సగం మందికే 'ప్రమోషన్'!
ఉపరాష్ట్రపతి పదవి అలంకరించిన 12 మందిలో ఆరుగురు మాత్రమే రాష్ట్రపతులయ్యారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి మహ్మద్ హమీద్ అన్సారీ సహా మిగిలిన ఆరుగురికి అత్యున్నత రాజ్యాంగ పదవి చేపట్టే అవకాశం రాలేదు. మొదటి ముగ్గురుసర్వేపల్లి రాధాకృష్ణన్, జాకిర్ హుస్సేన్, వీవీ గిరి రాష్ట్రపతులయ్యాక, ఆ తర్వాత ముగ్గురికి (గోపాల్ స్వరూప్ పాఠక్, బసప్ప దానప్ప జట్టి, మహ్మద్ హిదాయతుల్లా) ఆ అదృష్టం దక్కలేదు. తర్వాత వరుసగా ఉపరాష్ట్రపతులైన ముగ్గురూ (ఆర్.వెంకట్రామన్, శంకర్‌దయాళ్ శర్మ, కేఆర్ నారాయణన్) రాష్ట్రపతి పదవిని అధిష్టించారు. కాని, ఇప్పటికి చివరి ముగ్గురుకె.కృష్ణకాంత్, భైరోసింగ్ షెఖావత్, మహ్మద్ హమీద్ అన్పారీ రాష్ట్రపతి భవన్‌లో ఐదేళ్ల చొప్పున నివాసముండే అవకాశం దక్కించుకోలేకపోయారు.
‘ప్రమోషన్’ పొందిన ‘మొదటి’ ముగ్గురు!
మొదటి ఉపరాష్ట్రపతిగా పదేళ్లు చేపిన సర్వేపల్లి రాధాకృష్టన్ పదవీకాలం ముగిసిన వెంటనే 1962లో రాష్ట్రపతి అయ్యారు. తర్వాత ఉపరాష్ట్రపతిగా ఉన్న జాకిర్ హుస్సేన్ కూడా 1967లో కాంగ్రెస్ మద్దతుతో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేసిన తెలుగువాడైన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు నుంచి హుస్సేన్ గట్టి పోటీ ఎదుర్కున్నారు. హుస్సేన్ పదవి చేపట్టిన రెండేళ్లకే మరణించడంతో ఉపరాష్ట్రపతి వీవీ గిరీని అదృష్టం వరించింది. 1969 రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ ‘అధికార’ అభ్యర్థి, ఆంధ్రపదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిని ఓడించడానికి ప్రధాని ఇందిరాగాంధీ నడుం బిగించారు. ‘ఉప’ పదవికి గిరితో రాజీనామా చేయించాక రాష్ట్రపతి పదవికి నామినేషన్ వేయించి ‘అంతరాత్మ ప్రబోధం’ పేరుతో గెలిపించారు.
‘రెండో’ ముగ్గురికి దక్కని చాన్స్!
తర్వాత ముగ్గురికి రాష్ట్రపతి అయ్యే భాగ్యం దక్కలేదు. నాలుగో ఉపరాష్ట్రపతి అయిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జీఎస్ పాఠక్, తర్వాత ఈ పదవి అధిష్టించిన బీడీ జట్టి, ఐదో వైస్‌ప్రెసిడెంట్ మహ్మద్ హిదాయతుల్లా(సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్)ను రాష్ట్రపతిని చేయాలనే ఆలోచన రాజకీయపార్టీలకు రాలేదు. పాఠక్, హిదయతుల్లా ‘ప్రమోషన్’కు ప్రయత్నించలేదు. మైసూరు మాజీ సీఎం అయిన జట్టికి 1977లో కాంగ్రెస్ ఓటమి ఆ అవకాశం ఇవ్వలేదు.
‘మూడో’ ముగ్గురూ ‘ప్రథమ పౌరులయ్యారు’!
ఆ తర్వాత ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన ముగ్గురూ కేంద్ర మంత్రులుగా పనిచేసినవారే. 1982లో ఇందిర ప్రధానిగా ఉండగా ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన కేంద్ర మాజీ మంత్రి ఆర్. వెంకట్రామన్ మూడేళ్లకే 1987లో ప్రధాని రాజీవ్‌గాంధీ నిర్ణయంతో రాష్ట్రపతి అయ్యారు. ఆయన తర్వాత ఉపరాష్ట్రపతిగా ఉన్న మాజీ గవర్నర్ ఎస్‌డీ శర్మ పదవీ కాలం ముగిసే సమయానికి 1992లో కాంగ్రెస్ అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీచేసి గెలిచారు. తర్వాతి ఉపరాష్ట్రపతి కేఆర్ నారాయణన్ కూడా 1997లో దాదాపు అన్ని పారీ‍్టల మద్దతుతో తొలి ‘దళిత’ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
‘నాలుగో’ ముగ్గురికీ అందని అదృష్టం!
యునైటెడ్ ఫ్రంట్ ప్రధాని ఐకే గుజ్రాల్ హయాంలో(1997లో) ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ కృష్ణకాంత్ ఉపరాష్ట్రపతి అయ్యారు. 2002లో అప్పటి ఏపీ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు మద్దతుతో రాష్ట్రపతి పదవికి అభ్యర్థి అయ్యే అవకాశం మొదట కనిపించింది. తర్వాత కొన్ని పరిణామాల వల్ల పదవి ఆయనకు అందినట్టే అంది జారిపోయింది. మహారాష్ట్ర మాజీ గవర్నర్ పీసీ అలెగ్జాండర్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వ్యతిరేకించడంతో ఏపీజే అబ్దుల్ కలాం పేరు చివరకు ఖాయమైంది. కృష్ణకాంత్ తర్వాత పదవిలోకి వచ్చిన షెఖావత్ 2007 రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రతిభా పాటిల్‌పై పోటీచేసి ఓడిపోయారు.
తర్వాత యూపీఏ, వామపక్షాల మద్దతుతో ఉపరాష్ట్రపతి అయిన మాజీ గవర్నర్ ఎంహెచ్ అన్పారీని 2012లో సోనియా రాష్ట్రపతిగా చేయాలని భావించినా చివరికి ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీకి అవకాశమిచ్చారు. అన్సారీ నొచ్చుకోకుండా రెండోసారి ఆయనను ఉపరాష్ట్రపతిని చేశారని అంటారు. పైన చెప్పిన 12 మంది ఉపరాష్ట్రపతుల్లో ముగ్గురు ముగ్గురు చొప్పున ఆరుగురు రెండు విడతలుగా రాష్ట్రపతులయ్యారు. మరి ఈ ‘ఆనవాయితీ’ కొనసాగితే ఆగస్ట్ ఐదున జరిగే ఎన్నికలో గెలుపు ఖాయమనుకుంటున్న ఎం. వెంకయ్యనాయుడికి ప్రమోషన్ లభిస్తుందా? అన్నది భవిష్యత్ కాలమే నిర్ణయిస్తుంది.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)