ఆ సీఎం మాట తప్పారు.. మరి కేసీఆర్..?
చేవెళ్లః ‘చేవెళ్లలో ప్రస్తుతమున్న ఆస్పత్రి స్థాయిని వంద పడకలకు అభివృద్ధి చేస్తాం. కొద్ది రోజుల్లోనే మీ ఆశలు నెరవేరుతాయి. గ్రామీణ ప్రజలకు మరింత ఆధునిక, మెరుగైన వైద్యం లభిస్తుంది’ ఇవి.. 2012లో ఇందిరమ్మ బాటలో భాగంగా చేవెళ్లలో పర్యటించిన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాటలు. ఆ మాటలు మాట్లాడి రెండేళ్లు గడిచినా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతమున్న 50 పడకల ఏరియా ఆస్పత్రి కూడా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ ఆస్పత్రి గురించి ప్రస్తుత సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఆస్పత్రి అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పారు.
చేవెళ్లలో కమ్యూనిటీ ఆస్పత్రిని అప్పటి ముఖ్యమంత్రి మర్రిచెన్నారెడ్డి ఏర్పాటు చేయించారు. 30 పడకలతో ప్రారంభమైన ఈ ఆస్పత్రిలో సౌకర్యాలు లేకపోవడంతో అప్పట్లో ప్రసూతి శస్త్రచికిత్సలు చేసేవారుకాదు. వైద్యులు ఒకరిద్దరు మాత్రమే ఉండటంతో పేదలకు వైద్యం అందడమే గగనంగా మారింది. 2002లో మాజీ హోంశాఖ మంత్రి సబితారెడ్డి చేవెళ్ల ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రిగా స్థాయిని పెంచారు. అయినప్పటికీ సేవల్లో మార్పులేకపోవడంతో స్థానికులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించక తప్పేది కాదు.
2008లో శంషాబాద్ విమానాశ్రయం ప్రారంభం కావ డంతో బెంగుళూరు- ముంబయి మార్గంలో వాహనాలను షాద్‌నగర్ నుంచి చేవెళ్ల మీదుగా కంది వద్ద హైవే రోడ్డుకు దారిమళ్లించారు. దీంతో ఈ రోడ్డుపై వాహనాల రద్దీ పెరిగి ప్రమాదాల సంఖ్య కూడా తీవ్రమైంది. అప్పట్లో నిత్యం ఐదారు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అత్యవర సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువచ్చినా సౌకర్యాల ఏర్పాటులో అధికారులు విఫలమయ్యారు.
కనీస సౌకర్యాలు కరువు
చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కనీసం మరుగుదొడ్లు, రోగులకోసం వచ్చే సహాయకులకు ఉండడానికి వసతిలేకపోవడం, రాత్రివేళల్లో వైద్యులు అందుబాటులో ఉండకపోవడం లాంటి సమస్యలు రోగులపాలిట శాపంగా పరిణమించాయి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన ప్రతిసారి బెడ్లు చాలక మహిళలను ఒక్కో మంచంపై ఇద్దరిని లేకపోతే నేలపై పడుకోబెట్టడమో జరుగుతోంది. సర్జన్లు, ప్రసూతి, మత్తు, పిల్లలు, దంత వైద్యులు ఉన్నా తగిన యంత్రాలు లేకపోవడం, ఉన్నా అవిసరిగా పనిచేయకపోవడంతో వారి సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చే పరిస్థితి లేకుండాపోయింది.
స్థాయి పెంచితే ఎంతో లాభం
చేవెళ్ల ఏరియా ఆస్పత్రి స్థాయి పెంచితే ఎన్నో సౌకర్యాలు సమకూరుతాయి. వైద్యనిపుణులు, వైద్యులు, సిబ్బంది, స్టాఫ్ నర్సుల సంఖ్య పెరుగుతుంది. రేయింబవళ్లు అందుబాటులో వైద్యులుంటారు. తాగునీరు. బాత్‌రూంలు తదితర కనీస సౌకర్యాలుంటాయి. అంతేకాకుండా ఆధునిక సౌకర్యాలతో కూడిన అంబులెన్స్‌లు మరిన్ని రోగులకోసం అందుబాటులో ఉంటాయి. ఎమర్జెన్సీ సర్వీసుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు.
కేసీఆర్ హామీ నెరవేరేనా..
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా చేవెళ్ల, శంకర్‌పల్లిలో ఆస్పత్రుల స్థాయిపెంచి ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. అయితే కనీసం కేసీఆర్ అయినా ఈ హామీని నెరవేరుస్తారో లేక గత సీఎంలాగే మళ్లీ నిరాశకే గురిచేస్తారోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.