Vice-President
-
యూపీ ఎన్నికలు.. మోదీ కీలక నిర్ణయం!
లక్నో: వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి రాజకీయాల్లో కీలక పరిణామాలు మొదలయ్యాయా?. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా తన ఆప్తుడు, మాజీ ఐఏఎస్ అధికారి, ఏకే శర్మను సిఫార్సు చేశారు. దీంతో శర్మ నియామకాన్ని పార్టీ అధిష్టానం ధృవీకరిస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. యూపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ శనివారం కీలక పదవులకు సంబంధించిన నేతల పేర్లను ప్రకటించారు. శర్మతో పాటు రాష్ట్ర పార్టీ కార్యదర్శులుగా లక్నోకు చెందిన అర్చనా మిశ్రా, బులంద్ షహర్‌కు చెందిన అమిత్ వాల్మీకిని నియమిస్తున్నట్లు తెలిపారు. గుజరాత్లో ఐఏఎస్ అధికారిగా పనిచేసిన ఏకే శర్మ.. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కాగా, ఏకే శర్మ స్వస్థలం యూపీలోని మావ్. వైబ్రంట్ గుజరాత్ తదితర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి, అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీకి చేరువయ్యాడు శర్మ. ఆమధ్య తన నియోజకవర్గం వారణాసిలో కరోనా సమీక్ష కోసం శర్మనే, నరేంద్ర మోదీ పంపడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఈమధ్య యూపీ కేబినేట్ విస్తరణ ఊహాగానాల్లో ఏకే శర్మకు స్థానం దక్కుతుందని అంతా భావించారు కూడా. ఇక తన నియామకంపై ఏకే శర్మ ప్రధానికి, పార్టీకి కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద శనివారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలుసుకున్నారు. పార్టీని పటిష్టం చేయడంపై చర్చించామన్నారు. కాగా, వీరిది మర్యాదపూర్వక భేటీ అని అధికార వర్గాలు తెలిపాయి. యోగి హయాంలో యూపీ పాలనపై, కరోనా కట్టడిలో విఫలమయ్యిందన్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం మార్పులు చేయబోతోందని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే అదంతా మీడియా సృష్టేనని బీజేపీ నేతలు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తేల్చేశారు. చదవండి: యోగికి బెదిరింపు కాల్ -
టీ మా ఉపాధ్యక్షురాలిగా పూజిత
సాక్షి, సిటీబ్యూరో: ‘తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (టీ మా) ఉపాధ్యక్షురాలిగా నటి జె.పూజిత నియమితులయ్యారు. ఈ మేరకు ‘తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’(టీఎఫ్‌సీసీ) అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆదివారం ఆమెకు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘టీఎఫ్‌సీసీ అనుబంధమైన టీ మా ఉపాధ్యక్షురాలిగా పూజితను నియమించామని, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగే వరకూ ఆమె ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతారని అన్నారు. పూజిత మాట్లాడుతూ... ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, ఇతర సభ్యులకు కృతజ్ఞతలు.బాధ్యతగా పనిచేసి నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా’’ అని అన్నారు. కార్యక్రమంలో టీఎఫ్‌సీసీ ఉపాధ్యక్షుడు ఎత్తరి గురురాజ్, కార్యదర్శి కాచం సత్యనారాయణ, టీమా అధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
కన్నతల్లి రుణం తీర్చుకుంటా!
నెల్లూరు సిటీ: నా సొంత ఊరు.. పెరిగిన ఊరు.. ఎదిగిన ఊరిని అభివృద్ధి చేసుకోవడం కన్నతల్లి రుణం తీర్చుకోవడమేనని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. నగరంలోని ఇరుకళ పరమేశ్వరి దేవస్థానం నుంచి స్వర్ణాలచెరువు చుట్టూ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డును బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అమృత్ పథకం కింద రూ.30 కోట్లతో నెక్లెస్‌రోడ్డు నిర్మాణం జరుగుతోందన్నారు. ఇక్కడ మహనీయుల గుర్తుగా విగ్రహాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు నెక్లెస్ రోడ్డుకు సంబంధించి 70 శాతం పనులు మాత్రమే జరిగాయన్నారు. గ్రామాభివృద్ధి కోసమేఆ శాఖను తీసుకున్నాను గ్రామాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూశానని గ్రామాలను అభివృద్ధి పథంలో నిలిపేందుకే గ్రామాభివృద్ధి శాఖ తీసుకున్నానని తెలిపారు. స్వచ్ఛభారత్ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. తన కుమార్తె దీపా వెంకట్ నెల్లూరు నెక్ట్స్ కార్యక్రమం ద్వారా అన్ని రాజకీయ పార్టీ నాయకులతో సమావేశమై నెల్లూరు అభివృద్ధికి కృషి చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, స్వర్ణభారత్ ట్రస్ట్ నిర్వాహకురాలు దీపా వెంకట్, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, టీడీపీ నగర, రూరల్ ఇన్‌చార్జ్‌లు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, ఆదాలప్రభాకర్రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, కామినేని శ్రీనివాస్, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పనులు పూర్తికాకుండానే ప్రారంభోత్సవం నెక్లెస్ రోడ్డు పనులు 50 శాతం కూడా పూర్తికాకుండా మంత్రి నారాయణ హడావుడిగా ప్రారంభోత్సవం చేయించడంపై నగర ప్రజలు విస్తుపోతున్నారు. నెక్లెస్ రోడ్డు ప్రారంభోత్సవానికి హాజరైన ప్రజలు పనులు జరుగుతుండడం చూసి నోరెళ్లబెట్టారు. ఈ రోడ్డు ప్రారంభోత్సవానికి రెండు రోజులు ముందు నుంచి రేయింబవళ్లు రోడ్డు, టైల్స్ పనులు చేశారు. హడావుడిగా పనులు చేయడంతో నాసిరకంగా నిర్మాణాలు సాగాయి. -
ఉచిత విద్యుత్ సరికాదు..
సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్ లాంటి హామీల కంటే నిరంతర విద్యుత్ ఇవ్వడం ప్రయోజనకరమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) సంస్థ హైదరాబాద్‌లో ‘క్లీన్ అండ్ సేఫ్ న్యూక్లియర్ పవర్ జనరేషన్’ అంశంపై తలపెట్టిన మూడ్రోజుల అంతర్జాతీయ సదస్సును వెంకయ్యనాయుడు బుధవారం ప్రారంభించి ప్రసంగించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతర విద్యుదుత్పత్తిపై కాకుండా, ఉచిత విద్యుత్ మీద దృష్టి పెడుతున్నాయని, అది మంచిది కాదన్నారు. నాణ్యమైన, నిరంతర విద్యుత్‌తోనే ప్రజలకు మేలు అని వెంకయ్య అన్నారు. అభివృద్ధికి విద్యుత్ అవసరం దేశంలో విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోం దని వెంకయ్య తెలిపారు. వేగంగా సాగుతున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ దృష్ట్యా స్థిరమైన అభివృద్ధి సాధించేందుకు, సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన అవసరముందన్నారు. ప్రమాదకరమైన గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించేందుకు, అంతర్జాతీయ సమాజం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు అణుశక్తిని పెంచుకోవాలన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తక్కువ ఖర్చుతో లభించే అణుశక్తిని సమర్థమైన శక్తి వనరుగా ఉపయోగించుకోవాలని చెప్పారు. ప్రస్తుతం అణుశక్తి కర్మాగారాలు చౌకగా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. కూడంకులం అణువిద్యుత్ యూనిట్–1 ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్ ధర యూనిట్‌కి రూ.3 ఉంటుందని తెలిపారు. భారత్‌లో అణుశక్తి అభివృద్ధిలో డాక్టర్ హోమి జే బాబా కృషి ఎంతో ఉందన్నారు. ఆయన నిర్దేశించిన విధానంలో దేశం బలమైన 3 దశల అణు విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తూ అద్భుతమైన పురోగతి సాధించిందని, తక్కువ ధర లో స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నారు. ప్రజా ఉద్యమంగా స్వచ్ఛ భారత్.. ప్రస్తుతం దేశంలో స్వచ్ఛభారత్ ప్రభుత్వ కార్యక్రమం స్థాయి నుంచి ప్రజా ఉద్యమంగా మారిందని వెంకయ్య చెప్పారు. ఈ విషయంలో ప్రజలకు మరింత అవగాహనను పెంపొందిచడంలో శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇంజనీర్లు కృషి చేయాలని సూచించారు. ఆరోగ్యవంతమైన భారత్ ఆర్థికంగానూ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. దేశంలో పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీర్ఘకాలంలో మనమంతా ప్రకృతితో ఆడుకున్నామని, ఇప్పుడు ప్రకృతి మనతో ఆడుకుంటోందన్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోవటం మనందరి బాధ్యతని అన్నారు. కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, భారత ప్రభుత్వ మాజీ ప్రిన్సిపల్ సైంటిఫిక్ సలహాదారు ఆర్.చిదంబరం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అధ్యక్షుడు శిశిర్ కుమార్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రత్యర్థులే.. శత్రువులు కాదు’
ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): పార్లమెంట్ సభ్యులు సభలో ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ఈ విషయాన్ని గౌరవ సభ్యులంతా గమనించి అర్థవంతమైన చర్చకు వేదికలుగా లోక్‌సభ, రాజ్యసభలను నిలపాలని ఆయన ఆకాంక్షించారు. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం రుషికొండలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో ‘ఉపరాష్ట్రపతితో ఉపాహా రం’ పేరుతో నిర్వహించిన మిత్రుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పార్టీలు, వ్యక్తిగత ప్ర యోజనాలు ఎజెండాగా జరుగుతున్న రాద్ధాంతాల కారణంగా విలువైన సమయం వృథాగా మారుతుందని వ్యాఖ్యానించారు. ఈ దశలో రాజ్యసభను సమర్థవంతంగా నిర్వహిం చేందు కు ప్రయత్నిస్తున్నానన్నారు. కేంద్ర, రాష్ట్రాలమధ్య సంబంధాలు పార్టీలకతీతంగా ఉండాలని, ఆ దిశగా ప్ర భుత్వాలు, పార్టీలు పరస్పర సహకారాన్ని అందించుకోవాలన్నారు. ప్రొటోకాల్‌తో ప్రజలకు చేరువ కాలేకపోతున్నా తొలినుంచి ప్రజలతో దగ్గరగా మెలిగే మనస్తత్వమున్న తాను ప్రొటోకాల్ కారణంగా ప్రస్తుతం జనానికి చేరువ కాలేకపోవడం కొంత బాధను కలిగిస్తోందన్నారు. అయినా తన పరిధిలో సేవ చేసేందుకు ప్రణాళికలు వేసుకున్నానని చెప్పారు. దేశంలోని విశ్వవిద్యాలయాల్లో పర్యటించి విద్యార్థులతో మమేకమై దేశ భవిష్యత్‌పై మార్గనిర్దేశం చేస్తున్నానన్నారు. దేశంలోని రీసెర్చ్ సెంటర్లను సందర్శించి సాంకేతికత ఆవశ్యకత, ఆవిష్కరణలు వంటి అంశాలపై యువశాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తున్నానని చెప్పారు. వ్యవసాయం లాభసాటి కాదని రైతులు అభిప్రాయపడుతున్నందున అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల సహకారంతో పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నామన్నారు. ప్రాచీన విద్యావిధాన విశిష్టతను విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. దేశాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేసే నిర్ణయాలు బలంగా జరగాలన్నారు. మన దేశ జనాభాలో 65 శాతం యువతే ఉన్నందున వారి ఆలోచనలు, ఆవిష్కరణలతో అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా ప్రభుత్వాలు దారులు వేయాలన్నారు. కార్యక్రమంలో కేంద్ర మాజీమంత్రి అశోక్‌గజపతిరాజు, రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. విశాఖతో ప్రత్యేక అనుబంధం విశాఖ నగరంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, తన అభ్యున్నతి అంతా మిత్రుల, శ్రేయోభిలాషుల ప్రోత్సాహమేనన్నారు. ఈ సందర్భంగా విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు 4 ఏళ్ల ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. -
25న ఉపరాష్ట్రపతి పర్యటన
భువనేశ్వర్ ఒరిస్సా : భారత ఉపరాష్ట్రపతి ఈ నెల 25న రాష్ట్ర పర్యటనకు విచ్చేస్తున్నారు. స్థానిక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) తొలి కాన్వొకేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విచ్చేస్తున్నారు. లోగడ ఈ కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అనివార్య కారణాలతో కార్యక్రమం వాయిదా పడడంతో ఈ నెల 25వ తేదీన నిర్వహిస్తున్నారు. ఉపరాష్ట్రపతి రాష్ట్ర పర్యటనను పురస్కరించుకుని బ్లూ బుక్ మార్గదర్శకాల మేరకు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి నగరంలో సుమారు 4 నుంచి 5 గంటలు మాత్రమే పర్యటిస్తారు. ఈ వ్యవధిలో అవాంఛనీయ సంఘటనల నివారణ దృష్ట్యా 25 ప్లాటూన్ల పోలీసు దళాల్ని ప్రత్యేకంగా మోహరిస్తున్నారు. న్యూ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విచ్చేసే ఉప రాష్ట్రపతి ప్రత్యక్షంగా రాజ్ భవన్‌కు వెళ్లి కార్యక్రమం వేదిక ప్రాంగణం ఎయిమ్స్‌కు చేరుకుంటారని జంట నగరాల పోలీస్ కమిషనర్ సత్యజిత్ మహంతి తెలిపారు. కార్యక్రమం ముగియడంతో స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి న్యూ ఢిల్లీ తిరిగి వెళ్తారని ఉపరాష్ట్రపతి కార్యక్రమం వివరాల్ని సంక్షిప్తంగా వివరించారు. -
ఒక్క సిక్కింకే వెళ్లలేదు!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి నేడు ఏడాది పూర్తిచేసుకుంటున్న వెంకయ్యనాయుడు అరుదైన ఘనత సాధించారు. ఆయనకు ముందు పదేళ్లు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన హమీద్ అన్సారీ తన పదవీకాలంలో 26 రాష్ట్రాల్లో పర్యటించారు. కానీ వెంకయ్య ఏడాది కాలంలో ఒక్క సిక్కిం మినహా మిగిలిన 28 రాష్ట్రాల్లో పర్యటించారు. సిక్కిం పర్యటనకూ బయల్దేరిన వెంకయ్య ప్రతికూల వాతావరణం వల్ల అర్ధంతరంగా వెనుదిరిగారు. వెంకయ్య సిక్కిం మినహా అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించగా, అన్సారీ మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, అస్సాంలోనే పర్యటించారు. -
టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడి ఆత్మహత్య
డిచ్పల్లి(నిజామాబాద్‌రూరల్) : టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు యలమంచిలి ఈశ్వరరావు (61) గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్సై నవీన్‌కుమార్ కథనం ప్రకారం.. డిచ్పల్లి మండలం ధర్మారం(బి)కి చెందిన ఈశ్వరరావుకు భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఆయన.. ఇటీవలే ధర్మారం (బి) శివారులో హార్టెస్వర్ సర్వీస్ షాపు ప్రారంభించాడు. అయితే, కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనకు సుమారు ఆర్నెల్ల క్రితం బైపాస్ సర్జరీ జరిగింది. అయినప్పటికీ ఇటీవల ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. ఈ నేపథ్యంలోనే జీవితంపై విరక్తితో ఇంటి వరండాలో గల ఉయ్యాల కొక్కానికి తాడుతో ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు నిజామాబాద్‌కు తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందారు. ‘రియల్’ కారణం ? ఈశ్వరరావు చాలా కాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. హార్వెస్టర్ షాపును ప్రారంభించిన ఆయన ఇటీవలే దాన్ని ఇతరులకు ఇచ్చి వేశారు. భూములపై పెట్టిన డబ్బులు తిరిగి రాకపోవడం, అప్పులు పెరిగి పోవడం, బైపాస్ సర్జరీ ఇలా అన్ని రకాలుగా ఒత్తిడి పెరగ డంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు పేర్కొంటున్నారు. -
ఆర్థిక మోసాలపై చర్చలకు చోటెక్కడ..?
న్యూఢిల్లీ: దేశ ప్రతిష్టను కాపాడాలంటే బ్యాంకు స్కాంలు, ఇతర మోసాలపై పార్లమెంటులో చర్చ జరగాలని ఉప రాష్ర్టపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. అయితే చట్టసభల్లో వీటిపై అర్థవంతమైన చర్చలు జరగకుండా విలువైన సభా సమయం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం క్రెడాయ్ వార్షిక సమావేశంలో ఆయన ప్రసంగించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మార్చి 5 న పంజాబ్ నేషనల్ బ్యాంకు మోసంపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. నీరవ్ మోదీ, చోక్సీ, విజయ్ మాల్యాల ఆర్థిక మోసాలతో అంతర్జాతీయంగా దేశం ప్రతిష్ట మసకబారిందని వెంకయ్య అన్నారు. మోసాలు, కుంభకోణాలు ఏ ప్రభుత్వ హయాంలో జరిగాయన్నది కాదు...వాటిపై ఆయా ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేమిటన్నదే ముఖ్యమన్నారు . నల్ల కుబేరులకు రియల్ రంగంలో చోటివ్వొద్దని క్రెడాయ్ సభ్యులకు వెంకయ్య సూచించారు. -
రాష్ట్రపతి వేతనం రూ.5 లక్షలు
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వేతనాలు భారీగా పెరిగాయి. రాష్ట్రపతి వేతనం నెలకు రూ.5 లక్షలకు, ఉపరాష్ట్రపతి వేతనం నెలకు రూ.4 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే గవర్నర్ల వేతనం రూ.3.5 లక్షలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రపతికి నెలకు రూ.1.50 లక్షలు, ఉపరాష్ట్రపతికి 1.25 లక్షలు, గవర్నర్లకు రూ.1.10 లక్షల చొప్పున జీతాలు చెల్లిస్తున్నారు. ఈ వేతనాల పెంపును బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ..వారి జీతభత్యాలు చివరిసారి 2006 జనవరి 1న పెరిగిన సంగతిని గుర్తుచేశారు. రెండేళ్ల క్రితం ఏడో వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చినప్పటి నుంచి కేబినెట్ కార్యదర్శి, ఇతర కార్యదర్శులు రాష్ట్రపతి కన్నా ఎక్కువ వేతనాలు పొందుతున్న సంగతి తెలిసిందే. ఎంపీలకు డబుల్ ధమాకా... ఎంపీల మూల వేతనాలు రెట్టింపు కానున్నాయి. వచ్చే ఏప్రిల్ 1 నుంచి వారి మూలవేతనాన్ని ప్రస్తుతమున్న రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచుతూ తాజా బడ్జెట్లో జైట్లీ ప్రతిపాదించారు. వారికిచ్చే ఇతర భత్యాలను కూడా పెంచనున్నారు. ద్రవ్యోల్బణం ఆధారంగా ఐదేళ్లకోసారి ఎంపీల వేతనాలు, భత్యాలను ఆటోమేటిక్‌గా సవరించేందుకు కూడా జైట్లీ కొత్త చట్టాన్ని ప్రతిపాదించారు. ఎంపీల వేతనాల పెంపుపై ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతులు విమర్శలకు దారితీస్తున్నాయని అన్నారు. అందుకే వచ్చే ఏప్రిల్ 1 నుంచి ఎంపీల వేతనాలు, నియోజకవర్గాల భత్యం, కార్యాలయాల ఖర్చులు, సమావేశాల భత్యాలను సవరించే విధానాల్లో మార్పులు తెస్తున్నట్లు ప్రకటించారు. -
ఉపరాష్ట్రపతికి 21న పౌర సన్మానం
హైదరాబాద్: భారత ఉపరాష్ట్రపతి వెంటయ్యనాయుడుకు తెలంగాణ ప్రభుత్వం పౌర సన్మానం చేయనుంది. ఈ నెల 21వ తేదీన రాజ్‌భవన్‌లో కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం తరపున జరిగే ఆ కార్యక్రమం అనంతరం దిల్కుషా భవనంలో విందు ఉంటుందని తెలిపింది. ఈ నెల 11 వ తేదీన వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. -
సగం మందికే 'ప్రమోషన్'!
ఉపరాష్ట్రపతి పదవి అలంకరించిన 12 మందిలో ఆరుగురు మాత్రమే రాష్ట్రపతులయ్యారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి మహ్మద్ హమీద్ అన్సారీ సహా మిగిలిన ఆరుగురికి అత్యున్నత రాజ్యాంగ పదవి చేపట్టే అవకాశం రాలేదు. మొదటి ముగ్గురుసర్వేపల్లి రాధాకృష్ణన్, జాకిర్ హుస్సేన్, వీవీ గిరి రాష్ట్రపతులయ్యాక, ఆ తర్వాత ముగ్గురికి (గోపాల్ స్వరూప్ పాఠక్, బసప్ప దానప్ప జట్టి, మహ్మద్ హిదాయతుల్లా) ఆ అదృష్టం దక్కలేదు. తర్వాత వరుసగా ఉపరాష్ట్రపతులైన ముగ్గురూ (ఆర్.వెంకట్రామన్, శంకర్‌దయాళ్ శర్మ, కేఆర్ నారాయణన్) రాష్ట్రపతి పదవిని అధిష్టించారు. కాని, ఇప్పటికి చివరి ముగ్గురుకె.కృష్ణకాంత్, భైరోసింగ్ షెఖావత్, మహ్మద్ హమీద్ అన్పారీ రాష్ట్రపతి భవన్లో ఐదేళ్ల చొప్పున నివాసముండే అవకాశం దక్కించుకోలేకపోయారు. ‘ప్రమోషన్’ పొందిన ‘మొదటి’ ముగ్గురు! మొదటి ఉపరాష్ట్రపతిగా పదేళ్లు చేపిన సర్వేపల్లి రాధాకృష్టన్ పదవీకాలం ముగిసిన వెంటనే 1962లో రాష్ట్రపతి అయ్యారు. తర్వాత ఉపరాష్ట్రపతిగా ఉన్న జాకిర్ హుస్సేన్ కూడా 1967లో కాంగ్రెస్ మద్దతుతో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేసిన తెలుగువాడైన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు నుంచి హుస్సేన్ గట్టి పోటీ ఎదుర్కున్నారు. హుస్సేన్ పదవి చేపట్టిన రెండేళ్లకే మరణించడంతో ఉపరాష్ట్రపతి వీవీ గిరీని అదృష్టం వరించింది. 1969 రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ ‘అధికార’ అభ్యర్థి, ఆంధ్రపదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిని ఓడించడానికి ప్రధాని ఇందిరాగాంధీ నడుం బిగించారు. ‘ఉప’ పదవికి గిరితో రాజీనామా చేయించాక రాష్ట్రపతి పదవికి నామినేషన్ వేయించి ‘అంతరాత్మ ప్రబోధం’ పేరుతో గెలిపించారు. ‘రెండో’ ముగ్గురికి దక్కని చాన్స్! తర్వాత ముగ్గురికి రాష్ట్రపతి అయ్యే భాగ్యం దక్కలేదు. నాలుగో ఉపరాష్ట్రపతి అయిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జీఎస్ పాఠక్, తర్వాత ఈ పదవి అధిష్టించిన బీడీ జట్టి, ఐదో వైస్‌ప్రెసిడెంట్ మహ్మద్ హిదాయతుల్లా(సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్)ను రాష్ట్రపతిని చేయాలనే ఆలోచన రాజకీయపార్టీలకు రాలేదు. పాఠక్, హిదయతుల్లా ‘ప్రమోషన్’కు ప్రయత్నించలేదు. మైసూరు మాజీ సీఎం అయిన జట్టికి 1977లో కాంగ్రెస్ ఓటమి ఆ అవకాశం ఇవ్వలేదు. ‘మూడో’ ముగ్గురూ ‘ప్రథమ పౌరులయ్యారు’! ఆ తర్వాత ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన ముగ్గురూ కేంద్ర మంత్రులుగా పనిచేసినవారే. 1982లో ఇందిర ప్రధానిగా ఉండగా ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన కేంద్ర మాజీ మంత్రి ఆర్. వెంకట్రామన్ మూడేళ్లకే 1987లో ప్రధాని రాజీవ్‌గాంధీ నిర్ణయంతో రాష్ట్రపతి అయ్యారు. ఆయన తర్వాత ఉపరాష్ట్రపతిగా ఉన్న మాజీ గవర్నర్ ఎస్డీ శర్మ పదవీ కాలం ముగిసే సమయానికి 1992లో కాంగ్రెస్ అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీచేసి గెలిచారు. తర్వాతి ఉపరాష్ట్రపతి కేఆర్ నారాయణన్ కూడా 1997లో దాదాపు అన్ని పారీ్టల మద్దతుతో తొలి ‘దళిత’ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ‘నాలుగో’ ముగ్గురికీ అందని అదృష్టం! యునైటెడ్ ఫ్రంట్ ప్రధాని ఐకే గుజ్రాల్ హయాంలో(1997లో) ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ కృష్ణకాంత్ ఉపరాష్ట్రపతి అయ్యారు. 2002లో అప్పటి ఏపీ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు మద్దతుతో రాష్ట్రపతి పదవికి అభ్యర్థి అయ్యే అవకాశం మొదట కనిపించింది. తర్వాత కొన్ని పరిణామాల వల్ల పదవి ఆయనకు అందినట్టే అంది జారిపోయింది. మహారాష్ట్ర మాజీ గవర్నర్ పీసీ అలెగ్జాండర్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వ్యతిరేకించడంతో ఏపీజే అబ్దుల్ కలాం పేరు చివరకు ఖాయమైంది. కృష్ణకాంత్ తర్వాత పదవిలోకి వచ్చిన షెఖావత్ 2007 రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రతిభా పాటిల్‌పై పోటీచేసి ఓడిపోయారు. తర్వాత యూపీఏ, వామపక్షాల మద్దతుతో ఉపరాష్ట్రపతి అయిన మాజీ గవర్నర్ ఎంహెచ్ అన్పారీని 2012లో సోనియా రాష్ట్రపతిగా చేయాలని భావించినా చివరికి ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీకి అవకాశమిచ్చారు. అన్సారీ నొచ్చుకోకుండా రెండోసారి ఆయనను ఉపరాష్ట్రపతిని చేశారని అంటారు. పైన చెప్పిన 12 మంది ఉపరాష్ట్రపతుల్లో ముగ్గురు ముగ్గురు చొప్పున ఆరుగురు రెండు విడతలుగా రాష్ట్రపతులయ్యారు. మరి ఈ ‘ఆనవాయితీ’ కొనసాగితే ఆగస్ట్ ఐదున జరిగే ఎన్నికలో గెలుపు ఖాయమనుకుంటున్న ఎం. వెంకయ్యనాయుడికి ప్రమోషన్ లభిస్తుందా? అన్నది భవిష్యత్ కాలమే నిర్ణయిస్తుంది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ఇన్ఫీకి రితికా సూరి గుడ్‌బై!
ఎగ్జిక్యూటివ్ వైస్–ప్రెసిడెంట్ పదవికి రాజీనామా... న్యూఢిల్లీ: దేశీ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ‘ఇన్ఫోసిస్’లో ఏదో జరుగుతోంది. వేతన ప్యాకేజ్, కార్పొరేట్ గవర్నెన్స్, విలీనాలు, ఉద్యోగాల కోత, రాజీనామాలు ఇలా పలు అంశాలకు సంబంధించి గత కొన్ని నెలలుగా సంస్థ ఎప్పుడూ వార్తల్లో ఉంటూ వస్తోంది. తాజాగా ఇప్పుడు కంపెనీ నుంచి రితికా సూరి వైదొలిగారనే వార్త వైరల్ అయ్యింది. కంపెనీలో ఎగ్జిక్యూటివ్ వైస్–ప్రెసిడెంట్‌గా(ఈవీపీ) వ్యవహరిస్తున్న ఆమె తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఆటోమేషన్ సంస్థ పనాయ కొనుగోలులో సూరి కీలక పాత్ర పోషించారు. ఎస్ఏపీకి చెందిన ఈ మాజీ ఎగ్జిక్యూటివ్‌ను విశాల్ సిక్కా 2014 సెప్టెంబర్‌లో ఇన్ఫీలోకి ఆహ్వానించారు. తర్వాత ఆమె ఈవీపీగా (కార్పొరేట్ డెవలప్మెంట్ అండ్ వెంచర్స్) పదోన్నతి పొందారు. స్టార్టప్‌లలో ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి వీలుగా ఇన్ఫోసిస్ 500 మిలియన్ డాలర్ల వెంచర్ ఫండ్ ఏర్పాటు చేసింది. ఇందులోనూ సూరి కీలకపాత్ర వహించారు. విశ్వాసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రితికా సూరి గతవారం తన రాజీనామా లేఖను మేనేజ్మెంట్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆమె పదవి నుంచి ఎందుకు వైదొలుగుతున్నారో తెలియడం లేదు. పనాయ డీల్‌కు ఇన్ఫీ ఎక్కువగా చెల్లించిందనే విమర్శలొచ్చాయి. దీనిపై గిబ్సన్ డన్ అండ్ క్రూచర్ సంస్థ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది. ఇది ఇన్ఫోసిస్‌కు క్లీన్చిట్ ఇచ్చింది. అయితే ఇన్ఫోసిస్ ఈ రాజీనామా వార్తలపై స్పందించలేదు. కాగా ఇన్ఫోసిస్ అమెరికాస్ హెడ్ సందీప్ డెడ్లాని కొద్ది రోజుల క్రితం సంస్థ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు రితికా సూరి తన పదవికి రాజీనామా చేశారు. -
వెంకయ్యకు పెద్ద పరీక్షే: చంద్రబాబు
- ఆయన రాజకీయాలు మాట్లాడకుండా కంట్రోల్‌గా ఉండాలి - ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనందుకు అభినందనలు సాక్షి, అమరావతి : గలగలా రాజకీయాలు మాట్లాడే వెంకయ్యనాయుడికి ఉపరాష్ట్రపతిగా రాజకీయాలు మాట్లాడకుండా ఉండటం పెద్ద పరీక్షని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆయన జీవనం మొత్తం రాజకీయమేనని, దానితో ఇప్పటికిప్పుడు వెంటనే తెగతెంపులు చేసుకోవాలంటే కష్టమేనన్నారు. ఆ పరీక్షలో ఆయన పాసవుతారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం రాత్రి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్యనాయుడికి ఫోన్‌చేసి హృదయ పూర్వక అభినందనలు తెలిపినట్లు చెప్పారు. ఆయన్ను ఎంపిక చేసిన ప్రధానికి, ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలకు అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లడం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందా అని ప్రశ్నించగా... అభివృద్ధిలో నష్టం ఉంటుందనుకోనని, కానీ రాజకీయాల్లో ఇబ్బందులు ఉంటాయని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో కొందరు సరిగా ఓటు వేయకపోవడంపై స్పందిస్తూ... తమ పార్టీ వారికి నాలుగైదు సార్లు అవగాహన కల్పించానని, వారు అక్కడికెళ్లి ఏంచేశారో తనకు తెలియదన్నారు. ఎమ్మెల్యేలు ఓటు వేయలేకపోవడం రాష్ట్రానికే అవమానమన్నారు. శ్రీలంకలో ఏపీ ఇండస్ట్రియల్ పార్కు పెడతాం: ఫార్మా, టూరిజం, హార్టికల్చర్ రంగాల్లో కలిసి పనిచేయాలని శ్రీలంక, ఏపీ నిర్ణయించాయి. తమ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి 600 ఎకరాల్లో ఏపీ కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నట్లు శ్రీలంక ప్రకటించింది. శ్రీలంక నుంచి వచ్చిన పారిశ్రామిక ప్రతినిధుల బృందం సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. -
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు
- ఆసియా-యూరప్ సమావేశ సదస్సులో హమీద్ అన్సారీ - ఫ్రాన్స్ ఉగ్రదాడి మృతులకు సదస్సు నివాళి ఉలాన్బాటర్: ఉగ్రవాదంపై అంతర్జాతీయ సమాజం ఉక్కుపాదం మోపాలని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పిలుపునిచ్చారు. మంగోలియా రాజధాని ఉలాన్‌బాటర్‌లో 11వ ఆసియా-యూరప్ సమావేశ సదస్సు (ఏఎస్‌ఈఎం)లో ప్రసంగిస్తూ.. ‘ఉగ్రవాదానికి ఆర్థికంగా సాయం చేసేవారు, బాధ్యత వహించేవారు, దాడులకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. మన సమాజానికి ఉగ్రవాద పెనుభూతం హెచ్చరికలు చేస్తోంది. దీన్ని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు ఏకమై పోరాడాలి. ఉగ్రవాదం కోరలను పీకేయాలి’ అని పేర్కొన్నారు. శుక్రవారం మొదలైన ఈ సదస్సులో భారత్ సహా 49 దేశాలు పాల్గొంటున్నాయి. ఫ్రాన్స్‌లోని నీస్‌లో జరిగిన ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించి సదస్సును ప్రారంభించారు. ఆసియా, యూరప్ దేశాల మధ్య రాజకీయ, భద్రత, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఏఎస్‌ఈఎం ఏర్పడి 20 ఏళ్లు కావస్తుండటంతోపాటు.. మంగోలియన్ రాజ్యం ఏర్పడి 810 ఏళ్లు పూర్తయిన వేడుకలు కూడా ఈ సందర్భంగా జరగనున్నాయి. వివిధ దేశాల ప్రతినిధులతోపాటు ఈయూ, ఆసియాన్ల ప్రతినిధులూ ఇందులో పాల్గొన్నారు. -
నాగార్జున అగ్రికెం పరిశ్రమలో ప్రమాదం
ఎచ్చెర్ల : అరిణాం అక్కివలస పరిధిలోని నాగార్జున అగ్రికెం పరిశ్రమలో గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. ఉదయం ఏ షిఫ్ట్ నడుస్తున్న సమయంలో 6.30 గంటలకు సల్ఫ్యూరిక్ యూసిడ్ పైపు లీకైంది. దీని నుంచి తుంపర్లు వెలువడి ఆ ప్రాంతంలో పని చేస్తున్న ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. వెంటనే పరిశ్రమకు చెందిన అంబులెన్స్‌లో శ్రీకాకుళంలోని సింధూర ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో శాంతారావు, రామకృష్ణ, వెంకటేష్, సంతోష్, వెంకటరావు ఉన్నారు. అరుుతే పరిశ్రమ యూజమాన్యం ఈ సంఘటనను గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసింది. కార్మికులు క్షేమం... ప్రమాదం అనంతరం విషయం బయటకు పొక్కడంతో పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ సి.వరదరాజులు విలేకరులతో మాట్లాడారు. కర్మాగారంలో చిన్న ప్రమాదం చోటు చేసుకుందని, గాయపడ్డ కార్మికులు క్షేమంగా ఉన్నారని చెప్పారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కూడా అయ్యూరని తెలిపారు. పరిశ్రమలో అంగుళం ఉండే యూసిడ్ పైప్ లీక్ వల్ల ఈ సంఘటన చోటు చేసుకుందన్నారు. గాయపడ్డ వారిని సింధూర ఆస్పత్రిలో చేర్చామని ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని వైద్యులు ధ్రువీకరించారని చెప్పారు. ఆయన వెంట డీజీఎం కోటేశ్వరరావు ఉన్నారు. ఇదిలా ఉండగా కార్మికులకు ప్రమాదకర గాయూలేమీ కాలేదని అందుకే డిశ్చార్జి చేశామని సింధూర ఆస్పత్రి వైద్యాధికారి పీబీ కామేశ్వరరావు చెప్పారు. తరచూ ప్రమాదాలు... నాగార్జున అగ్రికెం కెమికల్ పరిశ్రమలో తరచూ ప్రమాదాలు జరుగుతుండటం స్థానికుల్లో ఆందోళన కల్గిస్తుంది. గురువారం యూసిడ్ పైపు లీక్ వల్ల ఐదుగురు గాయపడ్డారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. మ రో పక్క పరిశ్రమలో పెద్ద పేలుడు జరిగిందని ప్రచారం జరిగింది. పరిశ్రమ యాజమాన్యం స్పందించే వరకు ప్రమాద సంఘటనపై స్పష్టత రాలేదు. గతంలో ఓ రెండు పెద్ద ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనను స్థానికులు గుర్తు చేసుకున్నారు. 2002 జూన్ 30న ఐదో బ్లాక్‌లో రియాక్టర్ పేలుడు చోటు చేసుకొని 18 మంది గాయపడ్డారు. 2014 జనవరి 1న రెండో బ్లాకులో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి. రియాక్టర్ మూడో ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌పై పడింది. ప్రస్తుతం పైప్ లీక్ సంఘటనలో కార్మికులు క్షేమంగా బయటపడటంతో పరిశ్రమ యాజమాన్యం, కార్మికుల కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. -
ఉగ్రవాదంపై పోరుకు గట్టి సంకల్పం: అన్సారీ
బ్యాంకాక్: ఉగ్రవాదంపై పోరుకు ప్రపంచదేశాలన్నీ ఏకభావనతో కదలిరావాలనీ ఆ దిశగా భారతదేశం ఎప్పుడూ గట్టిసంకల్పంతో కృషిచేస్తుందని భారత ఉపరాష్ట్రపతి అన్సారీ అన్నారు. తన మూడురోజుల పర్యటనలో భాగంగా ఆయన గురువారం బ్యాంకాక్ చేరుకున్నారు. ప్రఖ్యాత చౌలాలాంగ్కార్న్ విశ్వవిద్యాలయంలో అన్సారీ థాయ్మేధావులను, వాణిజ్యవేత్తలనుద్దేశించి ప్రసంగించారు. దక్షిణచైనా సముద్ర జలాల్లో తలెత్తుతున్న ఉద్రిక్త పరిస్థితుల పట్ల భారత్ ఆవేదన చెందుతోందన్నారు. -
సహనమే ఆయుధం
ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ మలప్పురం(కేరళ): వివాదరహిత సమాజ నిర్మాణంలో సహనమే ప్రధాన ఆయుధమని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ స్పష్టంచేశారు. మతాల మధ్య అంతరాలను తొలగిస్తే అసహనం అనేది ఉండదన్నారు. భిన్నత్వం కలిగి ఉన్న మన సమాజంలో సహనంతో దేన్నైనా స్వీకరించే, అన్ని మతాలను అర్థం చేసుకునేతత్వాన్ని ప్రజల్లో పెంపొందిచాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారమిక్కడ ‘అసహనం’పై ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మతాల మధ్య ఘర్షణ నివారణకు సహనం.. ధర్మం, స్వేచ్ఛలా పనిచేస్తుందన్నారు. -
పుష్కరాలకు ఢోకా లేదు
మోదీ రావడం లేదు అమిత్‌షా, ఉప రాష్ర్టపతి వస్తారు మంత్రి మాణిక్యాలరావు వెల్లడి సాక్షి ప్రతినిధి, ఏలూరు :నవ్యాంధ్రప్రదేశ్ ఖ్యాతిని ఇనుమడించే విధంగా గోదావరి పుష్కరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. పుష్కరాల నేపథ్యంలో మంగళవారం ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. పుష్కరాలకు ఆరు రోజులే గడువున్నా ఏర్పాట్లు కొలిక్కి రాని విషయాన్ని ప్రస్తావించగా.. పుష్కర ఘాట్లకు సంబంధించి నూరు శాతం పనులు పూర్తయ్యాయని చెప్పుకొచ్చారు. ఎక్కడైనా చిన్నచిన్న ప్యాచ్ వర్క్స్ మిగిలి ఉండొచ్చని, అవి రెండు మూడు రోజుల్లో పూర్తవుతాయని అన్నారు. రోడ్ల పనులు మాత్రం కొంత ఆలస్యంగా జరుగుతున్న మాట వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. పుష్కర ఘాట్లను, జాతీయ రహదారిని కలుపుతూ చేపట్టిన రోడ్డు పనులు పుష్కరాలు ముగిసే నాటికైనా కొలిక్కి వచ్చే పరిస్థితి లేదనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లగా.. వాటికి పుష్కర ఏర్పాట్లకు సంబంధం లేదన్నారు పుష్కరాల తర్వాతైనా రోడ్లు బాగు చేసుకోవచ్చని, నిధులు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు చేసుకున్నా ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు. దేవాదాయ శాఖ ద్వారా జిల్లాలో 134.7 కోట్లతో 211 పనులు చేపట్టగా, దాదాపు అన్నీ పూర్తయ్యాయని తెలిపారు. కొవ్వూరులో ఏర్పాటు చేస్తున్న విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లికార్జునస్వామి, సింహాద్రి అప్పన్న నమూనా ఆలయాలు పుష్కరాలకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చెప్పారు. మోదీ రావడం లేదు పుష్కరాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే అవకాశం లేదని మంత్రి మాణిక్యాలరావు స్పష్టం చేశారు. జూన్ 16న విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మోదీ విచ్చేస్తున్నా ఆ కార్యక్రమం తర్వాత బెనారస్ వెళ్తారని, అటు నుంచి విదేశాలకు వెళ్తారని మంత్రి చెప్పారు. ఉప రాష్ట్రపతి అన్సారీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, సుమారు 15మంది కేంద్రమంత్రులు పుష్కరాలకు విచ్చేస్తున్నారని తెలిపారు. -
ఐసిఎఐ వైఎస్ ప్రెసిడెంట్ దేవరాజారెడ్డికి సన్మానం!
-
నల్లగొండ పురపీఠం హస్తగతం
- రెండో రోజూ వాయిదా పడిన సూర్యాపేట ఎన్నిక - అదేదారిలో మిర్యాలగూడ వైస్‌చైర్మన్.... నల్లగొండ టుటౌన్: నల్లగొండ మున్సిపాలిటీని కాం గ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన 8వ వార్డు కౌన్సిలర్ బొడ్డుపల్లి లక్ష్మీశ్రీనివాస్, వైస్ చైర్మన్‌గా 38వ వార్డు కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం 11గంటలకు విపక్ష పార్టీల కౌన్సిలర్లు మున్సిపల్ సమావేశ మందిరంలోకి చేరుకోగా కాంగ్రెస్ కౌన్సిలర్లు 22 మంది స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి 11.30వచ్చారు. అనంతరం తెలుగు అక్షరమాల ప్రకారం కౌన్సిలర్లతో నల్లగొండ ఆర్డీఓ, ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి జహీర్ ప్రమాణం చేయించారు. అంతకు ముందే కాంగ్రెస్, విపక్షాల నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను ఎన్నికల ప్రిసైడింగ్ అధికారికి అందజేశారు. ప్రమాణ స్వీకా రం చేసిన అనంతరం ఎన్నికల అధికారి మొదట విపక్ష కూటమి నుంచి చైర్మన్ అభ్యర్థిని ప్రతిపాధించాలని కోరారు. దీంతో 40వ వార్డు నుంచి గెలిచిన కౌన్సిలర్ గున్రెడ్డి రాధికను ప్రతిపాదించగా 18మంది మద్దతు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా 36వ వార్డు కౌన్సిలర్ ఎం.నవీన్‌కుమార్ బొడ్డుపల్లి లక్ష్మిని ప్రతిపాధించగా 29వ వార్డు కౌన్సిలర్ ఎ.ప్రదీప్‌నాయక్ బలపర్చారు. ఆమెకు 22 మంది కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మద్దతు పలికారు. దీంతో ఎన్నికల అధికారి బొడ్డుపల్లి లక్ష్మి చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం వైఎస్ చైర్మన్ ఎన్నికకు అభ్యర్థి నూకల వెంకట్నారాయణరెడ్డిని ప్రతి పాధించాలని ఎన్నికల అధికారి కోరగా ఎవరూ స్పందించలేదు. ఆ తరువాత కాంగ్రెస్ నుంచి వైస్ చైర్మన్ అభ్యర్థిని ప్రతిపాధించి, బలపర్చాలని కోరగా 37వ వార్డు కౌనిల్సర్ ఖయ్యుంబేగ్ 38వ వార్డు కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డిని ప్రతిపాధించారు. 35వ వార్డు కౌన్సిలరు దుబ్బ అశోక్‌సుందర్ బలపర్చారు. శ్రీనివాస్‌రెడ్డికి 22మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. ఆ తరువాత సీపీఎం నుంచి వైస్ చైర్మన్ అభ్యర్థిగా ఎండి.సలీంను అదే పార్టీ కౌన్సిలర్ ఎ.రవీందర్ ప్రతిపాధించగా, టీడీపీ 20వ వార్డు కౌన్సిలర్ మోహిన్ బలపర్చారు. ఆయనకు మద్దతుగా 18 మంది చేతులు ఎత్తారు. దీంతో అధిక మంది కౌన్సిలర్ల మద్దతు పొందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి వైస్ చైర్మన్‌గా ఎన్నికయినట్లు ఎన్నికల అధికారి జహీర్ ప్రకటించారు. ఆ తరువాత చైర్మన్, వైస్ చైర్మన్లకు ఎన్నిక ధువీకరణ పత్రాలు అందజేశారు. చైర్‌పర్సన్‌గా ఎన్నికైన లక్ష్మితో పాటు వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డిని ఎమ్మెల్యే కోమటిరెడ్డి తదితరులు అభినందించారు. -
‘పుర’పై పట్టు ఎవరిదో?
సాక్షిప్రతినిధి, నల్లగొండ :మున్సిపల్ రాజకీయం వేడెక్కింది. మరోరోజు గడిస్తే, మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎవరికి వారు ఆ పదవులు దక్కించుకునేందుకు క్యాంపులు నెరపుతున్నారు. కాంగ్రెస్‌కు క్లియర్ మెజారిటీ ఉన్న నల్లగొండలాంటి చోట కూడా కౌన్సిలర్లను క్యాంప్‌నకు తరలించారు. హుజూర్నగర్, దేవరకొండ నగర పంచాయతీల్లో ఎలాంటి క్యాంప్‌లు లేకున్నా, అక్కడ మెజారిటీ సాధించిన కాంగ్రెస్‌లోనే పదవుల కోసం పోటీ ఏర్పడింది. మిర్యాలగూడ మున్సిపాలిటీలో సైతం కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ ఉంది. ఇక, మిగిలినచోట్ల మున్సిపల్ రాజకీయం రంజుగా మారింది. కాగా, చైర్మన్ పదవులు ఆశించి క్యాంపులు నిర్వహిస్తున్న నేతలకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. మరోవైపు అధికార టీఆర్ఎస్ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి తన సొంత నియోజకవర్గమైన సూర్యాపేటపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. నల్లగొండ మున్సిపాలిటీలో 40 వార్డులు ఉండగా, మొన్నటి ఎన్నికల్లో 22 వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. టీఆర్ఎస్ - 2, బీజేపీ - 4, టీడీపీ - 4, ఎంఐఎం - 3, సీపీఎం - 2, స్వతంత్రులు 3 స్థానాల్లో గెలుపొందారు. చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలంటే 21మంది సభ్యులు అవసరం. ఈ లెక్కన ఎవరి మద్దతు లేకుండానే కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులు దక్కించుకునే మెజార్టీ ఉంది. కానీ ముందునుంచీ చైర్మన్ అభ్యర్థిగా ప్రచారం పొందిన గుమ్ముల జానకి ఓడిపోవడంతో కాంగ్రెస్‌లో కయ్యం మొదలైంది. చైర్పర్సన్ పదవి కోసం ఎవరికి వారే ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా 12వ వార్డు కౌన్సిలర్ ముదిరెడ్డి కళావతి పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. మారిన సమీకరణాలు ఆమెకు ఇబ్బందికరంగా మారాయి. ఒకవిధంగా ఆమెకు పీఆర్టీయూ నేతల కోటలో కౌన్సిలర్ టికెట్ ఇచ్చారు. ఆమెకు వెన్నుదన్నుగా ఉన్న పీఆర్టీయూ నేత, ఎమ్మెల్సీ పూల రవీందర్ టీఆర్ఎస్లో చేరడంతో ఆమెను పక్కన పెట్టినట్లు చెబుతున్నారు. దీంతో 8వ వార్డు కౌన్సిలర్ బొడ్డుపల్లి లక్ష్మికి అవకాశం దక్కొచ్చన్నది కాంగ్రెస్ వర్గాల సమాచారం. కాగా, వైస్‌చైర్మన్‌గా 38వ వార్డు కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డిని ఎన్నుకునేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా, కాంగ్రెస్ కౌన్సిలర్లంతా హైదరాబాద్‌లో క్యాంప్ పెట్టినట్లు సమాచారం. కాగా కాంగ్రెస్‌లో అసంతృప్త కౌన్సిలర్లను తమవైపు తిప్పుకుని చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకోవడానికి విపక్షాలు ఎత్తుగడలు వేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి కనీసం ఐదుగురు కౌన్సిలర్లను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయని సమాచారం. ఇండిపెండెంటుగా పోటీ చేసి గెలిచి, టీఆర్ఎస్లో చేరిన మెరుగు కౌసల్యను చైర్‌పర్సన్‌ను చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్‌కు చైర్పర్సన్ పదవి దక్కకుండా చేయాలని విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. భువనగిరి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడానికి బీజేపీ- కాంగ్రెస్ కూటములు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. రెండు పార్టీలు తమ మద్దతుదారులతో కలిసి క్యాంపులకు తరలిపోయాయి. 30 వార్డులున్న మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు- 8, బీజేపీకి - 8, టీడీపీకి -7, ఇండిపెండెంట్లకు -6, సీపీఎం 1 స్థానంలో విజయం సాధించాయి. మున్సిపాలిటీలో విజయం సాధించడానికి ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. దీంతో బీజేపీ టీడీపీతో అవగాహన కుదుర్చుకుంది. మొదటి రెండున్నర సంవత్సరాలు బీజేపీ, తర్వాత రెండున్నర సంవత్సరాలు టీడీపీ చైర్పర్సన్ పదవి తీసుకునే విధంగా ఒప్పందం చేసుకున్నాయి. దీంతో బీజేపీ, టీడీపీ కౌన్సిలర్లతో పాటు ఒక ఇండిపెండెంట్, ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ క్యాంపునకు తరలారు. కాంగ్రెస్ తనకున్న ఏడుగురు సభ్యులతోపాటు ఐదుగురు ఇండిపెండెంట్లతో కలిసి క్యాంపునకు తరలిపోయారు. సూర్యాపేట మున్సిపాలిటీలో 34 వార్డులున్నాయి. అందులో టీడీపీ, సీపీఎం మిత్రపక్షంగా, టీఆర్ఎస్, సీపీఐ మిత్రపక్షంగా, బీజేపీ, కాంగ్రెస్‌లు ఒంటరిగా వేర్వేరుగా పోటీచేశాయి. టీడీపీ-12 , కాంగ్రెస్ -9, టీఆర్ఎస్ -4, బీజేపీ -4, సీపీఎం 2-, సీపీఐ- 1, ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. ఇటీవల ఇద్దరు కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ, ఇద్దరు స్వతంత్ర కౌన్సిలర్లు మంత్రి జగదీష్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. దీంతో టీఆర్ఎస్ బలం 10కి పెరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ పదవిని టీఆర్ఎస్ కైవసం చేసుకునేందుకు మంత్రి పెద్దఎత్తున వ్యూహరచన చేస్తున్నారు. కాగా టీడీపీలో మిగిలిన 10 మంది కౌన్సిలర్లు ఆంధ్ర ప్రాంతానికి, టీఆర్ఎస్, కొంతమంది కాంగ్రెస్ కౌన్సిలర్లు హైదరాబాద్‌కు వెళ్లి క్యాంపుల్లో ఉన్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సోమవారం సూర్యాపేటలో అభ్యర్థులతో సమావేశం నిర్వహించగా కేవలం ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. కాంగ్రెస్‌లో ఉన్న కొంతమంది కౌన్సిలర్లు టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన క్యాంపులో ఉన్నట్లు సమాచారం. బీజేపీ, సీపీఎం, సీపీఐ కౌన్సిలర్లు ఎలాంటి క్యాంపులకు వెళ్లకుండా తటస్థంగా ఉన్నారు. టీడీపీ-10, బీజేపీ-04, సీపీఎం-02 మొత్తం 16 మందితో పాటు టీడీపీ విప్ జారీ చేస్తే టీఆర్ఎస్లో చేరిన ఇద్దరు కూడా తమకే ఓటు వేయాల్సి వస్తుందని టీడీపీ ధీమాగా ఉంది. దీంతో టీడీపీ చైర్పర్సన్, బీజేపీ వైస్ చైర్మన్ పదవులు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాయి. కోదాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయం నడుపుతోంది. ఆ పార్టీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు, ఒక ఇండిపెండెంట్‌తో కలిసి జూన్ 27న గోవాకు వెళ్లారు. ముగ్గరు కౌన్సిలర్లు మాత్రం కోదాడలోనే ఉన్నారు. తెలుగుదేశానికి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు కూడా వీరికి జతకూడినట్లు సమాచారం. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ఎలాంటి క్యాంప్ నిర్వహించడం లేదు. మొత్తం 36వార్డులకుగాను 30 వార్డులు కాంగ్రెస్ గెలవగా, ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా పార్టీలో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ బలం 31కి చేరింది. బీజేపీ ఒకటి, టీఆర్ఎస్ రెండు, సీపీఎం రెండు వార్డుల్లో గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి సునాయాసంగా చైర్పర్సన్ పదవి దక్కేఅవకాశాలు ఉన్నాయి.