ఎన్నెపల్లిలో మహిళలకు గ్యారంటీ పథకాలను వివరిస్తున్న రేవంత్‌రెడ్డి
వికారాబాద్: ‘అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే.. డిసెంబర్ 9న లాల్‌బహదూర్ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణం స్వీకారం చేయటం ఖాయం. ఆ రోజే ఆరు గ్యారంటీ స్కీంలపై తొలి సంతకం చేసి, తెలంగాణ ప్రజ లకు సోనియమ్మ, మల్లికార్జున ఖర్గే ఇచ్చిన హామీలను నేరవేరుస్తాం..’అని పీసీసీ అధ్య క్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణకు కేసీఆర్ కుటుంబం తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు.
ఉద్యోగం కోసం చదివి చదివి వేసారిపోయిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే.. అసలు ఆమె దరఖాస్తే చేసుకోలేదని నిందలు వేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఆడబిడ్డపైన నిందలేయటానికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పాలకులు అవసరమా? మనకు అని ప్రజలను ప్రశ్నించారు. సోమవారం రాత్రి వికారాబాద్ చిగుళ్లపల్లి గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ నిండా ముంచారు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఈ ప్రాంతం నుంచి పాదయాత్ర ప్రారంభించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని రేవంత్ గుర్తుచేశారు.. అందుకే తాము కూడా ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచార శంఖారావం పూరిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ హుస్నాబాద్ నుంచి ప్రచారం ప్రారంభిస్తే.. మనం వికారాబాద్ నుంచి విజయోత్సవ సభలు మొదలు పెడుతున్నామని అన్నారు. కేసీఆర్‌కు హుస్నాబాద్ కలిసొస్తదో.. కాంగ్రెస్‌కు వికారాబాద్ కలిసొస్తదో తేల్చుకుందాం అని సవాలు విసిరారు. అమరుల త్యాగాలకు చలించిపోయిన సోనియమ్మ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే.. కేసీఆర్ ప్రజలను నిండా ముంచారని ఆరోపించారు.
నాడు వైఎస్సార్ ప్రాణహిత ప్రాజెక్టును డిజైన్ చేసి ప్రారంభించడంతో పాటు రూ.11 వేల కోట్లు ఖర్చు చేశారని, కేసీఆర్ మాత్రం ప్రాజెక్టు డిజైన్ మార్చేసి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా నీళ్లిస్తామని కల్లబోల్లి మాటలతో కాలయాపన చేయడం తప్ప ఈ ప్రాంతానికి బీఆర్‌ఎస్ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
ఈ ప్రాంతానికి ఏమైనా ఆంధ్రోడు సీఎంగా ఉన్నా డా? లేక పక్క రాష్ట్రపోడు సీఎంగా ఉన్నాడా? అని ధ్వజమెత్తారు. తొలుత ఎన్నెపల్లిలోని సయ్యద్ యాసిన్, మాణెమ్మ, యాదయ్య ఇళ్లకు వెళ్లిన రేవంత్ ఆరు గ్యారంటీ పథకాల గురించి వివరించారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్న పేదలందరికీ వీటిని వర్తింపజేస్తామని తెలిపారు. మాజీ మంత్రులు గడ్డం ప్రసాద్‌కుమార్, ఎ.చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డిలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment