పొత్తు లేకుంటే బీజేపీకి సినిమా లేదు | Cold War Between TDP and BJP Leaders | Sakshi
Sakshi News home page

పొత్తు లేకుంటే బీజేపీకి సినిమా లేదు

Published Wed, Dec 30 2015 12:43 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

పొత్తు లేకుంటే బీజేపీకి సినిమా లేదు - Sakshi

పొత్తు లేకుంటే బీజేపీకి సినిమా లేదు

తాడేపల్లిగూడెం : దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుపై జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ఈ వ్యవహారం కాస్తా బీజేపీ, టీడీపీ నాయకుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేపింది. బీజేపీ జోలికొస్తే జెడ్పీ చైర్మన్‌కు తమ తడాఖా ఏమిటో చూపిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ మంగళవారం హెచ్చరిక జారీ చేశారు. బీజేపీ నాయకులతోకలసి పని చేయడానికి తాము సిద్ధమే కానీ.. టీడీపీ ఓటమికి కృషి చేసిన వారిని అక్కున చేర్చుకుని టీడీపీ నేతలను పక్కన పెడితే చూస్తూ ఊరుకునేది లేదని ముళ్లపూడి బాపిరాజు సవాల్ విసిరారు.
 
 పెంటపాడు మండలం ప్రత్తిపాడులో మంత్రులు శిద్ధా రాఘవరావు, పైడికొండల మాణిక్యాలరావు సమక్షంలో సోమవారం జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు చేసిన వ్యాఖ్యలు.. జెడ్పీ చైర్మన్, మంత్రి పైడికొండల మధ్య తలెత్తిన వాగ్వివాదం నేపథ్యంలో మంగళవారం బీజేపీ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వేర్వేరుగా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేశారు. ఒకరిపై ఒకరు ఘాటైన వ్యాఖ్యలు చేసుకున్నారు.
 
 పొత్తు లేకుంటే బీజేపీకి సినిమా లేదు : ముళ్లపూడి
 స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ టీడీపీతో పొత్తు లేకుంటే బీజేపీకి సినిమా లేదన్న సంగతి ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడులో మంత్రి, తనమధ్య కేవలం సమాచార లోపం వల్లే వాగ్వా దం జరిగిందన్నారు. బీజేపీ, టీడీపీ మధ్య గొడవలు అభివృద్ధిపై ప్రభావం చూపుతాయని కొందరు ఆందోళన చెందుతున్నారన్నారు. అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని, ఈ విషయంలో కొట్లాడుకునే ప్రశ్న కూడా లేదని అన్నారు.
 
  నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి మాణిక్యాలరావు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని, రాష్ట మంత్రి వర్గంలో మంత్రిగా మాణిక్యాలరావు, జెడ్పీ చైర్మన్‌గా తాను ఉన్నాం కాబట్టి అభివృద్ధి విషయంలో కలిసి పనిచేయాలన్నారు. పదేళ్లపాటు అధికారం లేకపోయినా, ఉప ఎన్నికలలో వైఎస్సార్ సీపీ విజయాలు సాధిస్తున్నా, టీడీపీ పోటీ చేస్తే గెలుస్తుందో లేదో అనే అనుమానం ఉన్న సందర్భంలో టీడీపీ విజయానికి కార్యకర్తలు కష్టపడ్డారన్నారు. తాడేపల్లిగూడెం సీటును బీజేపీకి కేటాయించడంతో ఆ అభ్యర్థిని గెలిపించేందుకు టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు కృషి చేశారన్నారు.
 
 అలాంటి వారిని దగ్గరకు తీసుకోవాలని మంత్రిని కోరామని చెప్పా రు. బీజేపీలో వేరే పార్టీ వాళ్లను చేర్చుకుని తమపై పెత్తనం చేయవద్దనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. జన్మభూమి కమిటీలు ఉండగా, వారిని కాదని బీజేపీలో చేరిన నాయకులు ప్రవర్తించడం వల్ల గ్రామాలలో వాతావరణం కలుషితమవుతోందన్నారు. ఇది తప్పని చెప్పినా కొందరు బరితెగించి, రాజ్యాంగేతర శక్తులుగా ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నారన్నారు. చిల్లర గొడవలు, చిల్లర వ్యక్తులను రెచ్చగొట్టి విలువైన సమయాన్ని వృథా చేయవద్దని జెడ్పీ చైర్మన్ సలహా ఇచ్చారు.
 
 మా తడాఖా చూపిస్తాం : శ్రీనివాసవర్మ
 జిల్లా బీజేపీ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ కార్యక్రమాలకు అతిథిగా వచ్చిన వ్యక్తులను గౌరవించడం సంప్రదాయమని, అందుకు విరుద్ధంగా మంత్రి శిద్ధా రాఘవరావును బాపిరాజు అవమానించడం సిగ్గుచేటని అన్నారు. ఏదైనా సమస్య ఉంటే రెండు పార్టీలకు జిల్లా కమిటీలు ఉన్నాయని, వాటి సమక్షంలో మనసు విప్పి మాట్లాడుకోవచ్చని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం ఏఎంసీ పాలకవర్గాన్ని ప్రకటించే సమయంలో మంత్రి మాణిక్యాల రావు అభిప్రాయం తీసుకున్నా, బీజేపీ వారికి కనీసం రెండు డెరైక్టర్ పదవులైనా ఇవ్వలేదన్నారు. సాగునీటి సంఘాల్లోనూ బీజేపీ కార్యకర్తలకు పదవులు ఇవ్వలేదన్నారు.
 
 మునిసిపల్ వైస్ చైర్మన్ విషయంలో మంత్రిని సంప్రదిం చారా, ఇది ఏ సంప్రదాయం అని నిలదీశారు. మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఎవరు వచ్చినా బీజేపీలో చేర్చుకుంటామని చెప్పారు. బీజేపీని, పార్టీ నాయకులను చులకనగా చూస్తే అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తుల కారణంగా రాష్ట్రంలో బీజేపీ నష్టపోయిందన్నారు. ‘బీజేపీతో పొత్తు గురించి మాట్లాడటానికి బాపిరాజుకున్న అర్హత ఏమిటి, బీజేపీ నాయకులుగా మా అనుభవం ఎంత, టీడీపీ నాయకునిగా  మీ అనుభవం ఎంత’ అని వర్మ ప్రశ్నిం చారు. ‘జెడ్పీ చైర్మన్‌ను కదా.. లోకేష్ చుట్టూ తిరుగుతున్నా కదా అనుకుంటున్నారేమో.
 
 బీజేపీపై పెద్దన్న పాత్ర పోషిద్దామనుకుంటే మా తడాఖా చూపిస్తాం’ అని వర్మ  హెచ్చరిం చారు. నిట్‌ను ఏలూరు తరలించేందుకు జెడ్పీ చైర్మన్ ప్రయత్నించడం నిజం కాదా అని నిలదీశారు. తాడేపల్లిగూడెంకు నిట్ తెచ్చి, అమృత్ పథకంలో ఈ మునిసిపాలిటీ పేరు చేర్చి, విమానాశ్రయం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న మంత్రి మాణిక్యాలరావును కలుపుకుని వెళ్లడం మాని చీఫ్ పాపులారిటీ కోసం పాకులాడితే వ్యతిరేకిస్తాం అని శ్రీనివాసవర్మ హెచ్చరించారు.
 
 టీడీపీ శ్రేణులు కలిసి వచ్చినా, రాకపోయినా రానున్న మూడున్నరేళ్లలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి మంత్రితోపాటు బీజేపీ కూడా పాటుపడుతుందన్నారు. ‘అగ్రెసివ్‌నెస్ కుటుంబంలో చెల్లుతుంది. ప్రజల్లోను, పార్టీలోను చెల్లదు. టీడీపీ విజయం వెనుక బీజేపీ, జనసేన ఉన్నాయన్న విషయాలను మర్చిపోకూడదు’ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ భిక్షతోనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని వర్మ వ్యాఖ్యానించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement