ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు
- ఆసియా-యూరప్ సమావేశ సదస్సులో హమీద్ అన్సారీ
- ఫ్రాన్స్ ఉగ్రదాడి మృతులకు సదస్సు నివాళి
ఉలాన్‌బాటర్: ఉగ్రవాదంపై అంతర్జాతీయ సమాజం ఉక్కుపాదం మోపాలని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పిలుపునిచ్చారు. మంగోలియా రాజధాని ఉలాన్‌బాటర్‌లో 11వ ఆసియా-యూరప్ సమావేశ సదస్సు (ఏఎస్‌ఈఎం)లో ప్రసంగిస్తూ.. ‘ఉగ్రవాదానికి ఆర్థికంగా సాయం చేసేవారు, బాధ్యత వహించేవారు, దాడులకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. మన సమాజానికి ఉగ్రవాద పెనుభూతం హెచ్చరికలు చేస్తోంది. దీన్ని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు ఏకమై పోరాడాలి.
ఉగ్రవాదం కోరలను పీకేయాలి’ అని పేర్కొన్నారు. శుక్రవారం మొదలైన ఈ సదస్సులో భారత్ సహా 49 దేశాలు పాల్గొంటున్నాయి. ఫ్రాన్స్‌లోని నీస్‌లో జరిగిన ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించి సదస్సును ప్రారంభించారు. ఆసియా, యూరప్ దేశాల మధ్య రాజకీయ, భద్రత, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఏఎస్‌ఈఎం ఏర్పడి 20 ఏళ్లు కావస్తుండటంతోపాటు.. మంగోలియన్ రాజ్యం ఏర్పడి 810 ఏళ్లు పూర్తయిన వేడుకలు కూడా ఈ సందర్భంగా జరగనున్నాయి. వివిధ దేశాల ప్రతినిధులతోపాటు ఈయూ, ఆసియాన్‌ల ప్రతినిధులూ ఇందులో పాల్గొన్నారు.