సాక్షి, హైదరాబాద్: సరైన రీతిలో సానబడితే ప్రతీ విద్యార్థి జాతిరత్నమేనని.. అది కేవలం ఉపాధ్యాయుల వల్లే సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో గురుపూజా దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి సబిత మాట్లాడారు. లక్షల మంది విద్యార్థులు, లక్షకుపైగా టీచర్లున్న విద్యా శాఖ ఓ పెద్ద కుటుంబమని.. గురుపూజోత్సవం తమకు ఓ పెద్ద పండుగ అని పేర్కొన్నారు. ఎవరు, ఎంత ఎత్తుకు ఎదిగినా వారికి చదువు నేర్పిన మాస్టార్లు గుండెల్లో శాశ్వతంగా ముద్ర పడిపోతార న్నారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రతి టీచర్ అంకిత భావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నాం: కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి పెద్ద పీట వేస్తోందని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మనఊరు మనబడి ఓ విప్లవాత్మక పథకమని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. కాగా సాంకేతికపరంగా విద్యా రంగంలో వచ్చే సవాళ్లను ఎదుర్కొనే దిశగా అధ్యాపకులు అడు గులు వేయాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన 128 మంది టీచర్లను సత్కరించారు.ఎమ్మెల్సీలు కూర రఘో త్తమరెడ్డి, ఏవీఎన్ రెడ్డి, సురభివాణి, వర్సిటీల వీసీలు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment