Call Money danda case
-
ప్రాణాలు తీస్తున్న 'కాల్' నాగులు
నరసరావుపేటలో కాల్ ‘నాగులు’ బుసకొడుతున్నాయి.. అవసరానికి అప్పు అడిగి తీసుకున్న పాపానికి సామాన్యులను నిత్యం వేధిస్తున్నాయి.. అసలుకు నాలుగింతల వడ్డీ కలిపి ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి.. అవసరమైతే ప్రత్యక్ష దాడులకు దిగడం.. ఇంట్లో సామగ్రి తీసుకువెళ్లడం వీటి నైజం. ‘ఖాకీలు’ అండగా నిలబడతాయని ఒకరిద్దరు ధైర్యం చేసి ఠాణాల్లో ఫిర్యాదు చేసినా వచ్చిన స్పందన.. ఒక ‘ఉచిత సలహా’. సమస్యను కోర్టుల్లోనే తేల్చుకోవాలని చెప్పేసరికి, బాధితులు ‘చావు’ మెట్టు ఎక్కుతున్నారు. నరసరావుపేటటౌన్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కాల్ మనీ వ్యవహారంలో ప్రభుత్వం కంటితుడుపు చర్యగా నామమాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంది. దీంతో అధిక వడ్డీ వ్యాపారుల ఆగడాలు ఇంకా పెరిగిపోతున్నాయి. తాజాగా నరసరావుపేటలో రెండు నెలల వ్యవధిలో కాల్ ‘నాగుల’ వేధింపులకు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు వెలుగుచూశాయి. వీరిలో ఇద్దరు మహిళలు వేధింపులు తాళలేకే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ రాయడం గమనార్హం. ఎంతోమంది ఇప్పటికీ ఒత్తిళ్లను భరిస్తున్నారు. వీరి ఆగడాలపై కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఈ వ్యవహారాలను కోర్టులో చూసుకోవాలని ఉచిత సలహాలు ఇవ్వడం గమనార్హం. తీసుకున్న అప్పునకు నాలుగింతల నగదు చెల్లించినా బాకీ తీరలేదని చెప్పడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కొందరు వ్యాపారులు అప్పుల తీసుకున్న వారి గృహాల్లో తిష్ట వేసి సామగ్రి తీసుకువెళ్లిన ఘటనలు జరిగాయి. దీనిపై ప్రశ్నిస్తే భౌతిక దాడులకు తెగబడిన సందర్భాలూ అనేకం. ఉదాహరణలు ఇవిగో.. ► నరసరావుపేట ప్రకాష్‌నగర్‌కు చెందిన కిరాణా వ్యాపారి మువ్వా వెంకటేశ్వరరావుకు వ్యాపారంలో నష్టం వచ్చింది. తెచ్చిన అప్పులకు అధిక వడ్డీలు చెల్లించలేక, ఒత్తిళ్లు తట్టుకోలేక గతనెల 16వ తేదీన గుంటూరు రోడ్డులోని గల హిందూ శ్మశానవాటిక ఎదుట పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మృతికి అధిక వడ్డీలే కారణమని సూసైడ్ నోట్లో స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. ► మరికొన్ని రోజుల తర్వాత పసనతోటకు చెందిన జరీనాబేగం చిట్ నడుపుతూ పాట పాడుకున్న వారికి డబ్బు చెల్లించేందుకు గాను వడ్డీ వ్యాపారుల వద్ద డబ్బు తీసుకుంది. అధిక వడ్డీలు చెల్లించలేక బలవన్మరాణానికి పాల్పడింది. ► ప్రకాష్‌నగర్ కంభంపాలెం ప్రాంతంలో నివాసం ఉంటున్న ఖాశీంబి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది. తన కుమార్తె వివాహానికి వ్యాపారుల నుంచి అధికవడ్డీలకు నగదు తీసుకుంది. వారి నుంచి వచ్చిన వేధింపులు తాళలేక సూసైడ్‌నోట్ వ్రాసి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోయిన ప్రాణం ఎటూ తిరిగిరాదు అనుకున్నారో ఏమో మహిళల ఆత్మహత్యల సంఘటనలపై పోలీసులకు బాధిత బం«ధువులు ఫిర్యాదు చేయలేదు. ఊరు వదిలి వెళ్లిన కుటుంబాలు అనేకం.. ► గతేడాది నరసరావుపేట ఎన్జీవో కాలనీకి చెందిన పద్మజ అనే మహిళ వడ్డీ వ్యాపారులు వేధింపులకు తాళలేక ఇటీవల కుటుంబ సభ్యులతో సహా ఊరువిడిచి వెళ్లిపోయింది. ► మొదటి రైల్వేగేట్ సమీంలో టీ స్టాల్ నిర్వహించే నూర్జహాన్ అనే మహిళ ఇటీవల వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక రాత్రికి రాత్రే పట్టణం విడిచి వెళ్లింది. ► 20 రోజుల క్రితం రావిపాడుకు చెందిన షేక్ మీరావలి వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక గ్రామం వదిలి వెళ్లిపోయాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు ఎట్టకేలకు అతని ఆచూకీ కనిపెట్టి స్టేషన్‌కు తీసుకొచ్చారు. విచారణలో అధికవడ్డీ వ్యాపారుల వేధింపులతో ఊరు విడిచి వెళ్ళినట్లు బాధితుడు చెప్పడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కాల్‌మనీ వ్యాపారుల ఆట కట్టించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇలా వెలుగులోకి వచ్చిన సంఘటనలు కొన్ని ఉంటే, అసలు వెలుగులోకి రాకుండా కాల్‌మనీ వ్యాపారుల అరాచకాలకు బలవుతున్నవారు అనేక మంది ఉన్నారనేది జగమెరిగిన సత్యం. -
తమ్ముళ్లకు వెన్నుదన్ను
కాల్‌మనీలో వారి పాత్ర తక్కువేనట! సెక్స్ రాకెట్‌ను మరుగు పరిచే యత్నాలు ఇప్పటివరకూ 30 మందిపై కేసుల నమోదు గుంటూరు : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌మనీ ముసుగులో సెక్స్ రాకెట్ దందా నిర్వహిస్తున్న తెలుగు తమ్ముళ్లను కాపాడే చర్యలు మొదలయ్యాయి. ప్రభుత్వం.. దాడుల పేరిట ఇతర పార్టీలవారిపై పోలీసులను ఉసిగొల్పి హడావుడి చేస్తోంది. సెక్స్ రాకెట్‌లోని నిందితుల పాత్రపై మాత్రం పెదవి విప్పడం లేదు. దందాలో తమ్ముళ్ల పాత్రను కప్పిపుచ్చేందుకే కాల్‌మనీ పేరిట దాడులు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల ద్వారా ఇతర పార్టీల నేతల పేర్లను వెల్లడిస్తూ సెక్స్ కుంభకోణాన్ని మరుగునపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే... పటమట పంట కాల్వ రోడ్డులో తెలుగుదేశం జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు సమీప బంధువు యలమంచిలి రాము, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సన్నిహితుడు వెనిగళ్ల శ్రీకాంత్, గత ఎన్నికల్లో టీడీపీ తరఫున నందిగామలో పోటీకి యత్నించిన విద్యుత్‌శాఖ డీఈ ఎం.సత్యానందం, పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ ప్రముఖుడి సన్నిహితుడు పెండ్యాల శ్రీకాంత్, బాడీ బిల్డర్ భవానీశంకర్, చెన్నుపాటి శ్రీనివాసరావు కలిసి ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అవసరం కోసం అప్పు తీసుకున్న వారిని బెదిరించి మహిళలను లొంగదీసుకోవడంతో పాటు వారిని వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. పైగా వారిని మరికొందరు మహిళలను తీసుకురావాలంటూ వేధింపులకు గురిచేస్తున్న క్రమంలో ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేయగా మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు. ఈ రాకెట్ నిర్వాహకులకు పెద్ద మొత్తంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెట్టుబడులు పెట్టినట్టు పోలీసులు గుర్తించి దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడేం జరుగుతోందంటే.. తమ టీడీపీ నేతల గుట్టు ఎక్కడ రట్టవుతుందోననే భయంతో ప్రభుత్వం కాల్‌మనీ వ్యాపారం పేరిట దాడులకు పోలీసులను వినియోగించింది. రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తూ ఇతర పార్టీల నేతలను లక్ష్యంగా చేసుకుంది. వారి నుంచి పలు పత్రాలు స్వాధీనం చేసుకుంటూ కాల్‌మనీ వ్యాపారంలో తామే కాదు అన్ని పార్టీలు భాగస్వాములేననే అభిప్రాయం కలిగించే విధంగా చర్యలు చేపట్టింది. అయితే సెక్స్ రాకెట్ వ్యవహారంలో అసలు నిందితులను అరెస్టు చేసేందుకు చర్యలు మాత్రం చేపట్టలేదు. వైఎస్సార్ సీపీ లక్ష్యంగా దాడులు : కాల్‌మనీ వ్యాపారంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారని చెప్పడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ పార్టీ నేతలపై బాధితులు ఎవరూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయక పోయినా, వారి ఇళ్లను అర్ధరాత్రి తనిఖీ చేసి ఆ కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేశారు. ఆ పార్టీలో కొనసాగితే ఇటువంటి వేధింపులు ఉంటాయనే రీతిలో ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. ఇందుకు ఉదాహరణగా వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు కావటి మనోహర్ నాయుడు, అతని సోదరులకు కాల్‌మనీ వ్యాపారంతో సంబంధాలు లేవు. రియల్ ఎస్టేట్, మద్యం వంటి ఇతర వ్యాపారాల్లో వారు కొనసాగుతున్నారు. కావటిపై బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా పెద్ద సంఖ్యలో పోలీసులు రాత్రి సమయంలో దాడి చేసి ఇంటిని సోదా చేశారు. ఇదే రీతిలో జిల్లాలో మొత్తం 30 మందిపై కేసులు నమోదు చేస్తే, ఎక్కువ మంది టీడీపీ సానుభూతిపరులు, ఆ పార్టీకి చెందిన కార్యకర్తలే అధికంగా ఉన్నారు. మిగిలిన వారి వద్ద లభించిన డాక్యుమెంట్లలో రైతువారీ వడ్డీతో (రెండు రూపాయలు) రుణాలు ఇస్తున్న డాక్యుమెంట్లు లభించాయి. వారం రోజుల క్రితం కల్తీ మద్యం కేసు, ఆ తరువాత వెంటనే కాల్‌మనీ మాఫియా వెలుగులోకి రావడంతో టీడీపీ పాలన పట్ల ప్రజల్లో ఏహ్య భావం స్పష్టంగా కనపడుతోంది. -
సెలవుపై ‘సవాంగ్’
తిరిగి 28న రాక ఇన్చార్జి సీపీగా సురేంద్రబాబు విజయవాడ సిటీ : నగర పోలీసు కమిషనర్ దామోదర గౌతమ్ సవాంగ్ సెలవుపై వె ళ్లనున్నారు. గురువారం నుంచి ఈ నెల 27 వరకు ఆయన సెలవులో ఉంటారు. సవాంగ్ స్థానంలో ఆక్టోపస్ అదనపు డీజీపీ ఎన్వీ సురేంద్రబాబు ఇన్చార్జి కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ మేరకు డీజీపీ జె.వి.రాముడు ఉత్తర్వులు జారీ చేశారు. గత ఆగస్టులో పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సవాంగ్ అనతి కాలంలోనే సంచలన కేసులు చేపట్టారు. నగరం నుంచి గుట్కా మాఫియాను తరిమికొట్టడంతో పాటు కల్తీ నెయ్యి, కల్తీ మద్యం కేసులపై ప్రత్యేక దృష్టిసారించారు. కాల్‌మనీ ముసుగులో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. ఇందులో పలువురిపై కేసు నమోదుతో పాటు అధికార పార్టీ ప్రముఖుల పాత్రపై దృష్టిసారించారు. ఈ క్రమంలోనే హఠాత్తుగా ఆయన సెలవుపై వెళుతుండటం చర్చనీయాంశంగా మారింది. గతంలో పెట్టుకున్న దరఖాస్తును 20 రోజుల కిందటే ఆమోదించినట్టు డీజీపీ చెపుతున్నారు. ఇదే సమయంలో సవాంగ్ కంటే సమర్థుడైన సురేంద్రబాబును సీపీగా నియమించామంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్లోని మర్మం బదిలీ పర్యవసానమేననేది కమిషనరేట్ వర్గాల అభిప్రాయం. కమిషనర్ సవాంగ్ బదిలీ ఊహాగానాలకు తెరపడాలంటే ఈ నెల 27 వరకు ఆగాల్సిందే. యాదృచ్ఛికమేనా... కాల్‌మనీ ముసుగులో సెక్స్ రాకెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చి అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్న క్రమంలోనే ఇన్చార్జి పోలీసు కమిషనర్‌గా సురేంద్రబాబు రావడంపై పలువురు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. యాదృచ్ఛికంగానే ఆయనను ఇన్చార్జి పోలీసు కమిషనర్‌గా నియమించారా? లేక ఉద్దేశపూర్వకమా? అనే దానిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో నగర పోలీసు కమిషనర్‌గా పని చేసిన సురేంద్రబాబు వడ్డీ వ్యాపారుల ఆటకట్టించేందుకు భారీ కసరత్తు చేశారు. అనేకమంది కాల్‌మనీ వ్యాపారులను అదుపులోకి తీసుకొని చెక్కులు, నోట్లు చించేశారు. పలువురు కాల్‌మనీ వ్యాపారులపై కేసులు కూడా నమోదు చేశారు. దీంతో ఈ కేసులో ఆయన వ్యవహార శైలిపై పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
కాల్‌మనీ దందాలో టీడీపీ నేత ముళ్లపూడి
కాలాంతకుల వ్యాపారంలో పెట్టుబడి రూ.కోటి జెడ్పీ చైర్మన్ బాపిరాజు బినామీ ఏ-6 శ్రీకాంత్ విచారణ జరుపుతున్నామన్న మాచవరం సీఐ విజయవాడ : కాల్‌మనీ దందా కేసులో పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, టీడీపీ నేత ముళ్లపూడి బాపిరాజు పాత్ర ఉందనే కోణంలో పోలీస్ దర్యాప్తు సాగుతోంది. రూ.కోటి వరకు బాపిరాజు పెట్టుబడి పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. కాల్‌మనీ నిందితుల్లో ఏ-6గా ఉన్న పెండ్యాల శ్రీకాంత్ బాపిరాజుకు అత్యంత సన్నిహితుడు. అతని పేరుతోనే ఈ పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఏలూరు సీఆర్‌రెడ్డి కళాశాలలో ఎంబీఏ చదివినప్పటి నుంచి వారిద్దరూ స్నేహితులు. నల్లజర్ల మండలం సోమాలమ్మ ఆలయం వద్ద ముళ్లపూడి వర్గీయులు గతంలో వేసిన రియల్ వెంచర్లో కూడా పెండ్యాల శ్రీకాంత్ స్లీపింగ్ పార్టనర్‌గా వ్యవహరించాడు. ముళ్లపూడి రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత ఆర్థిక వ్యవహారాలన్నీ శ్రీకాంత్ చూస్తుంటారన్న ప్రచారం ఉంది. జెడ్పీ చైర్మన్‌గా ప్రభుత్వం ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం వాహనం ఇచ్చిన తర్వాత గతంలో తాను వినియోగించిన ఇన్నోవా కారును శ్రీకాంత్‌కే బాపిరాజు ఇచ్చేశారు. దీన్ని బట్టి వారి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. శ్రీకాంత్ దొరికితే స్పష్టత : సీఐ ఉమాహేశ్వరరావు కాల్‌మనీ కేసులో ఏ-6 నిందితుడు పెండ్యాల శ్రీకాంత్ పట్టుబడితే పశ్చిగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు పాత్రపై స్పష్టత వస్తుందని కాల్‌మనీ కేసు పర్యవేక్షిస్తున్న విజయవాడ మాచవరం సీఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు.