మోదీ రావడం లేదు
అమిత్‌షా, ఉప రాష్ర్టపతి వస్తారు
మంత్రి మాణిక్యాలరావు వెల్లడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు :నవ్యాంధ్రప్రదేశ్ ఖ్యాతిని ఇనుమడించే విధంగా గోదావరి పుష్కరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. పుష్కరాల నేపథ్యంలో మంగళవారం ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. పుష్కరాలకు ఆరు రోజులే గడువున్నా ఏర్పాట్లు కొలిక్కి రాని విషయాన్ని ప్రస్తావించగా.. పుష్కర ఘాట్లకు సంబంధించి నూరు శాతం పనులు పూర్తయ్యాయని చెప్పుకొచ్చారు. ఎక్కడైనా చిన్నచిన్న ప్యాచ్ వర్క్స్ మిగిలి ఉండొచ్చని, అవి రెండు మూడు రోజుల్లో పూర్తవుతాయని అన్నారు. రోడ్ల పనులు మాత్రం కొంత ఆలస్యంగా జరుగుతున్న మాట వాస్తవమేనని మంత్రి అంగీకరించారు.
పుష్కర ఘాట్లను, జాతీయ రహదారిని కలుపుతూ చేపట్టిన రోడ్డు పనులు పుష్కరాలు ముగిసే నాటికైనా కొలిక్కి వచ్చే పరిస్థితి లేదనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లగా.. వాటికి పుష్కర ఏర్పాట్లకు సంబంధం లేదన్నారు పుష్కరాల తర్వాతైనా రోడ్లు బాగు చేసుకోవచ్చని, నిధులు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు చేసుకున్నా ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు. దేవాదాయ శాఖ ద్వారా జిల్లాలో 134.7 కోట్లతో 211 పనులు చేపట్టగా, దాదాపు అన్నీ పూర్తయ్యాయని తెలిపారు. కొవ్వూరులో ఏర్పాటు చేస్తున్న విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లికార్జునస్వామి, సింహాద్రి అప్పన్న నమూనా ఆలయాలు పుష్కరాలకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చెప్పారు.
మోదీ రావడం లేదు
పుష్కరాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే అవకాశం లేదని మంత్రి మాణిక్యాలరావు స్పష్టం చేశారు. జూన్ 16న విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మోదీ విచ్చేస్తున్నా ఆ కార్యక్రమం తర్వాత బెనారస్ వెళ్తారని, అటు నుంచి విదేశాలకు వెళ్తారని మంత్రి చెప్పారు. ఉప రాష్ట్రపతి అన్సారీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, సుమారు 15మంది కేంద్రమంత్రులు పుష్కరాలకు విచ్చేస్తున్నారని తెలిపారు.
పుష్కరాలకు ఢోకా లేదు
Published Wed, Jul 8 2015 1:27 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM
Advertisement
Advertisement