
కాల్‌మనీ దందాలో టీడీపీ నేత ముళ్లపూడి
కాలాంతకుల వ్యాపారంలో పెట్టుబడి రూ.కోటి
జెడ్పీ చైర్మన్ బాపిరాజు బినామీ ఏ-6 శ్రీకాంత్
విచారణ జరుపుతున్నామన్న మాచవరం సీఐ
విజయవాడ : కాల్‌మనీ దందా కేసులో పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, టీడీపీ నేత ముళ్లపూడి బాపిరాజు పాత్ర ఉందనే కోణంలో పోలీస్ దర్యాప్తు సాగుతోంది. రూ.కోటి వరకు బాపిరాజు పెట్టుబడి పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. కాల్‌మనీ నిందితుల్లో ఏ-6గా ఉన్న పెండ్యాల శ్రీకాంత్ బాపిరాజుకు అత్యంత సన్నిహితుడు. అతని పేరుతోనే ఈ పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఏలూరు సీఆర్‌రెడ్డి కళాశాలలో ఎంబీఏ చదివినప్పటి నుంచి వారిద్దరూ స్నేహితులు. నల్లజర్ల మండలం సోమాలమ్మ ఆలయం వద్ద ముళ్లపూడి వర్గీయులు గతంలో వేసిన రియల్ వెంచర్‌లో కూడా పెండ్యాల శ్రీకాంత్ స్లీపింగ్ పార్టనర్‌గా వ్యవహరించాడు. ముళ్లపూడి రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత ఆర్థిక వ్యవహారాలన్నీ శ్రీకాంత్ చూస్తుంటారన్న ప్రచారం ఉంది. జెడ్పీ చైర్మన్‌గా ప్రభుత్వం ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం వాహనం ఇచ్చిన తర్వాత గతంలో తాను వినియోగించిన ఇన్నోవా కారును శ్రీకాంత్‌కే బాపిరాజు ఇచ్చేశారు. దీన్ని బట్టి వారి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో అర్థం చేసుకోవచ్చు.
శ్రీకాంత్ దొరికితే స్పష్టత : సీఐ ఉమాహేశ్వరరావు
కాల్‌మనీ కేసులో ఏ-6 నిందితుడు పెండ్యాల శ్రీకాంత్ పట్టుబడితే పశ్చిగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు పాత్రపై స్పష్టత వస్తుందని కాల్‌మనీ కేసు పర్యవేక్షిస్తున్న విజయవాడ మాచవరం సీఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు.