Sabitha reddy
-
సానపెడితే పిల్లలు జాతిరత్నాలే!
సాక్షి, హైదరాబాద్: సరైన రీతిలో సానబడితే ప్రతీ విద్యార్థి జాతిరత్నమేనని.. అది కేవలం ఉపాధ్యాయుల వల్లే సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో గురుపూజా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబిత మాట్లాడారు. లక్షల మంది విద్యార్థులు, లక్షకుపైగా టీచర్లున్న విద్యా శాఖ ఓ పెద్ద కుటుంబమని.. గురుపూజోత్సవం తమకు ఓ పెద్ద పండుగ అని పేర్కొన్నారు. ఎవరు, ఎంత ఎత్తుకు ఎదిగినా వారికి చదువు నేర్పిన మాస్టార్లు గుండెల్లో శాశ్వతంగా ముద్ర పడిపోతార న్నారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రతి టీచర్ అంకిత భావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నాం: కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి పెద్ద పీట వేస్తోందని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మనఊరు మనబడి ఓ విప్లవాత్మక పథకమని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. కాగా సాంకేతికపరంగా విద్యా రంగంలో వచ్చే సవాళ్లను ఎదుర్కొనే దిశగా అధ్యాపకులు అడు గులు వేయాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన 128 మంది టీచర్లను సత్కరించారు.ఎమ్మెల్సీలు కూర రఘో త్తమరెడ్డి, ఏవీఎన్ రెడ్డి, సురభివాణి, వర్సిటీల వీసీలు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సాయిచంద్ కుటుంబానికి రూ.కోటిన్నర ఆర్థికసాయం
బడంగ్పేట్/అమరచింత: ప్రజా గాయకుడు, దివంగత నేత సాయిచంద్ కుటుంబానికి సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. బడంగ్‌పేట కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడలో నివాసం ఉంటున్న సాయిచంద్ సతీమణి రజినీకి సోమవారం ప్రభుత్వం తరఫున రూ.కోటి చెక్కును ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి అందజేశారు. అనంతరం రజినీతో పాటు చిన్నారులను ఓదార్చారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దాసోజు శ్రవణ్, జెడ్పీ చైర్‌పర్మన్ తీగల అనిత తదితరులు పాల్గొన్నారు. రజనికి చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి. చిత్రంలో మంత్రి సబితారెడ్డి, దాసోజు సాయిచంద్ తండ్రి, చెల్లెలికి చెక్కుల అందజేత అణగారిన వర్గాల బాధలను, ఆంధ్ర పాలకుల నైజాన్ని ఎండగట్టిన మహాగాయకుడు సాయిచంద్ అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సాయిచంద్ తండ్రి వెంకట్రాములు, చెల్లెలు ఉజ్వలకు చెరో రూ.25 లక్షల చొప్పున చెక్కులను స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
ఫలించిన పరి‘శ్రమ’
మహేశ్వరం: దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పరిశ్రమలు, కంపెనీల స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం రాయితీలు, సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు చెప్పారు. కంపెనీలకు ఎలాంటి సమస్యలు లేకుండా కొనసాగితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని కేసీ తండాలో ఎలక్ట్రానిక్ పార్కులో విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ పరిశ్రమను మంత్రి సబితారెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్ల పెట్టుబడితో విప్రో కంపెనీ పరిశ్రమను స్థాపించిం దని చెప్పారు. ‘ఇక్కడ 90 శాతం మంది స్థానికు లకు ఉపాధి కల్పిస్తాం. అందులో 15 శాతం మహిళలకు కేటాయిస్తాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్–ఐపాస్ ద్వారా 2.20 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతులు ఇచ్చాం. 16 లక్షల మందికిపైగా ఉపాధి కల్పించాం. విప్రో లాంటి పెద్ద కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం అభినందనీయం’అని అన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తారని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని చెప్పారు. విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ వినూత్నమైన వ్యాపారవేత్త అని కేటీఆర్ కొనియాడారు. ప్రేమ్‌జీ కరోనా సమయంలో ఆరోగ్య సంరక్షణకు రూ.25 కోట్లు, టీకా కోసం రూ.12 కోట్లు, స్వచ్ఛంద సేవా సంస్థలకు మరో రూ.44 కోట్లు ఇచ్చారని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితారెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, రాష్ట్ర పరిశ్రమల ఎండీ నర్సింహారెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, విప్రో సీఈఓ వినీత్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరంలో మరిన్ని పరిశ్రమలు: సబితా మహేశ్వరం, రావిర్యాల, తుమ్మలూరు గేటు ప్రాం తాల్లో త్వరలో భారీ పరిశ్రమలు రానున్నాయని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి చెప్పారు. మరిన్ని ఐటీ, ఎలక్ట్రానిక్, ఇతర పరిశ్రమల రాకతో ఈ ప్రాం తం రూపురేఖలు మారిపోతాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు భారత్ వైపు చూసినప్పుడు.. హైదరాబాద్ నగరం వారికి కనిపిస్తోందని చెప్పారు. హైదరా బాద్‌లో ఏర్పాటు చేసిన కంపెనీలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. కంపెనీ ఏర్పాటు చేసేందుకు స్థానికంగా సహకరించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి కేటీఆర్ కంపెనీని సందర్శించి కంపెనీలో తయారైన వస్తువుల తయారీని పరిశీలించి, అక్కడి ఉద్యోగులతో మాట్లాడారు. కంపెనీ ఆవరణలో మొక్కలు నాటారు. జీనోమ్ వ్యాలీలో ‘జాంప్ ఫార్మా’ మర్కూక్: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కర్కపట్లలోని జీనోమ్ వ్యాలీలో రూ.250 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన జాంప్ ఫార్మాను మంగళవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జీనోమ్ వ్యాలీ ఆకర్షణీయమైన పెట్టుబడులకు కేంద్రంగా మారిందన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో 33శాతం హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. జీనోమ్ వ్యాలీని మరింత విస్తృత పరిచేలా మరో 400ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. జాంప్ ఫార్మా గ్రూప్ సీనియర్ వైస్ చైర్మన్ సుకంద్ జునేజా మాట్లాడుతూ కెనడా తర్వాత జీనోమ్ వ్యాలీలోనే అతిపెద్ద జాంప్ ఫార్మాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విప్రో కన్జ్యూమర్ కేర్‌ను ప్రారంభిస్తున్న విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, మంత్రులు కేటీఆర్, సబిత -
వచ్చేవారంలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు: సబితారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : వచ్చేవారంలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు వెల్లడవుతాయని మంత్రి సబితారెడ్డి తెలిపారు. జులై 1 నుంచి డిగ్రీ, పీజీ తరగతులు ప్రారంభంకానున్నాయని వెల్లడించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఫీజుల విషయంలో గతంలో ఇచ్చిన జీవో 46ను అమలు చేస్తామన్నారు. ఫీజుల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈనెల 25 నుంచి టీచర్లు స్కూళ్లకు రావాలని ఆదేశించారు. -
కేబీసీ సీజన్ 12: చలించిపోయిన అమితాబ్
ముంబై: బిగ్ బీ అబితాబ్ వ్యాఖ్యాతగా కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ) 12 వ సీజన్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పాపులరైన ఈ షోలో తెలంగాణ నుంచి సబితా రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని అల్వాల్ ప్రాంతంలో ఆమె టీచర్‌గా పనిచేస్తున్నారు. అయితే, ఎప్పుడూ సరదా సరదాగా షోను నడిపించే బిగ్ బీ సబితా లైఫ్ జర్నీ గురించి తెలుసుకుని విచలితుడయ్యారు. భర్తను కోల్పోయి, పిల్లలను పెంచి పెద్ద చేసిన తీరు పట్ల ఆయన ప్రశంసలు కురింపిచారు. స్ఫూర్తిమంతమైన జీవన ప్రయాణమని అమితాబ్ కొనియాడారు. ఒక టీచర్‌గా పిల్లలకు మంచి విద్యను అందిస్తానని సబిత చెప్పుకొచ్చారు. జీవితంలో పిల్లలకు ఆస్తులు ఇవ్వకున్నా కానీ, మంచి విద్యను అందివ్వాలని చెప్పారు. ఆమె పాల్గొన్న కేబీసీ సీజన్ 12, ఆరో ఎపిసోడ్ సోనీ టీవీలో నేటి రాత్రి (మంగళవారం) ప్రసారమవనుంది. ప్రస్తుతం సోనీ ప్రీమియం సబ్స్క్రైబర్లకు ఈ ఎపిసోడ్ అందుబాటులో ఉంది. (చదవండి: స్నేహితుడికి అమితాబ్ ఫన్నీ రిప్లై) సబితారెడ్డి పిల్లలు అమ్మ కోరిక మేరకు ఇక కేబీసీ సీజన్ 12, ఆరో ఎపిసోడ్లో సబితారెడ్డితో పాటు మరో 7 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. కంటెస్టెంట్ ప్రదీప్‌కుమార్ సూద్ బిగ్ బీ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి 12.5 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకుని ఆట నుంచి పక్కకు తప్పుకున్నారు. కేబీసీలో పాల్గొనడం తన తల్లి కోరిక అని ప్రదీప్ చెప్పారు. ఆమె కల నెరవేరినందుకు ఆనందంగా ఉందన్నారు. గతంలో కేబీసీలో పాల్గొనేందుకు ప్రయత్నించానని ఈసారి ఆ అవకాశం దక్కిందని పేర్కొన్నారు. ఆయన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సీనియర్ డివిజనల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ప్రదీప్ తర్వాత సబితారెడ్డి కేబీసీ క్విజ్‌లో పాల్గొన్నారు. ఇదిలాఉండగా.. అమితాబ్, ఆయన తనయుడు అభిషేక్ కొద్ది రోజుల క్రితం కరోనాబారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ పేరుతో ఘరానా మోసం) -
కంటైన్మెంట్ జోన్లలో ప్రత్యేక ఏర్పాట్లు
-
తెలంగాణ: టెన్త్ పరీక్షలకు సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలతోనే పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మార్గదర్శకాలను పాటిస్తూ జూన్ 8 నుంచి జులై 5 వరకు పరీక్షలు జరపనున్నామని వెల్లడించారు. పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. అదనంగా మరో 2,005 పరీక్షా కేంద్రాలను పెంచామని పేర్కొన్నారు. (పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల) తల్లిదండ్రులు తమ పిల్లలను పరీక్షా కేంద్రాలకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. గంట ముందుగా వచ్చినా విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. విద్యార్థులకు మాస్క్‌లు ఇస్తామని పేర్కొన్నారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు ప్రత్యేక పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. సెంటర్ల వివరాలు, సహాయం కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. -
ఇంటర్ ఫలితాల ప్రాసెస్‌పై నిపుణుల కమిటీ: సబిత
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలు, ఫలితాల ప్రాసెస్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సాంకేతిక నిపుణులతో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రాసెస్‌లో సాంకేతిక సహకారాన్ని సీజీజీ నుంచి తీసుకుంటున్నామని, దాని నిర్వహణ తీరును ఈ కమిటీ ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. గురువారం హైదరాబాద్‌లోని మంత్రి తన కార్యాలయంలో ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. నిపుణుల సలహాలు తీసుకుంటూ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. గతేడాది ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్స్, మార్చి 4 నుంచి 29 వరకు థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా పరీక్షలకు 9,85,840 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, వీరి కోసం 1,994 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమావేశంలో ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పరీక్షల నియంత్రణాధికారి అబ్దుల్ ఖాలిక్ పాల్గొన్నారు. -
ఓడి.. గెలిచిన నేతలు
కాల గమనంలో మరో మైలు రాయి దాటిపోయే సమయమాసన్నమైంది. ఎన్నో తీపి గుర్తులు, విజయాలు, అంతకు మించిన విషాదాలు,వైఫల్యాలను తనలో నింపుకొనికాలగర్భంలో కలిసేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. మరికొన్ని గంటల్లో కొత్త ఏడాదిలోకి అడుగిడుతున్నతరుణంలో మహానగర యవనికపై 2019 సంవత్సర ‘పొలిటికల్’ప్లాష్‌బ్యాక్.. సాక్షి,సిటీబ్యూరో: ఈ ఏడాది(2019) జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహానగర ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. నగరంలోని నాలుగు లోక్‌సభ స్థానాలను నాలుగు పార్టీల అభ్యర్థులకు కట్టబెట్టారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన జి.కిషన్‌రెడ్డి(అంబర్‌పేట), ఎ.రేవంత్‌రెడ్డి(కొడంగల్)కు 2019 లోక్‌సభ ఎన్నికలు రాజకీయ పునర్జన్మనిచ్చాయి. సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి బీజేపీ అభ్యర్థిగా కిషన్‌రెడ్డి, మల్కాజిగిరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్‌రెడ్డి ఊహించని విజయాలు అందుకున్నారు. కిషన్‌రెడ్డి ఏకంగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపడితే, రేవంత్ సైతం కాంగ్రెస్‌లో కీలక స్థాయికి వెళ్లారు. వీరితోపాటు హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో అసదుద్దీన్ ఓవైసీ మరోసారి ఢిల్లీ సభకు వెళ్లగా, టీఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పుడే క్రియాశీల రాజకీయ ఆరంగేట్రం చేసిన గడ్డం రంజిత్‌రెడ్డి చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి విజేతగా నిలిచారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు షాక్ 2018లో శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు ఆనందం ఆర్నెల్లకే ఆవిరైంది. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు కిరణ్ పోటీకి దిగగా ఇక్కడ బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి విజేతగా 14,836 ఓట్ల మెజారిటీ రావటం తలసానిని ఇబ్బంది పెట్టింది. అదేవిధంగా మేడ్చల్‌లో 2018 శాసనసభ ఎన్నికల్లో ఏకంగా 88 వేల ఓట్ల మెజారిటీ సాధించి మంత్రిగా పదవి దక్కించుకున్న మల్లారెడ్డి.. లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి టీఆర్ఎస్ అభ్యర్థికి కేవలం 8,087 ఓట్ల మెజారిటీనే తీసుకు రాగలిగారు.ఇక ఎల్బీనగర్లో సీన్ రివర్స్ అయింది. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన సుధీర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరిన తర్వాత కూడా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 27,404 ఓట్ల భారీ మెజారిటీ వచ్చింది. ఉప్పల్, మల్కాజిగిరి. సికింద్రాబాద్, ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్‌పేట నియోకజవర్గాల్లోనూ టీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థులు వెనకబడి పోయారు. కొందరిలో నిరాశ.. కాంగ్రెస్‌లో విజయం సాధించి టీఆర్ఎస్లో చేరిన మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి రాష్ట్ర క్యాబినెట్లో చేరగా, కూకట్‌పల్లికి చెందిన నాయకుడు నవీన్‌రావుకు ఎమ్మెల్సీగావచ్చిన చాన్స్ వారి అనుయాయుల్లో కొత్త శ్వాసను నింపింది. మంత్రి పదవులు ఆశించిన నాయిని నర్సింహారెడ్డి(ఎమ్మెల్సీ), మైనంపల్లి హన్మంతరావు(మల్కాజిగిరి) నిరాశే ఎదురవగా.. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలకు అప్పట్లో అగ్రనేతలిచ్చిన అభయం ఈ ఏడాది కాలంలో కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం. ముఖ్యంగా ఉప్పల్ నుంచి బండారి లక్ష్మారెడ్డి, ఖైరతాబాద్ నుంచి విజయారెడ్డి, శేరిలింగంపల్లి నుంచి బండి రమేష్, రామ్మోహన్‌గౌడ్(ఎల్బీనగర్) తదితరులకు నిరాశ తప్పలేదు. -
పింఛన్ వస్తుందా బాలయ్య తాత..
తుక్కుగూడ : తుక్కుగూడ మున్సిపాలిటీ కేంద్రంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సోమవారం ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై వెళ్తుండగా శ్రీశైలం జాతీయ రహదారిపై చిరు వ్యాపారం చేసుకుంటున్న కర్కాలపాడు గ్రామానికి చెందిన బాలయ్య కనిపించాడు. దీంతో మంత్రి సబితారెడ్డి హలో.. తాత బాగున్నావా అని పలకరించింది. వ్యాపారం ఎలా ఉంది ? కేసీఆర్ సార్ ఇచ్చే పింఛన్ వస్తుందా? అడిగి తెలుసుకున్నారు. దీనితో బాలయ్య అమ్మ నాకు పింఛన్ వస్తుందని మంత్రికి తెలిపాడు. -
రంగంలోకి సబిత
దిల్సుఖ్నగర్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యలో మహేశ్వరం నియోజకవర్గంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానంపై ఆగ్రహంతో టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్న మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి... ఆ పార్టీ నాయకుల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఎదురుకాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇందులో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ ముఖ్య నాయకులతో ఆమె ఫోన్లో మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని గురువారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసిన సబిత, ఆమె తనయుడు కార్తీక్‌రెడ్డి... ఆయనతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. పార్టీ బలోపేతంపై చర్చించారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ను కలిసిన సబిత, ఆమె తనయుడు కార్తీక్‌రెడ్డి త్వరలో చేవెళ్లలో నిర్వహించనున్న బహిరంగ సభలో టీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. ఎన్నికల్లో టీఆర్ఎస్ చేవెళ్ల అభ్యర్థిని గెలిపించే బాధ్యతను సీఎం సబితకు అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులను టీఆర్ఎస్లో చేర్చేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌ను ఖాళీ చేసేందుకు పథకం వేస్తున్నారు. టీఆర్ఎస్లో చేరనున్న ప్రజాప్రతినిధులు, నాయకులకు ఆమె అన్ని విధాలా భరోసా ఇస్తున్నారు. -
2013 చట్టం ప్రకారమే భూసేకరణ చేయాలి
కందుకూరు: ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం సేకరిస్తున్న భూములను 2013 చట్టం ప్రకారం తీసుకోవాలని మాజీ హోంమంత్రి సబితారెడ్డి ప్రభుత్వం డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె మండలంలోని ముచ్చర్లలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ జెండాను ఆమె ఆవిష్కరించారు. అనంతరం ఆ గ్రామ పరిధిలోని ఊట్లపల్లిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకట్రాంరెడ్డి, రాములు అధ్యక్షతన ఫార్మా రైతులతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో మొదట ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తే అక్కడి ప్రజలు తరమికొట్టడంతోనే ఇక్కడికి మార్చారన్నారు. భూమిని నమ్ముకుని బతికే వారికి అన్యాయం జరగకుండా భూసేకరణ చట్టాన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఈ చట్టం ప్రకారం పట్టా, అసైన్డ అనే తేడా లేకుండా మార్కెట్ ధరకు మూడు రెట్లు పరిహారం ఇవ్వాలని, రైతు కూలీలు, చేతి వృత్తుల వాళ్లకు భుక్తి కోసం అదనంగా పరిహారం అందించేలా చట్టం ఉందన్నారు. రూ.30 లక్షలు ఇవ్వాల్సి చోట కేవలం రూ.8 లక్షలే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్నారు. మల్లన్నసాగర్లో దౌర్జన్యంగా భూములు తీసుకుంటూ రైతుల అంగీకారంతోనే తీసుకుంటున్నట్లు హరీష్‌రావు చెబుతున్నారని విమర్శించారు. ఇక్కడ చేపట్టిన జీఓ 45పై కోర్టుకు వెళ్తామన్నారు. కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు లేకుండా ఎందుకు భూములు సేకరిస్తున్నారని ప్రశ్నించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించేలా జిల్లాలో ఫార్మాసిటీకి ఎక్కడ భూములు తీసుకుంటున్నా రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు అంబయ్యయాదవ్, జిల్లా ప్లానింగ్ కమిటీ మాజీ సభ్యుడు బొక్క జంగారెడ్డి, కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణనాయక్, పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు ప్రసూన, మహేశ్వరం ఎంపీపీ స్నేహ, వైస్ ఎంపీపీ స్వప్న, జల్పల్లి మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రఘుమారెడ్డి, చిర్ర సారుు లు, దర్శన్‌రెడ్డి, శివమూర్తి, పాండుగౌడ్, బాబయ్య, కమాల్‌ఖాన్, వీరారెడ్డి, రాణాప్రతాప్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, రాజు, రాజేష్, వెంకట్రాంరెడ్డి, రాములు, ఎంపీటీసీలు ఉన్ని వెంకటయ్య, సత్త య్య తదితరులు పాల్గొన్నారు. -
ఆ సీఎం మాట తప్పారు.. మరి కేసీఆర్..?
చేవెళ్లః ‘చేవెళ్లలో ప్రస్తుతమున్న ఆస్పత్రి స్థాయిని వంద పడకలకు అభివృద్ధి చేస్తాం. కొద్ది రోజుల్లోనే మీ ఆశలు నెరవేరుతాయి. గ్రామీణ ప్రజలకు మరింత ఆధునిక, మెరుగైన వైద్యం లభిస్తుంది’ ఇవి.. 2012లో ఇందిరమ్మ బాటలో భాగంగా చేవెళ్లలో పర్యటించిన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాటలు. ఆ మాటలు మాట్లాడి రెండేళ్లు గడిచినా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతమున్న 50 పడకల ఏరియా ఆస్పత్రి కూడా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ ఆస్పత్రి గురించి ప్రస్తుత సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఆస్పత్రి అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. చేవెళ్లలో కమ్యూనిటీ ఆస్పత్రిని అప్పటి ముఖ్యమంత్రి మర్రిచెన్నారెడ్డి ఏర్పాటు చేయించారు. 30 పడకలతో ప్రారంభమైన ఈ ఆస్పత్రిలో సౌకర్యాలు లేకపోవడంతో అప్పట్లో ప్రసూతి శస్త్రచికిత్సలు చేసేవారుకాదు. వైద్యులు ఒకరిద్దరు మాత్రమే ఉండటంతో పేదలకు వైద్యం అందడమే గగనంగా మారింది. 2002లో మాజీ హోంశాఖ మంత్రి సబితారెడ్డి చేవెళ్ల ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రిగా స్థాయిని పెంచారు. అయినప్పటికీ సేవల్లో మార్పులేకపోవడంతో స్థానికులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించక తప్పేది కాదు. 2008లో శంషాబాద్ విమానాశ్రయం ప్రారంభం కావ డంతో బెంగుళూరు- ముంబయి మార్గంలో వాహనాలను షాద్‌నగర్ నుంచి చేవెళ్ల మీదుగా కంది వద్ద హైవే రోడ్డుకు దారిమళ్లించారు. దీంతో ఈ రోడ్డుపై వాహనాల రద్దీ పెరిగి ప్రమాదాల సంఖ్య కూడా తీవ్రమైంది. అప్పట్లో నిత్యం ఐదారు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అత్యవర సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువచ్చినా సౌకర్యాల ఏర్పాటులో అధికారులు విఫలమయ్యారు. కనీస సౌకర్యాలు కరువు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కనీసం మరుగుదొడ్లు, రోగులకోసం వచ్చే సహాయకులకు ఉండడానికి వసతిలేకపోవడం, రాత్రివేళల్లో వైద్యులు అందుబాటులో ఉండకపోవడం లాంటి సమస్యలు రోగులపాలిట శాపంగా పరిణమించాయి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన ప్రతిసారి బెడ్లు చాలక మహిళలను ఒక్కో మంచంపై ఇద్దరిని లేకపోతే నేలపై పడుకోబెట్టడమో జరుగుతోంది. సర్జన్లు, ప్రసూతి, మత్తు, పిల్లలు, దంత వైద్యులు ఉన్నా తగిన యంత్రాలు లేకపోవడం, ఉన్నా అవిసరిగా పనిచేయకపోవడంతో వారి సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చే పరిస్థితి లేకుండాపోయింది. స్థాయి పెంచితే ఎంతో లాభం చేవెళ్ల ఏరియా ఆస్పత్రి స్థాయి పెంచితే ఎన్నో సౌకర్యాలు సమకూరుతాయి. వైద్యనిపుణులు, వైద్యులు, సిబ్బంది, స్టాఫ్ నర్సుల సంఖ్య పెరుగుతుంది. రేయింబవళ్లు అందుబాటులో వైద్యులుంటారు. తాగునీరు. బాత్రూంలు తదితర కనీస సౌకర్యాలుంటాయి. అంతేకాకుండా ఆధునిక సౌకర్యాలతో కూడిన అంబులెన్స్‌లు మరిన్ని రోగులకోసం అందుబాటులో ఉంటాయి. ఎమర్జెన్సీ సర్వీసుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు. కేసీఆర్ హామీ నెరవేరేనా.. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఇటీవల టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా చేవెళ్ల, శంకర్‌పల్లిలో ఆస్పత్రుల స్థాయిపెంచి ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. అయితే కనీసం కేసీఆర్ అయినా ఈ హామీని నెరవేరుస్తారో లేక గత సీఎంలాగే మళ్లీ నిరాశకే గురిచేస్తారోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
అర్ధంతరంగా ఆగిపోయాయి..!
మహేశ్వరం: మండలంలో పలు అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. మాజీ హోంమంత్రి సబితారెడ్డి గతంలో మంజూరు చేసిన పలు అభివృద్ధి పనులు నిధులు కొరత, స్థల సేకరణలో జాప్యంతో ముందుకు సాగడం లేదు. ప్రధానంగా 2012లో ఇందిరమ్మ బాట కార్యక్రమంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.8 కోట్ల అంచనా వ్యయంతో మండల కేంద్రంలో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. అలాగే మండల కేంద్రంలో రూ.6 కోట్ల నిధులతో ఆర్టీసీ డిపో, రూ.76 లక్షలతో ప్రభుత్వ జూనియర్ కళాశాల, రూ.55 లక్షలతో ఫైర్‌స్టేషన్, రూ.65 లక్షలతో తహసీల్దార్ కార్యాలయానికి నూతన భవనం తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ పనులకు గతంలో కొన్ని నిధులు మంజూరయ్యాయి. అయితే 2014లో ప్రభుత్వం మారినప్పటినుంచి వీటికి నిధులు మంజూరు కాకపోవడంతో అభివృద్ధి పనులన్ని అర్ధంతరంగా ఆగిపోయాయి. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే తమ కష్టాలు తీరుతాయని భావించిన మండల ప్రజలు ప్రస్తుత పరిస్థితులతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. బంక్ లేక ఆగిన డిపో పనులు మండల కేంద్రంలోని కేసీ తండా సమీపంలో సర్వే నెంబరు 306లో మాజీ హోంమంత్రి సబితారెడ్డి అప్పట్లో రూ.6 కోట్ల నిధులతో ఆర్టీసీ బస్ డిపో పనులకు శంకుస్థాపన చేశారు. పనులు 90 శాతం పూర్తయ్యాయి. అయితే డి పోలో డీజిల్ ట్యాంకు పనులు అసంపూర్తిగా ఉ న్నాయి. దీంతో ఇక్కడినుంచి బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవల రాష్ట్ర, రోడ్డు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఈ డిపోను పరిశీలించారు. 2015లో డిపో నుంచి బస్సులు నడిపించేలా చర్యలు తీసుకుంటానన్నారు. అద్దె భవనంలో అగ్నిమాపక కేంద్రం సబితారెడ్డి రూ.55ల క్షలు మంజూరు చేయించి మండలకేంద్రంలో ఫైర్ స్టేషన్‌కు అప్పట్లో శిలాఫలకం వేశారు. స్థలం ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విడుదలైన నిధులు తెలంగాణ ప్రభుత్వంలో నిలిచిపోయాయయి. ప్రస్తుతం ఎంపీడీఓ కార్యాలయం ముందు అద్దె భవనంలో ఫైర్ స్టేషన్ కొనసాగుతోంది. నిర్మాణానికి నోచుకొని జూనియర్ కళాశాల మండల కేంద్రంలోని భారత్ పెట్రోల్‌బంకు పక్కన అప్పటి కేంద్రమంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి,సబితారెడ్డిలు కలిసి రూ.76 లక్షల అంచనా వ్యయంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్థలం ఉన్నా కొత్త ప్రభుత్వంలో నిధులు నిలిచిపోయాయి. నిధులు రాగానే పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో జూనియర్ కళాశాల కొనసాగుతోంది. 100 పడకల ఆస్పత్రికి స్థలం కొరత మండల కేంద్రంలోని పాత ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో రూ.8 కోట్ల అంచనా వ్యయంతో అప్పటి సీఎం ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మబాటకు వచ్చి 100 పడకల ఆస్పత్రి పనులకు శంకుస్థాపన చేశారు. ప నులకు టెండర్ పక్రియ పూర్తయింది. స్థలం లేదని అధికారులు పనులను నిలిపివేశారు. ప్రస్తు తం స్థలం చూపిస్తే ఆస్పత్రి పనులను ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. -
అమాత్యా.. పవరేదీ?
చేవెళ్ల: ‘ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లు ఉంది విద్యుత్ అధికారుల పరిస్థితి. నిర్మాణం పూర్తిచేసుకున్న ఈర్లపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు మంత్రి ప్రారంభించి నెలరోజులవుతున్నా ఇప్పటికీ దిష్టిబొమ్మలా మారింది. ఆపరేటర్లు లేరన్న నెపంతో నెల రోజులనుంచి ఇంకా విద్యుత్ సరఫరాను ఆ సబ్‌స్టేషన్ నుంచి ప్రారంభించలేదు. వివరాలోకి వెళితే.. ఈ ప్రాంతంలోని పలు గ్రామాల ప్రజలు వ్యవసాయంపైనే అధికంగా ఆధార పడడంతో విద్యుత్ హెచ్చుతగ్గుల సమస్య తీవ్రంగా ఉంది. లో ఓల్టేజీతో బోరు మోటార్లు కాలిపోతుండడంతో రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎట్టకేలకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి, అప్పటి హోంమంత్రి సబితారెడ్డి శంఖుస్థాపన చేశారు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో ఏపీసీపీడీసీఎల్ సాధారణ నిధుల నుంచి 33-11కేవీ సబ్‌స్టేషన్‌కు సుమారుగా రూ.రెండు కోట్ల రూపాయలను కేటాయించారు. కాగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెలలో పనులను పూర్తి చేశారు. ఆపరేటర్లు, సిబ్బందిని కేటాయించకుండానే మంత్రి మెప్పు పొందడానికి పనులు పూర్తయిన నెలరోజుల తరువాత అక్టోబరు 14వ తేదీన రాష్ట్ర రవాణామంత్రి మహేందర్రెడ్డిచే అట్టహాసంగా ప్రారంభింపజేశారు. ఉపయోగం ఇదే.. ఈ సబ్‌స్టేషన్‌తో ఈర్లపల్లి, ఎనికెపల్లి, కమ్మెట చౌరస్తా, కమ్మెట, గొల్లగూడ, శంకర్పల్లి మండలంలోని కొత్తపల్లి తదితర గ్రామాలకు విద్యుత్ లో ఓల్టేజీ సమస్య తీరనుంది. ఈ సబ్‌స్టేషన్ ద్వారా సరఫరా అయితే 100 యామ్స్ విద్యుత్ దేవునిఎర్రవల్లి సబ్‌స్టేషన్ నుంచి లోడ్ తగ్గి, విద్యుత్ హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉండదు. కారణమేమిటంటే.. ఏదైనా విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభం కావడానికి ప్రాథమిక అంశాలను పూర్తి చేసుకోవాలి. మంత్రులుగానీ, ఇతర ప్రజాప్రతినిధుగానీ ప్రారంభించిన వెంటనే ఆ యా గ్రామాలకు ఈ సబ్‌స్టేషన్ ద్వారా విద్యుత్ సరఫరా వెంటనే ప్రారంభం కావాలి. ఆపరేటర్లను నియమించాలి. కానీ నలుగురు ఆపరేటర్లు, సిబ్బందిని కేటాయించకుండానే విద్యుత్ అధికారుల అనాలోచిత నిర్ణయం, అత్యుత్సాహం మూలంగా మంత్రి మహేందర్‌రెడ్డితో ఈ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. కానీ ఆపరేటర్లను నియమించలేదన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ సరఫరా మాత్రం జరగలేదు. దీంతో ఈ సబ్‌స్టేషన్ సాంకేతికంగా పనులు ప్రారంభం కాలేదు.