Pydikondala Manikyalarao
-
‘ప్రజల సొమ్ముతో బాబు సోకులు పడుతున్నాడు’
సాక్షి, పశ్చిమగోదావరి: చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తూ.. మోదీ సభను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ మాజీ ఎంపీ పైడికొండల మాణిక్యాల రావు ధ్వజమెత్తారు. గన్నవరం విమానాశ్రయం ఎదురుగా, రాష్ట్రవ్యాప్తంగా ‘నో ఎంట్రీ మోదీ’, ‘గో బ్యాక్ మోదీ’ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ సభను అడ్డుకోవడానికి చంద్రబాబు ఆర్టీసీ, ఆటో యూనియన్లను వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ నెల 11న ఢిల్లీలో చంద్రబాబు చేయబోయే ధర్మపోరాట దీక్షకు జనాలను తరలించడానికి.. ఇప్పటికే రెండు రైళ్లకు రూ.1.12 కోట్లు మంజూరు చేశారని మండిపడ్డారు. ప్రజా ధనంతో ఆర్టీసీ ద్వారా 7 నక్షత్రాల బస్సు కొనిపించుకున్న చంద్రబాబు.. సామన్య బస్సుగా ప్రజలను మభ్య పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కష్టార్జితంతో చంద్రబాబు సోకులు పడుతున్నారంటూ విమర్శించారు. -
ఎమ్మెల్యే రాజీనామా.. చంద్రబాబుకు అల్టిమేటం
సాక్షి, పశ్చిమ గోదావరి : బీజేపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి పైడి కొండల మాణిక్యాలరావు రాజీనామా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ తీరుకు నిరసనగానే రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు పరచడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నియోజకవర్గానికి ఇచ్చిన సుమారు 56 హామీలు నెరవేర్చనందుకే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. 15 రోజుల్లోగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలని అల్టిమేటం జారీ చేశారు. మాణిక్యాలరావు తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాడేపల్లిగూడెం నియోజవర్గానికి చెందిన పలు సమస్యల పరిష్కారానికై 3 నెలలుగా చంద్రబాబు చుట్టూ తిరుగతున్నా పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. మంగళవారం ఉదయం మాణిక్యాలరావు మీడియాతో మాట్లాడారు. ‘15 రోజుల్లోగా సీఎం స్పందించకపోతే 16వ రోజు నుంచి నిరాహారదీక్షకు దిగుతా. మీరు ఈ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలకు సంబంధించిన వివరాలతో కూడిన పత్రాన్ని పంపిస్తున్నా. ఇలాంటి శాసనసభలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా. తాడేపల్లి గూడెంలో మీ తెలుగుదేశం పార్టీ లేనందుకే ఎటువంటి అభివృద్ధి పనులు చేయడం లేదని భావిస్తున్నా. నన్ను తొలగించి అయినా సరే ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చండి. నా రాజీనామాను మీరే స్పీకర్‌కు పంపించండి’ అని వాఖ్యానించారు. -
‘ఆ భావన తీసుకొచ్చేందుకే చంద్రబాబు కృషి’
సాక్షి, ఏలూరు/పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడం లేదనే భావన తీసుకొచ్చేందుకు చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేతలు మండిపడ్డారు. టీడీపీ అసత్య ప్రచారాన్ని ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం’లో కేంద్ర పథకాలను వివరించాలని కోరారు. అశోక్‌నగర్‌లోని బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరైన ఎంపీ గోకరాజు గంగరాజు, మాజీ మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, కావూరి సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. పూటకో పార్టీతో పొత్తుకునే చంద్రబాబు బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులను బీజేపీపై నెట్టాలని చూస్తున్నారని ద్వజమెత్తారు. ఆయన సత్తా తేలిపోయింది.. రాబోయే కాలంలో నుంచి 7 నుంచి 8 మంది మంత్రులు, 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడబోతున్నారని మాణిక్యాలరావు అన్నారు. చంద్రబాబు సత్తా ఏమిటో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయిందనీ, ఆయనకు ప్రజలు తగిన బుద్ది చెప్పారని వ్యాఖ్యానించారు. ‘రాఫెల్ ఒప్పందంలో అబద్ధాన్ని పదేపదే చెప్పి రాహుల్ ప్రజల్ని నమ్మించే యత్నం చేశారు. అందుకే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి రాఫెల్ పేరుతో కాంగ్రెస్ కుట్రకు పాల్పడిందనే అనుమానాలు కలుగుతున్నాయి’అని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని అభూత కల్పనలు చేసినా, ఎంత డబ్బు వెదజల్లినా ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. తెలంగాణలో మాదిరిగానే 2019 ఎన్నికల్లో కూడా టీడీపీకి ఘోర పరాభావం తప్పదని జోస్యం చెప్పారు. ఏపీలో కూడా మహా కూటమికి ఘోర పరాజయం పాలవుతుందన్నారు. -
‘బీజేపీ సభలకు వెళ్తే రేషన్ కట్ చేస్తారా’
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో అరాచక శక్తులు పెరిగిపోయాయని బీజేపీ నేతలు దినేష్ రెడ్డి, సుధీష్ రాంబొట్ల విమర్శలు గుప్పించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ పాలనపై నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావును గృహ నిర్బంధం చేయడమే కాకుండా ఆయనను పరామర్శించేందుకు వెళ్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను రోడ్డుపైనే నిర్బంధించడం బాధాకరమని దినేష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పై అధికారులు చెప్పడం వల్లనే కన్నాను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. ఆయన పట్ల అమర్యాదగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. ముళ్లపూడి బాపిరాజుతో బహిరంగ చర్చకు వెళ్తున్న మాజీ మంత్రి మాణిక్యాల రావును నిర్బంధించాల్సిన అవసరమేంటని సుధీష్ రాంబొట్ల ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక మాజీ మంత్రికే ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే... ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకున్న సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ సభలకు వెళ్లిన వారిని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారనీ, రేషన్ కార్డులను తొలగిస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారని నిప్పులు చెరిగారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి పెడితే మంచదని హితవు పలికారు. ఆంద్రప్రదేశ్‌కు సాయం చేసేందుకు కేంద్ర సర్కారు సిద్ధంగా ఉందని అన్నారు. -
పొత్తు లేకుంటే బీజేపీకి సినిమా లేదు
తాడేపల్లిగూడెం : దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుపై జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ఈ వ్యవహారం కాస్తా బీజేపీ, టీడీపీ నాయకుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేపింది. బీజేపీ జోలికొస్తే జెడ్పీ చైర్మన్‌కు తమ తడాఖా ఏమిటో చూపిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ మంగళవారం హెచ్చరిక జారీ చేశారు. బీజేపీ నాయకులతోకలసి పని చేయడానికి తాము సిద్ధమే కానీ.. టీడీపీ ఓటమికి కృషి చేసిన వారిని అక్కున చేర్చుకుని టీడీపీ నేతలను పక్కన పెడితే చూస్తూ ఊరుకునేది లేదని ముళ్లపూడి బాపిరాజు సవాల్ విసిరారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడులో మంత్రులు శిద్ధా రాఘవరావు, పైడికొండల మాణిక్యాలరావు సమక్షంలో సోమవారం జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు చేసిన వ్యాఖ్యలు.. జెడ్పీ చైర్మన్, మంత్రి పైడికొండల మధ్య తలెత్తిన వాగ్వివాదం నేపథ్యంలో మంగళవారం బీజేపీ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వేర్వేరుగా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేశారు. ఒకరిపై ఒకరు ఘాటైన వ్యాఖ్యలు చేసుకున్నారు. పొత్తు లేకుంటే బీజేపీకి సినిమా లేదు : ముళ్లపూడి స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ టీడీపీతో పొత్తు లేకుంటే బీజేపీకి సినిమా లేదన్న సంగతి ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడులో మంత్రి, తనమధ్య కేవలం సమాచార లోపం వల్లే వాగ్వా దం జరిగిందన్నారు. బీజేపీ, టీడీపీ మధ్య గొడవలు అభివృద్ధిపై ప్రభావం చూపుతాయని కొందరు ఆందోళన చెందుతున్నారన్నారు. అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని, ఈ విషయంలో కొట్లాడుకునే ప్రశ్న కూడా లేదని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి మాణిక్యాలరావు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని, రాష్ట మంత్రి వర్గంలో మంత్రిగా మాణిక్యాలరావు, జెడ్పీ చైర్మన్‌గా తాను ఉన్నాం కాబట్టి అభివృద్ధి విషయంలో కలిసి పనిచేయాలన్నారు. పదేళ్లపాటు అధికారం లేకపోయినా, ఉప ఎన్నికలలో వైఎస్సార్ సీపీ విజయాలు సాధిస్తున్నా, టీడీపీ పోటీ చేస్తే గెలుస్తుందో లేదో అనే అనుమానం ఉన్న సందర్భంలో టీడీపీ విజయానికి కార్యకర్తలు కష్టపడ్డారన్నారు. తాడేపల్లిగూడెం సీటును బీజేపీకి కేటాయించడంతో ఆ అభ్యర్థిని గెలిపించేందుకు టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు కృషి చేశారన్నారు. అలాంటి వారిని దగ్గరకు తీసుకోవాలని మంత్రిని కోరామని చెప్పా రు. బీజేపీలో వేరే పార్టీ వాళ్లను చేర్చుకుని తమపై పెత్తనం చేయవద్దనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. జన్మభూమి కమిటీలు ఉండగా, వారిని కాదని బీజేపీలో చేరిన నాయకులు ప్రవర్తించడం వల్ల గ్రామాలలో వాతావరణం కలుషితమవుతోందన్నారు. ఇది తప్పని చెప్పినా కొందరు బరితెగించి, రాజ్యాంగేతర శక్తులుగా ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నారన్నారు. చిల్లర గొడవలు, చిల్లర వ్యక్తులను రెచ్చగొట్టి విలువైన సమయాన్ని వృథా చేయవద్దని జెడ్పీ చైర్మన్ సలహా ఇచ్చారు. మా తడాఖా చూపిస్తాం : శ్రీనివాసవర్మ జిల్లా బీజేపీ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ కార్యక్రమాలకు అతిథిగా వచ్చిన వ్యక్తులను గౌరవించడం సంప్రదాయమని, అందుకు విరుద్ధంగా మంత్రి శిద్ధా రాఘవరావును బాపిరాజు అవమానించడం సిగ్గుచేటని అన్నారు. ఏదైనా సమస్య ఉంటే రెండు పార్టీలకు జిల్లా కమిటీలు ఉన్నాయని, వాటి సమక్షంలో మనసు విప్పి మాట్లాడుకోవచ్చని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం ఏఎంసీ పాలకవర్గాన్ని ప్రకటించే సమయంలో మంత్రి మాణిక్యాల రావు అభిప్రాయం తీసుకున్నా, బీజేపీ వారికి కనీసం రెండు డెరైక్టర్ పదవులైనా ఇవ్వలేదన్నారు. సాగునీటి సంఘాల్లోనూ బీజేపీ కార్యకర్తలకు పదవులు ఇవ్వలేదన్నారు. మునిసిపల్ వైస్ చైర్మన్ విషయంలో మంత్రిని సంప్రదిం చారా, ఇది ఏ సంప్రదాయం అని నిలదీశారు. మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఎవరు వచ్చినా బీజేపీలో చేర్చుకుంటామని చెప్పారు. బీజేపీని, పార్టీ నాయకులను చులకనగా చూస్తే అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తుల కారణంగా రాష్ట్రంలో బీజేపీ నష్టపోయిందన్నారు. ‘బీజేపీతో పొత్తు గురించి మాట్లాడటానికి బాపిరాజుకున్న అర్హత ఏమిటి, బీజేపీ నాయకులుగా మా అనుభవం ఎంత, టీడీపీ నాయకునిగా మీ అనుభవం ఎంత’ అని వర్మ ప్రశ్నిం చారు. ‘జెడ్పీ చైర్మన్‌ను కదా.. లోకేష్ చుట్టూ తిరుగుతున్నా కదా అనుకుంటున్నారేమో. బీజేపీపై పెద్దన్న పాత్ర పోషిద్దామనుకుంటే మా తడాఖా చూపిస్తాం’ అని వర్మ హెచ్చరిం చారు. నిట్‌ను ఏలూరు తరలించేందుకు జెడ్పీ చైర్మన్ ప్రయత్నించడం నిజం కాదా అని నిలదీశారు. తాడేపల్లిగూడెంకు నిట్ తెచ్చి, అమృత్ పథకంలో ఈ మునిసిపాలిటీ పేరు చేర్చి, విమానాశ్రయం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న మంత్రి మాణిక్యాలరావును కలుపుకుని వెళ్లడం మాని చీఫ్ పాపులారిటీ కోసం పాకులాడితే వ్యతిరేకిస్తాం అని శ్రీనివాసవర్మ హెచ్చరించారు. టీడీపీ శ్రేణులు కలిసి వచ్చినా, రాకపోయినా రానున్న మూడున్నరేళ్లలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి మంత్రితోపాటు బీజేపీ కూడా పాటుపడుతుందన్నారు. ‘అగ్రెసివ్నెస్ కుటుంబంలో చెల్లుతుంది. ప్రజల్లోను, పార్టీలోను చెల్లదు. టీడీపీ విజయం వెనుక బీజేపీ, జనసేన ఉన్నాయన్న విషయాలను మర్చిపోకూడదు’ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ భిక్షతోనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని వర్మ వ్యాఖ్యానించారు. -
'నిట్' తాత్కాలిక తరగతులు ప్రారంభం
తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి): పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిట్ తాత్కాలిక తరగతులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, తాడేపల్లిగూడెంలోని వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో తరగతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలోని విమానాశ్రయ భూముల్లో నిట్ శాశ్వత భవనం నిర్మించేందుకు కేంద్రం అనుమతి తెలిపింది. దీంతో అక్కడ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన సంగతి తెలిసిందే. -
'రూ.26 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్'
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వెల్లడించారు. ఆయన బుధవారం తాడేపల్లిగూడెంలో విలేకరులతో మాట్లాడారు. రూ.26 కోట్లు వెచ్చించి నిర్మించే ఈ పాఠశాలలో కార్పొరేట్‌కు దీటుగా విద్యనందిస్తామని చెప్పారు. నిరుపేదల బాలల్లో డ్రాపౌవుట్స్ను నివారించేందుకు అన్ని వసతులను ఈ పాఠశాలలో కల్పిస్తామని తెలిపారు. అలాగే, తాడేపల్లిగూడెంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను కూడా ఏర్పాటుచేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కేంద్రంలో విద్యావంతులైన యువతీ యువకులకు భాష, వృత్తి పరమైన అంశాలపై నిపుణులచే శిక్షణ ఇస్తారని మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. -
పవన్ ట్వీట్లపై నేను వ్యాఖ్యానించను: మంత్రి
పశ్చిమగోదావరి: సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్వీట్ల పై తాను మాట్లాడదలచుకోలేదని మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ నిర్మించ తలపెట్టిన నూతన రాజధాని నిర్మాణానికి రైతులు ఒప్పుకోకపోయినా భూసేకరణ తప్పదని చెప్పారు. రాజధాని నిర్మాణం కావాలంటే భూమాలు కావాల్సిందేనని తేల్చి చెప్పారు. పార్లమెంటులో భూసేకరణ చట్టాన్ని అన్యాయంగా అడ్డుకున్నది కాంగ్రెస్సేనని ఆయన మండిపడ్డారు. ఇకపై కాంగ్రెస్ నేతలకు రోడ్డుపై తిరిగే పరిస్థితి కూడా ఉండదని విమర్శించారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఛీకొట్టినా వారికి బుద్ధి రాలేదని మంత్రి మాణిక్యాలరావు ఎద్దేవా చేశారు. -
పుష్కరాలకు ఢోకా లేదు
మోదీ రావడం లేదు అమిత్‌షా, ఉప రాష్ర్టపతి వస్తారు మంత్రి మాణిక్యాలరావు వెల్లడి సాక్షి ప్రతినిధి, ఏలూరు :నవ్యాంధ్రప్రదేశ్ ఖ్యాతిని ఇనుమడించే విధంగా గోదావరి పుష్కరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. పుష్కరాల నేపథ్యంలో మంగళవారం ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. పుష్కరాలకు ఆరు రోజులే గడువున్నా ఏర్పాట్లు కొలిక్కి రాని విషయాన్ని ప్రస్తావించగా.. పుష్కర ఘాట్లకు సంబంధించి నూరు శాతం పనులు పూర్తయ్యాయని చెప్పుకొచ్చారు. ఎక్కడైనా చిన్నచిన్న ప్యాచ్ వర్క్స్ మిగిలి ఉండొచ్చని, అవి రెండు మూడు రోజుల్లో పూర్తవుతాయని అన్నారు. రోడ్ల పనులు మాత్రం కొంత ఆలస్యంగా జరుగుతున్న మాట వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. పుష్కర ఘాట్లను, జాతీయ రహదారిని కలుపుతూ చేపట్టిన రోడ్డు పనులు పుష్కరాలు ముగిసే నాటికైనా కొలిక్కి వచ్చే పరిస్థితి లేదనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లగా.. వాటికి పుష్కర ఏర్పాట్లకు సంబంధం లేదన్నారు పుష్కరాల తర్వాతైనా రోడ్లు బాగు చేసుకోవచ్చని, నిధులు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు చేసుకున్నా ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు. దేవాదాయ శాఖ ద్వారా జిల్లాలో 134.7 కోట్లతో 211 పనులు చేపట్టగా, దాదాపు అన్నీ పూర్తయ్యాయని తెలిపారు. కొవ్వూరులో ఏర్పాటు చేస్తున్న విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లికార్జునస్వామి, సింహాద్రి అప్పన్న నమూనా ఆలయాలు పుష్కరాలకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చెప్పారు. మోదీ రావడం లేదు పుష్కరాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే అవకాశం లేదని మంత్రి మాణిక్యాలరావు స్పష్టం చేశారు. జూన్ 16న విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మోదీ విచ్చేస్తున్నా ఆ కార్యక్రమం తర్వాత బెనారస్ వెళ్తారని, అటు నుంచి విదేశాలకు వెళ్తారని మంత్రి చెప్పారు. ఉప రాష్ట్రపతి అన్సారీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, సుమారు 15మంది కేంద్రమంత్రులు పుష్కరాలకు విచ్చేస్తున్నారని తెలిపారు. -
‘మంత్రి గారూ.. ఈ లెటర్ పనిచేయదండీ’
ఈ మధ్యన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒకాయన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వెళ్తూ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సిఫార్సు లేఖ తీసుకెళ్లారట. వెళ్లేది తిరుమలకు. తీసుకువెళ్లేది దేవుడి మినిస్టర్ లెటర్. ఇంకేముంది. అలా స్వామి వారి దర్శనమైపోయి.. ఇలా బయటకు వచ్చేయొచ్చని ఎంతో సంబరపడిపోయారట. జేబులో మంత్రి సిఫార్సు లేఖ పెట్టుకుని గుండెల నిండా ధైర్యంతో తిరుమలకు వెళ్లిన ఆయనకు అక్కడి టీటీడీ అధికారులు చుక్కలు చూపించారు. ‘సారీ అండీ. ఈ లెటర్ పనిచేయదండీ’ అంటూ ఎంతో మర్యాదగానే మంత్రి గారి లేఖను తోసిపుచ్చారట. మంత్రి లెటర్ పట్టుకుని ఎంతో నమ్మకంతో పిల్లాపెద్దలతో చాలామంది తిరుమలకు వచ్చామని, ఈసారికి ఎలాగోలా దర్శనం టికెట్లు ఇమ్మని ఎన్నిసార్లు.. ఎన్నిరకాలుగా వేడుకున్నా సదరు అధికారులు మాత్రం కాసింతైనా కనికరించలేదట. ఇది ఆ ఒక్క భక్తుడి కష్టమే కాదు. ఇటీవల మంత్రి లెటర్లు తీసుకువెళ్లిన చాలా మందికి ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని చెబుతున్నారు. ఏకంగా దేవాదాయ శాఖ మంత్రి సిఫార్సు లేఖలనే మొహమాటం లేకుం డా తిరస్కరించడం వెనుక చాలా ‘మాటలు’ ఉన్నాయట. టీటీడీకి చెందిన ఓ ఉన్నతాధికారితో మంత్రి మాణిక్యాలరావుకు వచ్చిన మా ట పట్టింపు వల్లే ఆయన ఇచ్చే లెటర్లకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని అంటున్నారు. మరోవైపు మంత్రి మాత్రం అసలు సిఫార్సు లేఖలను తాను ప్రోత్సహించ దలుచుకోలేదని, మొత్తంగా అందరి సిఫార్సు లేఖలు ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటానని చెబుతున్నారు. అది ప్రాక్టికల్‌గా ఎంతవరకు సాధ్యమో పక్కన పెడితే దేవుళ్ల శాఖ మంత్రి నుంచి సామాన్య భక్తులు ఆశించేదేముంటుంది? ఎప్పుడో తిరుమలకో.. శ్రీశైలానికో లెటర్లు తీసుకోవడం తప్ప. ఈ విషయంలో టీడీటీ చైర్మన్ కనుమూరి బాపిరాజును కచ్చితంగా అభినందించాల్సిందే. ఈయన జిల్లా నుంచి, ప్రత్యేకించి తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నరసాపురం నుంచి వెళ్లిన భక్తులకు తృప్తిగా శ్రీవారి దర్శనం చేయించేవారని చెబుతుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా తిరుమలలో వ్యక్తిగతంగా ఓ ఉద్యోగిని కూడా పెట్టారని అంటుంటారు. ఈ సిఫార్సు లేఖల వ్యవస్థ సరైనదా లేదా అనే విషయాన్ని కదిలిస్తే కందిరీగల పుట్టను కదిలించినట్టే. మనం దాని జోలికి పోవొద్దు. కానీ మంత్రి గారూ.. మీరనుకున్న సిఫార్సు లేఖలు లేని ‘వ్యవస్థ’ వచ్చేవరకైనా గోదావరి జిల్లా వాసులను, సామాన్య భక్తుల అవస్థలను కాస్త కనిపెట్టుకోండి. -
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మాణిక్యాలరావు
ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రిగా పైడికొండ మాణిక్యాలరావు ఆదివారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం శ్రీశైలం, అన్నవరం, విజయవాడ దేవస్థానాల్లో 5 వేల మందికి అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన ఫైల్‌పై మాణిక్యాలరావు తొలిగా సంతకం చేశారు. మాణిక్యాలరావు మాట్లాడుతూ... దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపడతామని తెలిపారు. అందుకోసం విశ్రాంత ఐఏఎస్ అధికారులతో ఓ కమిటీ వేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి దేవాలయానికి సంబంధించిన ఆస్తులతోపాటు... దేవాలయాలకు అవుతున్న వ్యయాలను వెబ్సైట్లో పెడతామని పైడికొండల మాణిక్యాలరావు వివరించారు. -
'సామాన్యులకు భగవంతుడిని చేరువచేస్తా'
ఆలయాల్లో భగవంతుడి దర్శనాన్ని సామన్యులకు చేరువచేయటానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన హైద్రాబాద్ నుంచి విలేకరితో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలు వీఐపీల సేవతో తరిస్తుంటే సామాన్యభక్తులు భగవంతుడిని దర్శిం చుకోవటానికి నానా పాట్లు పడుతున్నారని చెప్పారు. ఆలయానికి వెళితే భగవంతుని కనులారా వీక్షించాం.. మనసారా ధ్యానించాం.. అనే భావన సంపూర్ణంగా కలిగేలా ఆలయాలను తీర్చిదిద్దుతానని తెలిపారు. దేవాలయాలు ధార్మిక సంస్థలుగా రూపుదిద్దుకుని భగవంతునికి, భక్తులకు సేవలందించేలా చూస్తానన్నారు. దేవాదాయశాఖలో అవినీతిని రూపుమాపి, ఆలయాల ఆస్తుల కబ్జాలను నిరోధించటానికి అధిక ప్రాధాన్యత ఇస్తానన్నారు. ఈ విషయాలకు సంబంధించి ధార్మిక సంస్థలు, పీఠాధిపతులు, మీడియా నుంచి సలహాలు స్వీకరించి శాఖలోని అవలక్షణాలు, అవకతవకలు సరిచేయడానికిగాను కార్యాచరణ రూ పొందిస్తానని వివరించారు. ఇలాంటి విషయాల్లో నిర్మాణాత్మక సలహాలు ఎవరిచ్చినా స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఉండే అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు. ఇతర విభాగాల సిబ్బంది సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేస్తానని చెప్పారు. భగవంతునికి విస్తృతంగా సేవచేసుకునే అవకాశం కలిగించే శాఖ తనకు రావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు ఇద్దరికీ వారి అభిరుచికి అనువైన శాఖలను టీడీపీ అధినేత చంద్రబాబు కేటాయించారని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.