టుకోలేక గతనెల 16వ తేదీన గుంటూరు రోడ్డులోని గల హిందూ శ్మశానవాటిక ఎదుట పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మృతికి అధిక వడ్డీలే కారణమని సూసైడ్ నోట్‌లో స్పష్టంగా పేర్కొనడం గమనార్హం.
► మరికొన్ని రోజుల తర్వాత పసనతోటకు చెందిన జరీనాబేగం చిట్ నడుపుతూ పాట పాడుకున్న వారికి డబ్బు చెల్లించేందుకు గాను వడ్డీ వ్యాపారుల వద్ద డబ్బు తీసుకుంది. అధిక వడ్డీలు చెల్లించలేక బలవన్మరాణానికి పాల్పడింది.
► ప్రకాష్‌నగర్ కంభంపాలెం ప్రాంతంలో నివాసం ఉంటున్న ఖాశీంబి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది. తన కుమార్తె వివాహానికి వ్యాపారుల నుంచి అధికవడ్డీలకు నగదు తీసుకుంది. వారి నుంచి వచ్చిన వేధింపులు తాళలేక సూసైడ్‌నోట్ వ్రాసి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోయిన ప్రాణం ఎటూ తిరిగిరాదు అనుకున్నారో ఏమో మహిళల ఆత్మహత్యల సంఘటనలపై పోలీసులకు బాధిత బం«ధువులు ఫిర్యాదు చేయలేదు.
ఊరు వదిలి వెళ్లిన కుటుంబాలు అనేకం..
► గతేడాది నరసరావుపేట ఎన్జీవో కాలనీకి చెందిన పద్మజ అనే మహిళ వడ్డీ వ్యాపారులు వేధింపులకు తాళలేక ఇటీవల కుటుంబ సభ్యులతో సహా ఊరువిడిచి వెళ్లిపోయింది.
► మొదటి రైల్వేగేట్ సమీంలో టీ స్టాల్ నిర్వహించే నూర్జహాన్ అనే మహిళ ఇటీవల వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక రాత్రికి రాత్రే పట్టణం విడిచి వెళ్లింది.
► 20 రోజుల క్రితం రావిపాడుకు చెందిన షేక్ మీరావలి వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక గ్రామం వదిలి వెళ్లిపోయాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు ఎట్టకేలకు అతని ఆచూకీ కనిపెట్టి స్టేషన్‌కు తీసుకొచ్చారు. విచారణలో అధికవడ్డీ వ్యాపారుల వేధింపులతో ఊరు విడిచి వెళ్ళినట్లు బాధితుడు చెప్పడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కాల్‌మనీ వ్యాపారుల ఆట కట్టించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇలా వెలుగులోకి వచ్చిన సంఘటనలు కొన్ని ఉంటే, అసలు వెలుగులోకి రాకుండా కాల్‌మనీ వ్యాపారుల అరాచకాలకు బలవుతున్నవారు అనేక మంది ఉన్నారనేది జగమెరిగిన సత్యం.
Comments
Please login to add a commentAdd a comment